విరాటపర్వం
మూడవ ఆశ్వాసం
వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పసాగాడు.
ఉపకీచకుల వధ
భీముడు ఆ విధంగా కీచకవధ గావించి వెళ్లి, వంట ఇంటి పరిసరాన ఒళ్లంతా కడుగుకొని, మంచి గంధం రాసుకొని తన సెజ్జ మీద కూర్చున్నాడు.
అక్కడ నర్తనశాలలో ద్రౌపది భీముడు వంట ఇంటికి పోయి నిశ్చింతగా ఉండుటకు కవాలసినంత కాలం వేచి ఉన్నది. తదుపరి నర్తనశాల నుండి బయటకువచ్చి కాపలావాళ్లను పిలిచి నా భర్తలైన గంధర్వులు చేత చచ్చాడీ సింహబలుడు ! ఈ పాపాత్ముడు తన పాపఫలం పొందాడు. లోపలికి పోయి చూడండి అన్నది.
కావలి వాళ్లు క్షణమాత్రం కొయ్య బొమ్మల్లాగ అయ్యారు. అతివేగంగా పోయి దివిటీలు తెచ్చి నాట్యశాలలో బిలబిలలాడుతూ జొరబడ్డారు. ఆ కోలాహలం విని యావన్మంది ఉప కీచకులు పరుగెత్తుకు వచ్చారు. తన అన్న సింహబలుడి వికృత శవం చూచేసరికి కొందరు గుండెలు బ్రద్ధలై హా అంటూ దభాలున పడి మూర్ఛపోయారు. కొందరు ఆశ్చర్యంతో శిలా విగ్రహాల్లాగయ్యారు. కొందరు ఆ పీనుగుపై బడి గుండెలు బాదుకొని ఏడ్చారు. కొందరు శవం దాపుకు పోవడానికే భయపడి దూరంగా కూర్చొని నెత్తీనోరూ బాదుకున్నారు. ఈ ఏడుపులు పెడబొబ్బలకు బంధువులంతా ప్రోగైనారు.
అయ్యో ! అయ్యో ! మానవుల్లో ఇంత విచిత్రంగా పీనుగైన వాళ్లున్నారా ? ఎన్నడూ కనీవినీ ఎరుగం దుర్జయమైన బలం దూష్యంగా వృధా పోయిందా ! మూర్కుడి మనస్సు కొని త్రోవలపోయి తనకు వచ్చే ముప్పు తెలుసుకోదు. క్రొవ్వితే చేటు తప్పుతుందా. అయ్యయ్యో ! తల ఏది ! చేతులేవి ! కాళ్లెక్కడ ! ఇవన్నీ ఎలాగ పోయాయి.
గంధర్వుల చేత చ్చేవాళ్లంతా ఇలాగే చస్తారుకాబోలు ! లేకపోతే ఇతని మీద కక్ష కొలదీ ఇలాగ చేశారో ! వింతగా ఉంది ! అంటూ అనేక విధాల వాపోయారు.
ఇంక ఊరుకోండి. మనం ఎంత ఏడ్చి నెత్తీనోరు బాదుకుంటే మాత్రం అన్నయ్య వింటాడా, వస్తాడా ? ఇంకా అతణ్ణి తీసుకుపోదాం అంటూ ఒక ఉప కీచకుడు మిగిలిన వారిని ఓదార్చాడు.
వారు, సింహబలుడికి అగ్ని సంస్కార సన్నాహం ఆరంభించారు. అప్పడు వారికి చేరువలో నిలబడి చోద్యం చూస్తూ ఉన్న ద్రౌపది వారికంట పడింది. వారుమహాకోపోద్రిక్తులయారు. ఆమెను పట్టుకొని చేతులు పెడవిరిచి కట్టేశారు. దీని పాపిష్టి రూపమే అతడి ప్రాణాలు తినేసింది. దీనిని కూడా ఆ శవంతో కలిపి కాల్చివేయాలి అని తీర్మానించారు. విరాటుడితో చెప్పి చేయాలని అతనివద్దకు వెళ్ళారు.
సింహబలుడి మరణవార్త అప్పటికే విని, విరాటుడు విచారంలో మునిగి ఉన్నాడు. ఏమైనా సరే సైరంధ్రిని సింహబలుడితోబాటు దహనం చేయాలని ఉద్దేశించాము. నీతో చెపుదామని వచ్చాము. నీవు అంగీకరించాలి అన్నాడు ఆవేశంతో
తాను వద్దనిని వారు వినేటట్లు లేరని విరాటుడు గ్రహించాడు. సరే మీకు తోచినట్లు చేయండి అన్నాడాతడు.
వారంతా హడావిడిగా నర్తనశాలకు తిరిగివచ్చారు.
అన్నయ్యకు ఈమె పైగల కోరికను ఈ విధంగానైనా తీర్చి, అతణ్ణి సంతోషపెడదాం. ఈ కులట అతనితోటే అంతం అవుతుంది అంటూ ద్రౌపదిని కీచకుడి శవం మీద పెట్టి కట్టారు ఉప కీచకులు. ఆశుచి, దుష్టుడు, నీచుడు అయిన కీచకుడి పీనుగుతోబాటు, శుచి, శిష్టురాలు, ఉదాత్త అయిన ద్రౌపదిని కూడా మోసుకొని, ఉపకీచకులు చేతిదివిటీలతో
దారిచూసుకొంటూ దిక్కులు పిక్కటిల్లేట్లుగా ఏడుస్తూ శ్మశాన మార్గం పట్టారు.
ద్రౌపది భయపడింది. కన్నీటి వెలువ పొంగి ఆమె ముఖాన్ని ముంచెత్తింది.
అయ్యో ! దిక్కులేనిదాన్నయామ ! నామొరాలకించండీ ! మీరున్నారనే భయమన్నా లేకుండా ఉపకీచకులు నాకు హాని చేస్తున్నారు ! ఓ జయా ! ఓ జయంతా ! ఓ విజయా ! ఓ జయత్సేనా ! ఓ జయద్బలా ! ఓ నాధులారా ! ఓ గంధర్వులారా ! నన్ను ఉపకీచకులు తమ అన్న శవం మీద కట్టి మోసుకుపోతున్నారు. వేగంగా రండి ! రక్షించండి ! రక్షించండి ! అంటూ పెద్దపెట్టున రోదన చేస్తున్నది ద్రౌపది.
ఆమె ఆ క్రందన భీముడి చెవినబడ్డది. నా భార్యని వీళ్ళు ఇంత పనిచేశారా ? అంటూ మహారోషంతో మహావేగంతో మరియొక మార్గాన శ్మశానానికి ముందుగానే చేరాడు. అక్కడ నలుదిక్కులా పరికించి ఒక మహోన్నత వృక్షాన్ని ఊడబెరికి భుజం మీద పెట్టుకుని ఉపకీచకుల కొరకు ఎదురుచూస్తున్నాడు.
కీచకుడి శవంతో వస్తూ ఉన్న ఉపకీచకులు దవ్వుదవ్వుల నుండి మహావృక్షంతో తాండవమాడుతున్న భీముడి భయంకరాకారం చూచారు. కొయ్యబారిపోయారు.
బాబాయ్ ! గంధర్వులు, గంధర్వులు ! చచ్చాం ! బాబాయ్ ! అని కేకలు వేస్తూ ద్రౌపది సమేతంగా కీచకుడి కలబేరాన్ని క్రిందకు జారవిడిచారు. కొందరు అక్కడక్కడనున్న గోతుల్లో నక్కారు. కొందరు చెట్టెక్కారు. కొందరు శ్మశానం చెరువులో దాక్కున్నారు. కొంతమందికి కాళ్ళు వడకి పారిపోలేక కూలబడ్డారు. గొల్లుమంటూ, భీముడు వాళ్లందరనూ తనచేతిలోని చెట్టుతో చేతులతీట తగ్గేట్లుగా తరిమి తరిమికొట్టి చంపేశాడు.
ఈ విధంగా మాట అయిదుగురు ఉపకీచకులు పరలోకానికి పోయారు. అప్పటికి భీముడి క్రోధం చల్లారింది. ద్రౌపది కట్టువిప్పి ఆమెను సుదేష్ణ మందిరానికి పొమ్మని చెప్పి తాను వేరొక మార్గాన వంట ఇల్లు చేరాడు.
గంధర్వులు ఉపకీచకులందర్నీ నిశ్శేషంగా తుడిచిపెట్టేశారనే ఘోరవార్త విరాటుడికి తెలిసినది. అతడు చకితుడయ్యాడు. సహోదరులంతా ఒక్కసారే చనిపోయారని సుదేష్ణ దుఃఖం అపారమైంది. ఆమెను విరాటుడు అనేక విధాల ఓదార్చాడు.
ఊరుకో ! ఏడ్చి ఏం లాభం ? సైరంధ్రిని మాత్రం ఇక్కణ్ణుంచి ఎలాగో ఒకలాగ సంపెయ్యాలి. ఆమెను వెళ్ళిపొమ్మని నా మాటగా చెప్పు. పురుషుడెవడైనా ఆమె చెంతకు పోతే ప్రమాదం కనుక నేను చెప్పడానికి భయపడుతున్నాను. ఆడవాళ్ళు, మృదువుగా, నెమ్మదిగా ఆమెతో చెప్పడం మంచిది. ఆమె అందకత్తె. ఆమె సౌదర్యం ఏ మగాడినైనా పరవశుణ్ణి చేస్తుంది. అందుచేత ఆమె మన పట్టణంలో వారికెప్పుడూ ప్రమాదకరమే. తలక్రింద త్రాచుపాములాగ ఆమెను ఇంట బెట్టుకుని బ్రతకలేము అన్నాడు విరాటుడు.
భర్త భావం సమంజసమేనని భార్య ఏకీభవించింది. ద్రౌపదిని ఏదోవిధంగా వెళ్ళగొట్టాలని నిశ్చయించుకొన్నది సుదేష్ణ.
అప్పటికి తెల్లగా తెల్లారినది.
తెల్లారకముందే శుభ్రంగా స్నానం చేసి, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పట్టణంలో ప్రవేశించి రాజవీధిని నడుస్తున్నది ద్రౌపది. పౌరులు కీచకుల మహామారి వెడుతోందని కొందరు, ఒళ్ళు క్రొవ్వు కరిగించగలదు, ఆమె వైపు చూడకు అని ఒకరినొకరు హెచ్చరించుకొంటూ కొందరు, అల్లంత దూరాన చూచి గుండె గతుక్కుమని పెడమొగం పెట్టుకోనేవారు కొందరు, ఎదురుగా వచ్చేవారు ఎంతో దూరాన్నుంచే తప్పుకొని వేరే త్రోవను పోయేవారు కొందరు, ఒక వేళ ఆమెకు చేరువలోకి రావడం సంభవిస్తే గజగజ వణకుతూ నిలబడిపోయేవారు కొందరు, గుండెలు చేత్తో పట్టుకొని ఆమ్మో ! రాకాసి అని అదిరిపడేవారు కొందరు, పులిని చూచిన లేడిలా పరుగెత్తేవారు కొందరు అయారు. ఇవన్నీ గమనించి ఆమె లోలోపల ఆనందించింది.
వంట ఇంటి గుమ్మంలో నిలబడ్డ భీముణ్ణి చూచింది. ఆమెలో ప్రేమ ఉప్పొంగింది. తన కృతజ్ఞత అతనికి అందజేయాలనుకొన్నది. ఇంకనూ నెమ్మదిగా నడుస్తూ, అతని వైపు చూడకుండా కీచకుల స్పర్శవల్ల కలిగిని పాపాన్ని కడిగివేసి నన్ను రక్షించిన గంధర్వపతికి భక్తితో నిరంతరమూ నమస్కారాలు చేస్తూ బ్రతుకుతాను అని తనలో తాను అనుకొంటున్నట్లు అన్నది.
భార్యకు అపాయం కలిగినప్పుడు కాపాడిన భర్త భర్తా ? అది మగతలనమా ? లోకం హర్షిస్తుందా ? నీ భర్తలు తమ విద్యుక్త ధర్మం నెరవేర్చారు. ఆపాటి దానికి వాళ్ళని పొగడక్కర్లేదు అన్నాడతడు నిగూఢంగా.
ఆమె అతని మాటలకు ఆనందపడుతూ అల్లనల్లన నర్తనశాల చేరింది. విరాటకన్యకల నృత్యంచూచే నెపంతో అర్జునుణ్ణి చూడగోరి లోలపకు వెళ్ళినది. వారందరు ఆమెను చుట్టి గుమిగూడారు.
కీచకుల వల్ల కీడు పొందకుండా క్షేమంగా వచ్చానా అమ్మా ! నిన్ను హింసించిన దుర్మార్గుడు యమలోకానికి పోతే చూచైనా బుద్ధి తెచ్చుకోవద్దూ వాడి తమ్ముళ్ళు ? నీ భర్తలు తమ శత్రువులను ఇలాగ కడతేరుస్తారు కాబోలు ! అని కన్యకలామెను పలుకరించారు.
ఆ పాపాత్ములు నీపై చేసిన అత్యాచారము, వారంతా మృత్యవాత పడిన విధానము నువ్వు చెప్పగా వినాలిని ఉంది అన్నాడు బృహన్నల.
ఆడపిల్లలకు నాట్యం నేర్పుతూ ఆనందంలో మునిగి అయ్యో ! సైరంధ్రి ఏమయిందో అనే భేదం ఈషణ్మాత్రమైనా లేకపోబట్టేకదా ఇలాగ నువ్వు ముఖంతో నన్ను అడగడానికి పిలుపడింది అని ద్రౌపది చెప్పిపొడిచింది.
నీకు వచ్చిన అగచాట్లకు దుఃఖిస్తూ ఉంటే, నిరర్థకమైన ఈ ఏహ్యపు పుట్టుక పుట్టినందుకు నా ఏడుపు ఎవరు ఏడుస్తారో చెప్పు ? నేను నిన్నెరుగనా ? నువ్వు ఆవింద్వపు నువ్విట్లా బాధపడుతున్నావంటే నిజంగా నాకే విచారము లేదు అన్నాడు బృహన్నల.
తన సహోదరులలాగ మారువేషం వేసుకోవడేమగాక, ఊర్వశి ఇచ్చిన శాపంవల్ల శరీరంలోనే మార్పులు కలిగిన కారణాన తానిప్పుడు శత్రువులతో పోరాడలేని స్థితిలో ఉన్నట్లు ఆవిధంగా గుప్త సంభాషణతో జ్ఞప్తికి తెచ్చాడామెకు.
అవునవును ? అంతలేసి మాటలు అనడం ఎందుకు ? తెలియకపోలేదు. నీవు తగువిధంగా నడుచుకోవడమే నా అభిమతం అన్నదామె.
ద్రౌపది అక్కడనుంచి అంతఃపురంలోనికి వెళ్ళింది. ఏమీ ఎరుగని దానివలె ఎప్పటిలాగానే సుదేష్ణే కడకు చేరుకొంది. ఆమెను చూచేసరికి సుధేష్ణ హృదయంలో భయం, దుఃఖం కమ్ముకొన్నది. ఆమెకు సవినయంగా స్వాగతము ఇచ్చినది. తన ప్రక్కనే కూర్చోబెట్టుకొన్నది. ఆమె ముఖాన్ని రెప్పపాటు వేయకుండా విఘడియకాలం చూచినది.
అమ్మా ! నువ్వు మిక్కిలి చక్కనిదానవు. మగవాళ్ళు గుండె నిబ్బరం లేనివాళ్ళు. ఈ విషయాన్ని గురించి రాజు బాగా ఆలోచించి భయపడిపోయాడు. నీ ఇష్టంవచ్చినచోటకు వెళ్ళిపోమ్మని నిన్ను ప్రార్థించమన్నాడు.. బలం గల భర్తలు ఉన్నారని తరిమి తరిమి చంపించ చూస్తున్నావు. నీ చేరువకి రావడానికే జనం భయపడిపోతున్నారు. మా ఊరు, మా రాష్ట్రము వదలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళు తల్లీ అన్నది సుదేష్ణ. ఆమెకు గతించిన తమ్ముళ్ళు జ్ఞప్తికి రాగా, గొంతు గద్గదపోయినది.
అదివరకువలెనే ఇంక పడమూడు దినములు మాత్రం ఓపికపట్టి, ఈ అంతఃపురంలో ఉండనిస్తే నా కోరిక తీరుతుంది. ఈ తరువాత నా భర్తలు ఎంతో సంతోషించి నీ కోర్కెలు సఫలీకృతం చేస్తారు. మీ రాజుకి సర్వశుభాలు ఇస్తారు...సైరంధ్రి ఇలాగ అనడానికి గల కారణం ఏమిటో అని అనవసరంగా లేనిపోని ఆలోచనలు చేయకు. ఏది ఎలాగ అనాలో అలాగ అవుతుంది.విచారించి ఏమి లాభం ? తీరా చిట్టచివర దినాల్లో గౌరవం పోగొట్టుకోకూడదు అని ధృఢంగా నిశ్చయించుకోవడం ఉచితం అన్నది ద్రౌపది.
సరే అంతవరకు నువ్వు మా ఇంట్లో ఉండడానికి సమ్మతించాను. నీ పనులు నువ్వు చేసుకొంటూ ఉండు. నా కొడుకుల్నీ, నా భర్తనీ మాత్రం అతి దయతో కాపాడు. నీ మనస్సుకి ఎలాగ ఊరట కలుగుతుందో సమస్తమూ అలాగ చేస్తాను అన్నదామె.
ద్రౌపది తిరిగి ఎప్పటియట్ల అంతఃపురంలో ఉంటున్నది.
రాజు మరది కీచకుడు - బలంలో తనతో సరియైనవాడు ఎక్కడాలేడని విర్రవీగిన జగజ్జెట్టి కట్టకడపటకు చిత్రమైన బలవంతపు చావుచచ్చాడు. వాణ్ణి అలాగ హతమార్చినవారు ఎంతో గొప్పవీరులో ఒక్క మానిని గురించి గంధర్వుల చేత కీచకుడు ఘోరమైన చావు చచ్చాడు ! ఊరక నిష్కారణంగా విరాటరాజు కుడి భుజం తెగిపోయింది. కీచకవంశం సమూలంగా నాశనమైంది. అని విరాట పురజనులు పరిపరివిధాల విరగబడి చెప్పుకున్నారు. ఈ విధంగా కీచకుడు విచిత్రమైన, విపరీతమైన వికృతమైన బలనన్మరణం చెందాడనే వార్త వాడవాడలా పొక్కి, దేశదేశాలకు ప్రాకింది.
గ్రోగ్రహణం దాని పూర్వాపరాలు
పాండవుల ఉనికి కనుగొని అజ్ఞాతవాస వ్రతం భంగం చేయాలనే దురుద్ధేశ్యంతో దుర్యోధనుడు అనేక మంది వేగులవాళ్ళను దేశదేశాలకు పంపించాఉ. వారు లోకం అంతా గాలించి పాండువలజాడ తెలుసుకోలేక హస్తినాపురానికి తిరిగివచ్చారు. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, సుశర్మ. దుశ్శాసనుడు, సర్వసైన్యాధిపతులు, పురప్రముఖులు ఆదిగా గలవారలతో నిండుకొలువులో కనకపు సింహాసనంపై ఆశీనుడైయున్న దర్యోధనుడి సన్నిధిని ముకుళిత హస్తులై, వినమ్రులై నిలబడ్డాడు.
దేవరవారి ఆజ్ఞను శిరసావహించి పాండవులు, ద్రౌపది అజ్ఞాతంలో ఉన్న ప్రదేశం కనుగొనడానికి బయలుదేరిచ తొలుత వారు వెళ్ళిన మహారణ్యాలకు వెళ్ళాము. పొదలు, చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు, గుహలు, గోతులు సర్వము గాలించాను. ఒకచోట రధాలు నడిచిన ఆనవాళ్ళు కనుపించగా వాటిని అనుసరించి వెళ్ళి ద్వారకానగరం చేరుకున్నాము. పాండవులు ఆ పట్టణంలో దొరకుతారనే ఆశతో అనేక ప్రయత్నాలు చేశాంగాని వారి జాడ ఎక్కడా దొరకలేదు.
అక్కడ నుంచి మేమంతా నానా దేశాలకు విడిపోయాము. ఎన్ని కష్టనష్టాలకు గురిఅయినా ఓర్చి, విసుగూ, విరామమూ లేకుండా వెదకి వెదకి, పాండవుల జాడ తెలుసుకోలేక, చివరకు సంకేత స్థలానికి చేరుకున్నాము. విషయం మనవి చేసుకొంటున్నాము. పిదప దేవరవారి చిత్తం. తను అనుజ్ఞ మేరకు చేయసంసిధ్ధంగా ఉన్నాము. పాండవులు దిక్కుమాలిన వాళ్ళయి తెన్నుతోచక చచ్చిపోయి ఉంటారు. ఈ లోకంలోనే ఉంటే మాకు దొరకకుండా ఉండజాలరు.
మరి ఒక విశేషం విన్నాము. మత్య్సదేశపు రాజైన విరాటుడి మరది కీచకుడు అనేవాణ్ణి, ఒకానొక వనిత కారణాన, గంధర్వులు అర్ధరాత్రి వేళ, అతి రహస్యంగా, అపూర్వమైన విధాన చంపివేశారట ! ఆ చావును గురించి అతిచిత్రంగా, ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు ప్రభూ. అయుధాలేమీ ఉపయోగింపబడ లేదుట ! శిరస్సు, కాళ్ళూ, చేతులు డొక్కలోనికి త్రోసి పీనుగును ముద్దగా చేసేశారుట ! అతని తమ్ముళ్ళందర్నీ ఒక్కణ్ణయినా తప్పిపోనీయకుండా ఆ రాత్రికి రాత్రే చంపేశారుట ! విరాటుడు మన శత్రువు కనుక విషయం తమతో మనవి చేసుకుంటున్నాము. పిదప దేవరవారి చిత్తం. పాండవువులను అన్వేషించే పని తను అనుజ్ఞ మేరకు చేయసిద్ధంగా ఉన్నాము అన్నాడొక గూఢాచారి.
సరే ! ప్రస్తుతానికి మీరంతా వెళ్ళిపోవచ్చు అన్నాడాతము విచారంగా.
శపథ ప్రకారం పని పూర్తిచేసుకొని, రాజ్యాన్ని ఆశించక పూర్వమే పాండవులు ఎక్కడ ఉన్నారో వెదకి కనుగొని వాళ్ళను తిరిగి నానా అగచాట్లు అనుభవించమని అరణ్యవాసానికి పంపాలి. వారిని కనిపెట్టడం దుర్ఘటంగా ఉంది. జాగ్రత్తగా ఆలోచించి మీ ఉపాయాలు చెప్పండి అని మంత్రులను కోరాడు దుర్యోధనుడు.
|