8
 

 

పాత్ర‌ల స్వ‌భావాదుల‌ను ర‌చయిత స్వోక్తిగ చెప్పుట ఒక ప‌ద్ధ‌తి. పాత్ర‌ల చ‌ర్య‌ల ద్వారా పాత్ర‌ల స్వ‌రూప వివ‌ర‌ణ‌మును స్వ‌భావ వివ‌ర‌ణ‌మును స్ఫురింప‌జేయుట రెండ‌వ ప‌ద్ధ‌తి. రెండ‌వ‌ది వాచ్య‌ముగ‌నుండ‌దు కావున ర‌చ‌యిత కేవ‌ల‌ము రేఖాకృతిగ చిత్రించిన బొమ్మ‌ల‌కు విమ‌ర్శ‌కుడు లేదా పాఠ‌కుడు త‌న‌కు ప్రియ‌మైన వ‌ర్ణ‌ముల‌ను తాను చేర్చి త‌న‌కిష్ట‌ములైన య‌లంకార‌ముల‌ను తాను చేసి సంప్రీతుడగుట‌కు తావుండును. కావున‌నీ రెండ‌వ విధ‌మున పాఠ‌కుని విశ్లేష‌ణ శ‌క్తికి వీలుండుట‌చేత నీ ప్ర‌క్రియ‌నే శ్రేష్ఠ‌మ‌న‌వ‌ల‌యును.

విశ్వ‌నాథ‌వారు సృష్టించిన పాత్ర‌లు ఈ రెండు ర‌క‌ముల‌కు చెందిన‌వైన‌ను రెండ‌వ ర‌క‌మున‌కు చెందిన న‌ధిక‌ముగ‌నున్న‌వి. మొద‌టి విధ‌మున‌కు చెందిన పాత్ర చిత్ర‌ణ‌మును చేసిన న‌వ‌ల‌లు ముఖ్యముగ పురాణ‌వైర గ్రంథ‌మాల‌, కాశ్మీర‌, నేపాళ రాజ‌వంశ గాధావ‌ళుల‌కు చెందిన న‌వ‌ల‌లు.


ప‌రోక్ష పాత్ర చిత్ర‌ణ‌మున‌కు మిగిలిన న‌వ‌ల‌లుదాహ‌ర‌ణ‌ములు. వ్యంగార్థ‌ము, అన‌గా వాచ్యార్థ‌ముగాక మ‌రియొక య‌ర్థ‌ము స్ఫురింప‌చేయుట‌లో ఏక‌వీర లోనిమాన‌వ స్వ‌భావ విరుద్ధ‌ములైన స్వ‌భావ‌ములుగ‌ల పాత్ర‌లు విమ‌ర్శ‌కుని ప్ర‌మోద‌పెట్ట‌జాల‌వు. మాన‌వ స్వ‌భావ‌ములో న‌న్నియును సుగుణ‌ములేయుండ‌వు. కొన్ని య‌వ‌గుణ‌ముల‌కూడ నుండుట క‌వ‌కాశ‌మున్న‌ది.కావున అన్ని మంచి గుణ‌ముల‌ను నాయ‌కుని అన్ని దుర్గుణ‌ముల‌కును ప్ర‌తినాయ‌కుని సృష్టించి వారిరువురి మ‌ధ్య‌న సంఘ‌ర్ష‌ణ‌మును కల్గించుట న‌వ‌ల‌లో ప‌రిపాటియైన‌ది. నాయ‌కుడు మూర్తీభ‌వించిన సుగుణ‌ముల‌ఖ‌ని. నాయిక సౌంద‌ర్య‌రాశి. ప‌ర‌మ సుకుమారి. ఇట్టి స్వ‌భావ‌ములుగ‌ల పాత్ర‌ల‌ను సృష్టించి న‌వ‌ల మొత్త‌ము వీరి చుట్టునల్ల‌చూచుట గాంచి ఆ చంట బాపిరాజుగారు నిర‌సించిరి. ఇట్టి స్వ‌భావ విరుద్ధ‌ములైన పాత్ర‌ముల‌ను న‌వ‌ల‌లందు జొనిపి యింత‌వ‌ర‌కును త‌న తెలుగువారు స్వాభావిక‌మైన న‌వ‌ల‌నొక్క‌టియైన ర‌చింప‌రు అనిరి. ఏకవీర‌ను స్వ‌ర్గానికి నిచ్చెన‌లు లోని వ‌సుంధ‌ర‌ను పేర్కొన‌వ‌చ్చును. విశ్వ‌నాథ‌వారిట్టి య‌స్వాభావిక‌మైన పాత్ర‌ల‌ను సృష్టించియుండ‌లేదు. మిహిర‌కులుడు అను న‌వ‌ల‌యందు మిహిర‌కులుడు నాయ‌కుడు. కాని య‌త‌నికున్న‌దొక్క‌టే సుగుణ‌ము. అది య‌త‌ని భార్య‌ను ప్రేమించ‌ట‌య‌న్న‌ది. మిగిలిన దౌష్ట్య‌మంత‌యును ప్ర‌తినాయ‌క ల‌క్ష‌ణ‌ము. ఇట్లే ధ‌ర్మ‌చ‌క్ర‌ములోని వీర‌పురుష‌ద‌త్తుడు మొద‌లైన‌వారిలో నాయ‌క‌, ప్ర‌తినాయ‌క ల‌క్ష‌ణ‌ములు చొప్పించియున్నారు. ఇదియే మ‌న‌స్సులో సంఘ‌ర్ష‌ణ‌మైన‌ది. ప్ర‌తినాయ‌క ల‌క్ష‌ణ‌మైన దుర్గుణ‌త్వ‌మును జ‌యించుట‌యే సుగుణ‌మున‌కు అంత్య విజ‌య‌ము ల‌భించుట‌.

మ‌నోవిశ్లేష‌ణ‌ము విశ్వ‌నాథ‌వారి న‌వ‌ల‌లోనున్న ప్ర‌త్యేక‌త పాత్ర‌ల స‌జీవ‌త్వ‌మును నిరూపించుట‌లోని విష‌య‌ము స‌హ‌క‌రించినట్లు మ‌రియొక‌టి స‌హ‌క‌రింప‌దు. వేయి ప‌డ‌గ‌లు లోని మంగ‌మ్మ‌లో చెలియ‌లిక‌ట్ల లోని ర‌త్నావ‌ళిలో ఏకవీర లో ప్రాణ‌శ‌క్తి మిక్కుట‌ముగ గోచ‌రించుచున్న‌ద‌ని ధూళిపాళ శ్రీ‌రామ‌మూర్తిగారు వ్రాసిరి. ఆద‌ర్శ‌ప్రాయ‌మైన జీవిత‌మును గ‌డిపిన అరుంధ‌తి, రుక్మిణమ్మారావు శ‌శిరేఖ‌ల‌క‌న్న ధ‌ర్మ వ్య‌తిక్ర‌మ‌ణ‌మును జ‌రిపిన పాత్ర‌ల‌లో ప్రాణ‌శ‌క్తి గోచ‌రించుట‌కు కార‌ణ‌ము మ‌న‌వునిలోనున్న వెలుగునీడ‌ల‌చ‌ట ప్ర‌స్ఫుటించుట‌యే. ఆద‌ర్శంగా జీవించిన పాత్ర‌ల‌లోకంటె తోవ‌త‌ప్పిన పాత్ర‌ల‌లోనే క‌వి సందేశం వ్య‌క్త‌మైంది.
ర‌త్నావ‌ళీ మంగ‌మ్మ‌ల జీవ‌యాత్ర అంత‌రంగ‌ముగుండ ప‌య‌నించి లోలోతుల‌ను త్ర‌వ్వుకొనుచు సాగిపోయిన‌ది. వీరి చ‌ర్య‌లు క్ర‌మ‌ప‌రిణామ‌మున పయ‌నించిన‌వి. అరుంధ‌త్యాదుల య‌వ‌త‌ర‌ణ‌మొక యున్న‌త స్థాన‌మునుండి జరిగిన‌ది. వారొక ద‌శ‌కు ముందుగానే చేరుకొని యుండుట‌లో వారికి సంఘ‌ర్ష‌ణ‌ముండ‌వ‌ల‌సిన య‌వ‌స‌ర‌ము లేక‌పోయిన‌ది. వారి మార్గ‌ము ముందే పూవులు ప‌రుప‌బ‌డి యుండ‌గా ర‌త్నావ‌ళ్యాదులు పంక‌మంటిన పాద‌ముల‌తో శ్ర‌మించి మార్గాన్వేష‌ణ‌మును చేయ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. పాత్ర చిత్ర‌ణ‌మున నీభేద‌ము సువ్య‌క్త‌ము.

స్త్రీ పాత్ర చిత్ర‌ణ‌మ‌న్న విశేషాంశ‌మున‌కు వ‌చ్చిన‌దో విశ్వ‌నాథ వారు సృష్టించిన స్త్రీ భార‌తీయ త‌త్వ‌దృష్టికొక మూర్తి క‌ల్ప‌న‌ము. పెక్కు తావుల ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌మున‌కు సంప్ర‌దాయ ర‌క్ష‌ణ‌మున‌కు పురుషుల‌క‌న్న స్త్రీలే స‌మ‌ర్థ‌త‌గ‌ల‌వార‌ని పేర్కొని యుండుట జ‌రిగిన‌ది.

స్త్రీ


స్త్రీ పాత్ర చిత్ర‌ణ‌మును గురించి చ‌ర్చించుట‌కు ముందు భార‌త‌దేశ‌మున స్త్రీల‌కు గ‌ల స్థాన మెట్టిది, పూర్వ‌కాల‌మునుండి స్త్రీ లెట్లు భావింప‌బ‌డిరి. అన్న విష‌య‌మునుగూర్చి చ‌ర్చింప‌వ‌ల‌సియున్న‌ది. రాజ‌కీయ‌ములైన అనేక దండ‌యాత్ర‌ల వ‌ల‌న స్త్రీ యొక్క యునికి మ‌ధ్య‌యుగ‌మున క్షీణించిన‌ద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. స‌మాజ‌మున స్త్రీ పురుషు లిరువురు స‌మానులే. ఒకరి యెక్కువ‌గాని మ‌రియెక‌రి త‌క్కువ‌గాని యుండ‌దు.

భార‌త‌దేశ‌మున మ‌హిళ‌కు ల‌భించినంత గౌర‌వ‌ము ప్ర‌పంచ‌ములో మ‌రియే యిత‌ర దేశ‌మునందున‌లేద‌ని ప్ర‌ఖ్యాతిగాంచిన అనిబిసెంటు అభిప్రాయ‌మును వెలిబుచ్చియున్నారు. సాహిత్య ప్ర‌పంచ‌మున‌కూడ నింత‌టి గౌర‌వ‌ము స్త్రీల‌కు ల‌భించిన‌ది. ప్ర‌పంచ సాహిత్యం యావ‌త్తూ ప‌రికించిచూస్తే భార‌తీయ సాహిత్యంలో క‌న‌బ‌డే స్త్రీత్వం మ‌రెక్క‌డా క‌న‌బ‌డ‌దు అని అనిబిసెంటు వ్య‌క్త‌ముచేసిన భావ‌మును విజ్ఞాన‌వంతులెవ్వ‌రును ఖండింప సాహ‌సింప‌రు.


భార‌తీయ సాహిత్య‌ము వేద‌ముల‌తో ప్రారంభ‌మ‌యిన‌ది క‌నుక వేద‌కాల‌ముయొక్క స్త్రీ ప‌రిస్థితి యెట్లున్న‌దో తెలిసికొన‌వ‌ల‌సియుండును. కొన్ని ధ‌ర్మ‌ములు, కొన్ని నీతులు, కొన్ని క‌ట్టుబాట్లు, కాల‌మాన ప‌రిస్థితుల‌నుబట్టి మారుచుండును. మార‌వ‌లెనుకూడా. ఇట్లు మారుట కాల ప్ర‌భావ‌ము వ‌ల‌న జ‌రుగుచుండెను. యుగ‌ముగ‌ముల‌కు ధ‌ర్మ‌ము కొన్ని కొన్ని మార్పుల‌కు లోన‌యినందుచేత‌నే యుగ‌ధ‌ర్మ‌మ‌న్న మాట ప్ర‌భ‌వించిన‌ది. భార‌తీయుల హృద‌య‌వాదులు, ఆత్మ‌వాదులు న‌గుట‌చేత స్త్రీల‌నొక విధ‌ముగ పురుషుల నొక విధ‌ముగ చూడ‌లేద‌నియే చెప్ప‌వ‌లెను. మిగిలిన ప్ర‌పంచ సంస్కృతికిని భార‌తీయ సంస్కృతికినిగ‌ల ముఖ్య భేద‌మిచ్చ‌ట‌నే శ్రీ ఖండ‌వ‌ల్లి ల‌క్ష్మీరంజ‌న‌ము భార‌తీయ, పాశ్చాత్య‌భావ‌ముల‌లోని భేద‌మునిట్లు చెప్పియున్నారు. భార‌తీయుల ఎక్కువ‌గా హృద‌య‌వాదులు. పాశ్చాత్యులు బుద్ధిప‌రులు. మ‌వాన‌రు క‌ర్మ‌బుద్ధులు. దైవ‌మునే బ‌ల‌ముగా నెంచువారు. పాశ్చాత్యులు క‌ర్మ‌సిద్ధాంత‌ము నొప్పుకొన‌రు. పుర‌ర్జ‌న్మ‌ను వారంగీక‌రింప‌రు. భార‌తీయ‌మైన స‌మ‌స్త క‌ళ‌లును ఈ సిద్ధాంత‌ము నాధార‌ముగ జేసికొని పాలింప‌బడిన‌వే. భార‌తీయ సిద్ధాంత‌ము ప్ర‌కార‌ము మాన‌వులు శాంతియుత‌ముగ జీవించుట‌కు ఒక చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌వంటిది ఏర్ప‌డియున్న‌ది. సుఖ‌దుఃఖ‌ముల‌ను ఒక్క ర‌క‌ముగ చూచుచు క‌ర్తృత్వ‌మును దైవ‌ముపై వ‌ద‌లి క‌ర్మ‌ను చేయుట‌యే వ్యక్తి యొక్క విధిగ చెప్ప‌బ‌డిన‌ది. మోక్ష ప్రాప్తికై భ‌క్తి, జ్ఞాన‌, క‌ర్మ‌యోగి మార్గ‌ముల‌లో నొక‌దానిని నిర్ణ‌యించుకొని త‌న్మార్గ‌గామి య‌గుట‌యే భార‌తీయ జీవ‌న విధాన‌ములోని ముఖ్యాంశ‌ము. ఈ విధాన‌మున స్త్రీ పురుష విభేద‌ము చెప్ప‌బ‌డ‌లేదు. ఆత్మ‌య‌నున‌ది యిరువురికి నొక్క‌టియే. కాని యిరువురకును కొన్ని కొన్ని హద్దులు ఋషుల‌చే నిర్ణ‌యింప‌బడియున్న‌వి.


బృహ‌దార‌ణ్య‌కోప‌నిషత్తులో పురుషుడు త‌న ఏకాకి త‌న‌మును చూచి భ‌య‌ముచెంది ఆనంద‌ముకొర‌కు భ‌య‌నివార‌ణ‌ము కొర‌కు స్త్రీని సృష్టించెన‌నియున్న‌ది. ఏకాకీ న‌వైర‌మ‌తా. ప్ర‌కృతి పురుషులే స్త్రీ పురుషులు రాముడు సూర్య‌వంశ‌మున‌ను సీత పృధ్వినుండియు జ‌నించిరి. ఇచ‌ట రాముడు ఆకాశ‌త‌త్త్వ‌ముగ‌ను సీత పృధ్వీత‌త్త్వ‌ముగ‌ను భావింప‌బడిరి. క‌ర్తృత్వ భ‌ర్తృత్వ‌ముల‌లో మార్పులున్న‌ను విది నిర్వ‌హ‌ణ‌మున స్త్రీ పురుషులిరువురును స‌మానులేయైయుండిరి.

భార‌తీయ త‌త్త్వ‌మున‌కు అర్ధ‌నారీశ్వ‌ర భావ‌ము ముఖ్యాధార‌మైన విష‌య‌ము. ప్ర‌కృతి పురుషుల స‌మాన‌త్వ మిచ‌ట నిరూపింప‌బ‌డిన‌ది. ప్రాచీన కాల‌ములో మాతృస్వామ్య‌ముండెడిద‌ని చ‌రిత్ర‌కారులు చెప్పుచున్నారు. మాతృస్వామ్య‌మున్న‌ను పితృస్వామ్య‌మున్న‌ను మాతృదేశ‌ము అన‌గా మాతృదేవ‌త‌కు ప్ర‌థ‌మ స్థాన‌మీయ‌బ‌డుట మాత్ర‌ము స‌ర్వ‌కాల‌ముల‌లోను వ్య‌క్త‌మ‌గుచున్న విష‌య‌ము. ఇది నేటికి న‌విచ్ఛిన్న‌ముగ ప‌రిపాలింప‌బడుచునే యున్న‌ద‌నుట నిస్సంశ‌య‌ము. ధ‌ర్మ‌ప‌త్ని భావ‌మును యజుర్వేద‌ములోని శ్లోక‌ము ఇట్లు తెలుపుచున్న‌ది.

సురీయో దేవీయుష‌స‌గ్ం

యోచ‌మునా మ‌రీయః

న‌యోషా య‌భ్యేతు ప‌శ్చాత్‌


పురుషుడు స్త్రీని ఎలా అనుస‌రిస్తున్నాడో అలాగే సూర్యుడు ఉషాదేవిని అనుస‌రిస్తున్నాడ‌ని భావ‌న స్త్రీ పురుషు లొక‌రికొక‌రు స‌హ‌క‌రించుకొనుట ఇట్లు వెల్ల‌డియ‌గుచున్న‌ది. భార్య‌ను త‌న‌క‌న్ని కార్య‌ములలోను స‌హ‌క‌రింప‌వ‌ల‌సిన‌దిగ అభ్య‌ర్ధించు వివాహ మంత్ర‌ములున్న‌వ‌ని శకుంత‌లారావుగారు వ్రాసియున్నారు. అవి లేనందున హృద‌య బుద్ధుల‌కు ప్రాముఖ్య‌మీయ‌బ‌డిన‌ద‌ని తెలియుచున్న‌ది. మ‌రియును శ‌రీర‌ము అశాశ్వ‌త‌మైన‌ద‌ని గ్ర‌హించిన ఋషులు శాశ్వ‌త‌మైన మోక్ష‌సాధ‌న‌కు శ‌రీర‌మునే ప‌రిక‌ర‌ము గావించుట‌కు మార్గ‌ము న‌న్వేషించిరేగాని ఇంద్రియ‌లోల‌ల‌త్వ‌మును ప్రోత్స‌హింప‌లేదు. శ‌రీర ధ‌ర్మ‌ములైన వాంఛ‌ల‌ను ధ‌ర్మ‌బ‌ద్ధ‌ముగ పొందుచుండ‌వ‌లెన‌ని ఆదేశించియున్నారు. ధ‌ర్మార్ధ కామ‌మోక్ష‌ముల‌ను, పురుషార్థ‌ముల‌ని యందురు. ధ‌ర్మ‌కామ‌ము, మోక్ష‌కామ‌ము, ధ‌ర్మార్థ మోక్షార్థ‌ము, ఇట్లొక దానికొక‌టి ముడిప‌డియున్నవి. ధ‌ర్మ‌మును మోక్ష‌ము ప‌ర‌మున‌కును అర్ధ‌మును కామ‌మును ఇహ‌మున‌కును నిర్ణ‌యించిరి. అన్ని అర్థ‌ముల‌కును ధ‌ర్మ‌మే ప‌ర‌మార్థ‌మైయున్న‌ది.

పాతివ్ర‌త్య‌మును విష‌య‌ము మ‌న దేశ‌మున ప్ర‌స్తుతింప‌బ‌డుచున‌నూ చాన‌ముగ వ‌చ్చుచున్న విష‌య‌ము. పాతివ్ర‌త్య‌మన‌గా ప‌తిచేయు ధ‌ర్మ కార్య‌ముల‌లో, దైవ‌కార్య‌ముల‌లో తోడ్ప‌డుట‌యేగాని, మూర్ఖ‌ముగ నేడు భావించుచున్న‌ట్లు క‌నులు మూసికొని దుర్మార్గుడైన భ‌ర్త‌తో కాల‌ము గ‌డుపుట‌కాదు. భ‌ర్త‌తోపాటుగ నామె బ్ర‌తుకుకూడ న‌ర‌క‌ప్రాయ‌ము అగుట సంభ‌వింప‌వ‌చ్చును. భ‌క్త జ్ఞాన‌దేవ్ వ్రాసిన జ్ఞానేశ్వ‌రియను గ్రంథ‌మున పాతివ్ర‌త్య‌మ‌న‌నేమో తెలియ‌జేయుచు నిట్లు వ్రాయ‌బ‌డిన‌ది. ప‌తిబియామ‌తా అనుస‌రోనీ అని యున్న‌ది. అన‌గా ప‌తి యొక్క అభిప్రాయ‌ము న‌నుస‌రించుట‌లో ప‌తివ్ర‌త‌య‌గు స్త్రీకి శుభ‌ముగ‌ల‌దు. ప‌తి యొక్క వ్ర‌త‌ము న‌కు పోష‌ణ యిచ్చున‌ది ప‌తివ్ర‌త ఇచ‌ట వ్ర‌త‌మున‌కు బ‌దులు అభిమ‌త‌మున‌కు ప్రాధాన్య‌మీయ‌బ‌డిన‌దని వినోబా భావించుచున్నారు. నిజ‌మున‌కు వ్ర‌త‌యే స‌రియైన‌ది. ఎందుచేత‌న‌న‌గా య‌జ్ఞ‌యాగాది క్ర‌తువుల స‌మ‌య‌మున భార్య‌లేనివాడు య‌జ్ఞాది క్ర‌తువుల‌ను చేయుట‌క‌న‌ర్హుడు. కర్మ‌చేయున‌ప్పుడు భార్య య‌త‌ని ప్రక్క‌నే యుండ‌వ‌ల‌యును. ఇదియే ధ‌ర్మ‌ప‌త్ని భావ‌మున‌కు మూలాధార‌ము. ఈ విష‌య‌ముతోడ‌నే ప‌తివ్ర‌త‌య‌నున‌ది వ‌చ్చియుండ‌వ‌చ్చును. ప‌తితోగూడి వ్ర‌త‌ములు చేయున‌ది గావున ప‌తినే దైవ‌ముగ న‌మ్ముకొనుట‌వ‌ల‌న ప‌తివ్ర‌త‌య‌న్న ప‌ద‌ము పుట్టిన‌ది.

సంస్కృత భాష‌లోనే ప‌ద‌ము వ్యుత్ప‌త్య‌ర్ధ‌ము లేక యుండ‌దు. స్త్రీ య‌న‌గా గ‌ర్భ‌మును ధ‌రించున‌ది అని అర్ధ‌ము. మ‌హిళ య‌న‌గా మహీమ్ లాతీతి మ‌హిళా. మ‌హియ‌న‌గా భూమి (పృధ్వీత్వ‌ము) క్షేత్ర స్థాన‌మందున్న‌ది మ‌హిళ‌. హ‌ర‌ప్పా శిధిల‌ముల‌లో స్త్రీ శిల్ప‌మున గ‌ర్భ‌ము నుండి చిగుళ్ళ‌తోనున్న మొల‌క‌లున్న‌వ‌నియు పైకివ‌చ్చుట‌కు ప్ర‌య‌త్నించుచున్న‌వ‌నియు వ‌ర‌ల‌క్ష్మిగారు వ్రాసియున్నారు.

 

భార్య య‌నెడి మాట‌కు జాయ‌, జాని, ప‌త్ని అని ఉప‌యోగింప‌బ‌డినప్ప‌టికిని, అన్ని ప‌ద‌ములు స‌మానార్ధ‌ముగ తోచు భిన్న వ్యుత్ప‌త్తుల‌ను క‌లిగియున్న‌వి.. జాయ అన‌గా భ‌ర్త‌యొక్క ప్రేమాభిమాన‌ముల‌ను పొంద‌గ‌ల్గిన స్త్రీ అనియు, జాని సంతాన‌వ‌తి అనియు, ప‌త్ని ప‌తిచేయు క్ర‌తువుల‌కు స‌హాయ‌ప‌డున‌ట్టి ధ‌ర్మ‌ప‌త్ని అనియు చెప్ప‌వ‌ల‌సియున్న‌ది. కావున ప‌తివ్ర‌త అన‌గా వ్ర‌త‌ములు (క్ర‌తువులు) చేయున‌ట్టి ప‌తిగ‌ల స్త్రీ అని యారంభమున భావింప‌డియుండ‌వ‌చ్చును. కాల‌క్ర‌మ‌మున దీని అర్ధ‌ము మారి పోయిన‌ది.