ఆధర్వణవేదమున భార్యాభర్తల నిరువురను ఒకే పదమున బంధింపగల్గినట్టి దంపతి అనెడి పదముపయోగింపబడినది. దంపతి అనెడి పదము ఆంగ్లముననున్న కపుల్ అను పదమునకు సమానార్థకము.
వివాహమనగా విశేషించి వహింపబడునదిగ ఋషులు భావనచేసి యున్నారు. ధర్మార్ధ కామములనేగాక మోక్షదాయకములైన యజ్ఞయాగాది కర్మలయందుకూడ భాగస్వామ్యమును భారత స్త్రీ కలిగియున్నది. పాశ్చాత్యులు వివాహ విషయములో యౌవనమునకును అనుభవమునకును ప్రాముఖ్యమునిచ్చుట కొన్ని తావుల చూడగలము.
స్త్రీ పురుషులెంతగ ప్రేమించుకొన్నప్పటకిని, ఒక్కరుగా పెక్కు సంవత్సరములు కలిసి జీవించినప్పటికి క్రొత్త అనుభూతుల కొరకు ఎప్పటికైన వెదుకులాడక మానరన్న బెట్రాండ్ రస్సెల్ అభిప్రాయమును బట్టి, అనుభూతికి వారు ప్రాధాన్యమిత్తురని తెలియుచున్నది. ఇదే విషయమును ఇల్లిందుల సరస్వతీదేవిగారుకూడ నుడివియున్నారు. పాశ్చాత్య దేశాలలో వివాహ సంస్థకూ భారతదేశంలోని వివాహ సంస్థకూ కొండంత వ్యత్యాసమున్నది అనిరి.
వేదవేదాంగములకును పురాణేతిహాసములకును యోగమార్గమునకును నవీన వ్యాఖ్య నందిచుటకై యవతరించి, సాక్షాద్గణపతి యవతారమని ప్రస్తుతింపబడిన కావ్య కంఠ వాసిష్ట గణపతిముని యొక్క యభిప్రాయము స్త్రీపట్ల నెట్టున్నదో గమనించునది. మాయకు స్త్రీత్వమేగాని పుంస్త్వము లేదని కల్పించుటచే మత వంచకులగుచున్నారనియు. సన్యాసము భారత జాతిని నిర్వంశమొనర్చుననియు నభిప్రాయపడిరి. మన మతాచార్యుల కాదర్శప్రాయములైన వైదికఋషులు విరాగులయ్య భార్యలను విసర్జించలేదు. అర్ధాంగులైన స్త్రీలచే కార్యములందు ననర్హులుగా నెంచలేదు. తమ లోపమును కప్పిపుచ్చుకొని నోరున్నదిగదాయని స్త్రీలను దూషించి వారికి తపస్సును కవకాశమీయక కేవలం భోగవతులనుగా వారిని చూడలేదు. పూర్వ ఋషులు భార్యలకుకూడ గురుత్వమును వహించి వారిని తరిపంజేయు బాధ్యతనుగూడ వహించిరని గణపతి భావించెను.
స్త్రీలకు సమాన హక్కులు ఆస్తి హక్కుల కొరకు నేర్పాటయిన 1916 కాంగ్రెసు మహాసభలో కాకినాడలో శ్రీ గణపతి యుపన్యసించుచునిట్లనిరి. పారమార్థిక కర్మకాండ పురుషులకెంత విదియో స్త్రీలకంత విధియనియు, అట్టి కర్మకాండ యందధికారమునిచ్చు నుపనయనము హోమము, శ్రాధ్ధము, యజ్ఞము, వేదశాస్త్రపఠనము
మొదలగు విధులందు స్త్రీలకు పురుషులతో సమాన హక్కులున్నవి. ఇట్టి విషయములను శ్రీ గణపతి వేదములను ట్టంకించి ఋజువొనర్చియున్నారు. ఇట్లు నాయనయని పిలువబడు గణపతిముని తన భార్యకు మంత్ర దీక్షనిచ్చి యామెను తరిపంజేయుటయేగాక స్త్రీలను సానభూతితో చూచిరి.
బహు భార్యాత్వము అన్ని యుగములలోను ప్రస్ఫుటముగ నున్నప్పటికిని బహు భర్తృత్వము మాత్రము కొన్ని తెగలయందే కన్పట్టుచున్నది. కొన్ని తెగలు అనాగరిక జాతులకు సంబంధించినవనుటచేత వీనికి ప్రాధాన్యమీయబడుటలేదు. అచ్చటచ్చట పునర్వివాహములు, విధవా వివాహములు కూడ నున్నట్లుగ కన్పట్టుచున్నదని శకుంతలారావుగారు వ్రాసియున్నారు. వివాహమునకు ముందు గర్భమును ధరించిన స్త్రీలపట్లగాని, ధర్మాతిక్రమణమును చేసిన స్త్రీలపట్లగాని సమాజము కరుణాపూరితముగ వ్యవహరించినదేగాని కఠినత్వమవలంబింపలేదు. దేవదాసికి కూడ సంఘమున గౌరవపూర్వకమైన స్థానమీయబడినది. భర్తృ మరణానంతరము జనించిన పుత్రుని పౌనర్భవుడనుటలో విధవా వివాహములుండి యుండవలెననిపించును.
స్త్రీలకును శూద్రులకును సేదములు నిషిద్ధమను విషయము. మధ్యకాలమున వచ్చినదికాని వేదకాలమునలేదు. అపాల, లోపాముద్ర, విశ్వవర, వాక్ అనెడి స్త్రీలు ఋక్కులను రచించిరని తెలియుచున్నది. పురుషులతో పోల్చిచూచినచో స్త్రీల సంఖ్య చాలా తక్కువగనున్నప్పటికిని స్త్రీలు వేదములను చదువరాదను నిషేదము లేదని తెలియజేయుటకు వీరి నామములుపయోగించుచున్నవి.
సతీసహగమనము ధ్రాషియా, ఫిజీ, బాలివంటి దీవులలో కూడా నానాడు ప్రబలముగనుండెడిది. నాయకరాజుల కాలమున నొక ప్రత్యక్ష సాక్షి సహగమనమును గూర్చి ఇట్లు వ్రాసెను. బాల్య వివాహములు, సతీసహగమనము, అణచివేత మొదలైన అనర్ధకములన్నియును తరువాత తరువాత భారతదేశముపై జరిగిన దాడుల ఫలితముగ జనించినవని చెప్పవచ్చును.
బాల్య వివాహములుకూడ పూర్వకాలమున లేనట్లు తెలియుచున్నది. కుమారి యనగా అపూర్వపతియనియు, వివాహమునకర్హురాలు అనియు పాణిని అష్టాద్యాయియందు చెప్పియున్నాడు. కన్యయనగా వివాహము కానట్టిదియేగాక అందముగలది కూడనని యాస్కాచార్యులు నుడివెను. కన్య యెనిమిది వర్షములుగలది. గౌరి పన్నెండు సంవత్సరములు కలది యగుచుండిరి.
పుత్రులను కోరుచు యజ్ఞమాగాదులను చేసినట్లు ఆధారములు కలువుగాని బాలికా జననమును ద్వేషించునట్లుగలేదు. సహజ ప్రకృతిచేత ఆడపిల్లలను పెంచుట భారమని మాత్రము భావించయుండవచ్చును. రాను రాను ఆడపిల్ల పుట్టగనే వధించు కసాయివాండ్రుకూడ ప్రభవించిరి.
ఆధర్వణ వేదావిర్భావము తరువాత కర్మలు క్రతువుల భాగము హెచ్చగుటయేగాక మోక్షకామము వృధ్ధికాగా పుత్రులు పున్నామనరకము నుండి రక్షింతురనియు పుత్రులులేక తర్పణలు విడువకపోయినచో జీవులు గాలిలో తిరుగాడుచు, ఒక్కొక్కచోట పిశాచాకృతికూడ పొందుదురనియు భావింపమొదలిడిరి. అందుచేత పుత్రకామన పెరిగిపోయినది. పుత్రుల కొరకు ప్రార్థనలు చేయుటయేగాక గర్భస్థ శిశువును ఆడపిల్లనుగాకుండ చేయమని దైవమును ప్రార్థించుటకూడ చేసిరి. పుత్రులు తల్లిదండ్రులనే గాక వారి వారి పూర్వికులయిన పితృలోకవాసలుకుకూడ బంధనరాహిత్యమును చేయగలరని వారి నమ్మకము. ఇట్లు పుత్ర ప్రాముఖ్యము పెరిగిన తరువాత పుత్రికలు భారమని భావించుట మొదలు పెట్టరి. పుత్రికలు అనగా అన్నదమ్ములు లేనిది అన్న భావము సూత్రకాలమున రూఢియైయున్నది. దుహిత యనగా వివాహమున కుమార్తె. దూరేహితా యన్న వ్యుత్పత్తి చెప్పబడినది. అనగా దూరముగనుండిన మంచిది అనుట. కాని కన్నబిడ్డ దూరముగనుండుట తల్లితండ్రులకు హితవైన విషయముకాదు. ద్విహిత యనినచో రమ్యముగనుండును. ఇరువంకలవారికిని, పుట్టినింటివారికిని, మెట్టినింటివారికిని హితవు కల్గించునది ఏలదా హితవైనది అనునర్ధముననీ పదముపయోగించపబడియుండవచ్చునని తోచుచున్నది. తనయ, తనూజ అని అన్ని వయసులలోనున్న కుమార్తెలను పలిచెదరు. ఇట్లు అర్థములేని వ్యర్థమైన అక్షరమొక్కటికూడ లేని వేదములు, వేదార్థములు, పాశ్చాత్య పండితులచేత వ్యాఖ్యాఇంపబడినవై, శిరోధార్యములగుటచేత, అనేకములైన దుర్వ్యాఖ్యానములకు దురర్ధములకు నితహాస పురాణాదులు లోనై యున్నవి.
అన్ని రంగములలోకూడ నిష్టాతులైన స్త్రీల యొక్క వైదుష్యము ప్రకటించపబడక మానలేదు. ఇట్టివారిలో వేదాంతవేత్తలైన కాత్యాయని, గార్గి, మైత్రేయి, ఉభయభారతి యోగాభ్యాసములో పరాకాష్ట దశకు చేరుకొని తన భర్తయైన శిభిధ్వజుని తనతో మోక్షగామిని గావించిన చూడాలయును ప్రఖ్యాతులు.
స్త్రీ శక్తిని శ్రీ విద్యోపాసకులు భావించగల్గినట్లు మరియొకరు భావింపలేరు. సృష్టి స్థితిలయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు శక్తి ప్రదాత్రియైన మహాశక్తి స్వరూపముగ శ్రీ లలితను వారు పూజింతురు. ఇట్లు భారతీయులకు స్త్రీ యారాధ్యస్థానమున నున్నదేగాని భోగ వస్తువుగ మాత్రము చూడబడలేదు.
|