భోగప్పశాస్త్రి లక్షగాయత్రిని జపించి తత్ఫలమును గిరికుధార వోసెను. మంగమ్మయు కుమారస్వామియు వారి శక్త్యనుసారము భూభ్రమణముచేసి తత్ఫలములనామెకు ధారవోసిరి. ఇట్లు చేయుట గిరికయందు వారికిగల భక్తిని తెలియజేయుటకేగాని ఆమెకు తపశ్శక్తి తక్కువకాగా వీరుపూరించుటకు మాత్రముకాదు. కృష్ణావతారమున గిరిక గోపికయైనది. రుక్మిణియైనది సత్యయైనది. కృష్ణలీలన్నిటిని ప్రదర్శించినది. కొంతవడితానె కృష్ణుడైనది. అతడునుతానును వేరుకానట్లుగను జీవాత్మయు పరమాత్మయు నొక్కటియైనట్లుగను భంగిమను ప్రదర్శించి మరల గోపికయైనది. పొదరిండ్లలో కృష్ణునికై వెదకినది. మల్లెతీవలను మాలతీ లతలను ప్రియుని జాడకై యర్ధించినది. ఇచట గిరిక యొక్క యుద్వేగము తపన స్వామికై యార్తి శిఖరదశకు చేరుకొన్నవి. ఆమె మహాతన్మయావస్థలో స్పృహ కోల్పోయినది. శిశిరోపచారములు చేసినను తెలివి రాలేదు. ధర్మారావు కుంభహారతి వెలిగింపమనెను. కుంభహారతి వెలిగించిరి. ఆ మహాఖండ హారతిలో గిరికకు హారకుండల కేయూర భూషితుడు శంఖ చక్ర గదా పద్మహస్తుడు, వనమాలి సూర్యచంద్రనేత్రుడు, హిరణ్య శ్మశ్రుడు. హిరణ్మయశరీరుడనైన మహాపురుష దర్శనము లభించినది. ఆమె కనుల వెంట భాష్పధారలు స్రవించెను. నమస్కారము చేయుచు నిలబడగా తన్మహా పురుషుని కాంతి పుంజములామె లోనికిజొచ్చినవి. క్రమక్రముగా బంచేంద్రియములు మనస్సు, బుద్ధి, అహంకారము సర్వము ఆ మూర్తియై మిలిగినవి. కుంభహారతి మధ్యలోనుండెను. ఒక ప్రక్క వేణుగోపాల స్వామి వేఱొక ప్రక్క దేవదాసియు ప్రకాశించిరి. ఇట్లు గిరిక నాట్యార్పణమున సాయుజ్యమునంది ధన్యయైనది.
గిరిక పాత్రచిత్రణమున విశ్వనాథ తనలోని యాక్రందమునకొక రూపము కల్పించిరని శ్రీ గౌతమరావుగారు వ్రాసిరి. గిరిక సత్యనారాయణగారిలోని ఆంతరికమైన యాక్రోశమునకు ప్రతినిధి. అదియాయన నిరంతరము పొందు వేదనరూపుగొన్నది. నాట్యము సంగీతము, భక్తి, కవిత్వము వీని యొక్క పరమప్రాప్యమును వానియొక్క ఉత్పత్తిని నిరూపించు సాధనము గిరిక యనిరి. శ్రీకృష్ణుడు స్వయముగ మూర్తీభవించిన రసస్వరూపము. గిరిక శృంగార రసరూపమై కృష్ణునికీడై నిలచినది. శ్రీ కృష్ణుడు సదానందమూర్తియైన చిద్రూపి. రాధిక ఆనంద స్వరూపిణి. రాధాకృష్ణులొక్కరే యన్న చైతన్య సిద్ధాంతము ప్రకారము గిరిక రాధికతో తుల్యమైన స్థానమును పొందియున్నది. ఇట్లు గిరిక మధురభక్తి సిద్ధాంతమునకు ప్రతీకయైనది. మధురభక్తి యనగా పరమాత్మ యొక్కడే పురుషుడుగను సర్వజీవులును స్త్రీలుగను భావించి యామహాపురుషునకై విరహార్తిననుభవించుట. ఇట్టి మధురభక్తి సిద్ధాంతము వంగదేశమున, జన్మించిన చైతన్యునితో ప్రారంభమయినదిని చెప్పవచ్చును. చైతన్యుడు మధుర భక్తి యొక్క ప్రాముఖ్యమును వెల్లడించుచు అందరికి నీ భక్తియే శ్రేష్టమనెను. శ్రీ మన్మహాప్రభుని శిక్షయందు మధుర రసమే భక్తుల కుపాస్యరసముగ జెప్పబడినది. జీవుని నిత్యదేహమందు లింగభేదము లేదనుటకీ మతము స్థాపింపబడినది. సాధనసమయమున దేహమందు పురుషత్వము ద్యోతకమగుచున్నను భావదేహమునందు భక్తుడు గోపికయే యగుచుండును. సకలవిధములైన భక్తి భావములయందును మాధుర్యగుణమున్నది. భక్తి భావములో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య మధురములను భేదములున్నను అన్ని రకములకును గమ్య స్థానమైన పురుషుడు పరమాత్మయే. అధికార భేదమునుబట్టి భక్తులాయా మార్గములవలంబింతురు. శాంతమునకు వ్యాసాది మహర్షులును, దాస్యమునకు హనుమంతుడును. సఖ్యమునకు అర్జునుడును, మధురమునకు రాధికాది గోపికలునుదాహారణములు. కృష్ణుడు మాత్రమే సర్వేశ్వరుడును. సర్వశక్తి మంతుడును.
సర్వరసమయతత్త్వమును నగుచున్నాడు. కృష్ణస్వరూప శక్తి యందే విచిత్రము కలదో అదియంతయు మూర్తీభవించి శ్రీకృష్ణుని శాంతదాస్య సఖ్యవాత్సల్య మధుర రస (భక్తి) సేవనములందుపకరణమగుచున్నది. హ్లాదినీ (మధుర) రస రూపము శ్రీరాధిక సర్వప్రధాన కావున మధురభక్తి వంటిది. గోపికలకు శరణ్యమైనది. ధర్మారావు గోపికలభక్తివంటిది గిరికకు శ్రేష్టమని బోధించెను. ఏలయనగా ఈ భక్తిమార్గమున పురుషుడు స్త్రీ వలె భావించుకొనుట జరుగునుగాన సహజముగ స్త్రీయైన గిరికకీ మార్గము సులభమని యతడు బావించెను. మధుర ప్రేమయందు సకలజీవులును శుద్ధ స్త్రీ రూపులేయగుచు నొక్కపరమపురుషుడగు శ్రీ కృష్ణునే వీరు సేవింతురు. భక్తజయ దేవుడును క్షేత్రయ్యయు నీ మార్గమున సుప్రసిద్ధులు కాగా మీరాబాయి సక్కుబాయివంటి భక్తురాండ్రు కూడ నీమార్గమునవలంబించిరి. గిరిక కూడా మధురభక్తికి ప్రతీకయై సాహిత్య లోకమునచిరాయువైనది. |