25
 


రామేశ్వ‌ర‌ము జ‌మీందారు యొక్క పెద్ద‌తల్లి కుమారుడు. ఇత‌డు విలాస పురుషుడు. ధ‌ర్మోల్లంఘ‌న‌ము చేసినవాడు. ఇత‌నికిని గ‌ణాచారికిని వైర‌ము. గ‌ణాచారి వ‌ద‌లిన వేప‌మండ‌ల‌నాత‌డు కాలితోరాచుట‌, ఆమెను తిట్టుట కొట్ట‌బోవుట కూడ చేయును. ఆమెకూడ న‌త‌డ‌ట్లుచేసిన‌చో శిక్షింప‌వ‌లెన‌ని సిద్ధ‌మ‌గుచుండెడిది. రామేశ్వ‌ర‌ము గ‌ణాచారిని కొట్ట‌బోయెను. ఆమె వేప‌మండ రెండుగా చీల్చ‌బోయెను. ఆత‌డామెను కొట్ట‌లేదు. ఆమె మండ‌ను చీల్చ‌లేదు. ఆమె మండ‌ను రెండుగ చీల్చుట య‌న‌గా న‌త‌ని జీవిత‌మున కంత‌మును సూచించుట‌య‌న‌వ‌చ్చును. అత‌డు పైకి తిట్టిన‌ను భ‌య‌ప‌డి కొట్ట‌లేదు. ఆ మండ‌ను చీల్చ‌లేదు. ధ‌ర్మ ఏవ హతో హంతి ధ‌ర్మో ర‌క్ష‌తి ర‌క్షితః అనిన‌ట్లుగ తాను చేసిన య‌ధ‌ర్మ‌మువ‌ల‌న‌నే తాను హ‌తుడు కాబోయి మానినాడు రామేశ్వ‌రము. కాని ధ‌ర్మ‌మును మూడు వంతులు శ‌క్తికొల‌ది బుద్ధిపూర్వ‌క‌ముగ నాశ‌న‌ము చేసినాడు. కావున జీవ‌త‌మున స‌ర్వ‌ము కోల్పోయి కారాగార‌మున జీవ‌చ్ఛ‌వ‌మువ‌లె మ్ర‌గ్గ‌వ‌ల‌సివ‌చ్చిన‌ది.

గ‌ణాచారియును ప‌స‌రిక‌యునొక‌రి స‌మీప‌మున‌కొక‌రురారు. ఎందుచేత న‌న‌గా దేవ‌మాతృకా స‌స్య‌ల‌క్ష్మీ ప్ర‌తిస్వ‌రూపుడు ప‌స‌రిక‌. చెద‌రిపోయిన స్వామి తొమ్మ‌దివంద‌ల తొంబ‌దితొమ్మ‌ది ధ‌ర్మ‌ఫ‌ణ‌ముల‌ను చూచి యాక్రోశించి కుపిత‌యై, ప్ర‌ళ‌య‌మును విల‌య‌మును సూచించు విభూతి స్వ‌రూపిణి గ‌ణాచారి. అత‌డు సృష్టికి స‌స్య‌రూపుడైన స్థితికారుడు. ఆమె శివుని విస్ఫులింగ నేత్ర‌మువ‌లె ల‌య‌కారిణి. వారిరువురు నొక‌చోట క‌లియుట పొస‌గ‌దు. ఆమెను చూచి ప‌స‌రిక భ‌య‌ప‌డునప్పుడెల్ల ధ‌ర్మారావు త‌మ్మునికి ధైర్య‌ము చెప్పును. ఒక‌నాడు గ‌ణాచారి ప‌స‌రిక‌కు బ‌హుస‌మీప‌మున‌కు వ‌చ్చిన‌ది. ప‌స‌రిక భ‌య‌ప‌డెను.ప‌స‌రిక నిలువెల్ల వ‌ణికిపోయెను. గ‌ణాచారి య‌తని వంక‌కు జూచెను. కాని వెంట‌నే త‌న దృష్టి మ‌ర‌ల్చుకొని తొంద‌ర‌గా న‌డ‌చిపోయెను...ధ‌ర్మారావు నాయ‌నా అప్పుడే భ‌య‌ములేదు. గ‌ణాచారి చాలాదూర‌ము పోయిన‌ది. నాకును గొంచెము ధైర్య‌ము క‌లిగిన‌ది అని ధ‌ర్మారావు త‌మ్మునోదార్చెను. దేశ‌మున‌కు స‌స్య‌ముల కొర‌కు రాబోవుచున్న‌దిగాని వ్య‌వ‌ధి యున్న‌దని ధ‌ర్మారావు భావించెను.ప‌స‌రిక‌ను త‌న జాతికి పైరుప‌చ్చయ‌ని య‌త‌డనుకొనెను. కాల‌క్ర‌మ‌మున ప‌స‌రిక‌కు నిలువ‌నీడ లేక‌పోయిన‌ది. ప‌స‌రిక‌కు స‌ర్ప‌ముల‌కు వ‌చ్చిన త‌గ‌వు తీర్చుట‌కై మ‌ధ్య‌వ‌ర్తినిగ గ‌ణాచారిని ప‌స‌రిక తీసికొనివ‌చ్చెను. గ‌ణాచారికిని ప‌స‌రిక‌కు మ‌ధ్య దూర‌ములేదు. ఆమె చూచుచుండ‌గ‌నే పాము కాటున‌కు గురియైన ప‌స‌రిక మ‌ర‌ణించెను. ఒక శిర‌సు నాగ‌న్న యొయ్యార‌ముగ వ‌చ్చి నిజ‌ముగా నా తండ్రి నిన్ను గ‌ర‌చిందిరా య‌ని గ‌ణాచారి దుఃఖ‌ముతో వివ‌శ‌యై పాడిన‌ది.

పూర్వ గ‌ణాచారులు మృతియేగాని వృద్ధాప్య‌ము నెరుగ‌రు. నేటి గ‌ణాచారి వృద్ధాప్య సూచ‌క‌ముగ ప‌లిత‌కేశినియైన‌ది. ముఖ‌మున ముడ‌త‌లుప‌డిన‌వి. క‌ష్ట‌ములెట్టివారికైన‌ను శ‌రీర‌ములోని శ‌క్తిని హ‌రించున‌ని గ‌ణాచారి ధ‌ర్మారావుతోన‌నిన‌ది. తామ‌రాకుపై జ‌ల‌బిందువులె జ‌రుగుచున్న సంఘ‌ట‌న‌ల‌కీమె నిస్సంగురాలివ‌లెగాక అన్యాయ్య‌ముల‌కు హృద‌య‌ము క్షోభించు స‌హృద‌యురాలివ‌లె గానిపించును. ఆమెలో దైవాంశ యున్న‌ద‌నుట నిర్వివాదాంశ‌యేగాని మాన‌వ శ‌రీర‌ము దాల్చిన‌ప్పుడు సుఖ‌దుఃఖ‌ముల‌కు చ‌లింప‌క త‌ప్ప‌ద‌న్న స‌త్య‌మును త‌ప్ప‌ద‌ను విష‌య‌మును గ‌ణాచారి తెలియ‌జేయుచున్న‌ది. ఆమె మ‌న‌స్సు ప‌రిస‌ర ప్ర‌భావ‌ముల‌క వ్య‌గ్ర‌త చెందిన‌ది. న‌వీన నాగ‌రిక‌త యామెకు దుష్ట‌వాయువువ‌లెనై యూపిరాడ‌కుండ జేసిన‌ది. శ్వాస‌పీల్చుకొనుట‌కు శ్రేష్ఠ‌వాయువులు క‌ర‌వ‌గుట‌వ‌ల‌న త‌న యునికికి తానే వ‌గుచుచున్న‌ట్లు గ‌ణాచారి విరక్తి చెందిన‌ది. కాల‌ము గ‌డ‌చుకొల‌ది గ‌ణాచారి త‌న స‌హ‌జ‌గుణ‌ముల‌కు కొన్నింటికి దూర‌మైన‌ది. నవ్వుట‌, సంభాషించుట‌, వేళాకోళ‌మాడుట‌, యోచించుట మొద‌లైన వ్యాపార‌ములు చేయ‌దొడ‌గిన‌ది.

గ‌ణాచారి ధ‌ర్మ‌ఫ‌ణ‌ముల యొక్క చ్యుతిని సూచించుచు వ‌ర్ణించిన‌ది. పాట‌ను పాడిన‌ది. మొద‌టి పాట వేయిప‌డ‌గ‌ల పాము విప్పారుకొని వ‌చ్చి కాటందుకొన్న‌ది క‌ల‌లోన రాజును ఇది రాచ‌రిక‌మున‌కు నాశ‌న‌ము సూచించుచున్న‌ది. రాజులు మ‌ర‌ల నుండ‌క‌పోవ‌చ్చునుగాని ప్ర‌భుత్వ‌ము మ‌ర‌యొక రూప‌మున నుండ‌వ‌చ్చును. పాము కాటు వేసిన‌ది నిజ‌జ‌గ‌త్తులో గాక స్వ‌ప్న జ‌గ‌త్తులోనైనందున ఫ‌లిత‌మును భూత‌మేగాని వ్య‌క్త‌ముకాదు. క‌ల‌య‌నుట‌చే ఫ‌లిత‌ము వ‌చ్చుట‌కు కొంత‌కాల‌ము ప‌ట్టుట‌కూడ నిచ‌ట సూచింప‌బ‌డిన‌ది. రాజున్నంత‌వ‌ర‌కు ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌ము స‌క్ర‌మ‌ముగ‌నే యుండెన‌నుట వేయిప‌డ‌గ‌ల పామువ‌ల‌న తెలియుచున్న‌ది. రాజును కాటువేసిన త‌రువాత మ‌ర‌ల‌నెవ్వ‌రికి వేయిప‌డ‌గ‌లు కానిపించ‌లేదు.

త‌రువాత స్వామి నాల్గు శిర‌స్సుల‌కు కుదించుకొనిపోయినాడు. పుర‌పాల‌క శాఖాధ్య‌క్షుడైన చంద్రారెడ్డి విద్య‌ను గురించి యారోగ్య‌మును గురించి తాను చేయ‌గ‌లిగియు అధ్య‌క్షునిగ చేయ‌వ‌ల‌సిన‌దికూడ చేయ‌లేని య‌శ‌క్తుడ‌న‌ని విచారించును. ఇట్లు విచారింప‌గ‌ల హృద‌య‌మున్న చంద్రారెడ్డిని నాల్గు శిర‌సుల పాము నిల‌బెట్టెను. నాల్గు శిర‌సుల నాగు న‌ల్ల‌న‌ల్ల‌న వ‌చ్చి ఊరిపెద్ద‌ను నిల‌వేసింది పొల‌ములో అని గ‌ణాచారి పాడ‌న‌ది. ఇచ‌ట స‌ర్ప‌ము నాల్గు త‌ల‌ల‌తో వ‌చ్చి ఊరి పెద్ద‌ను నిల‌వేసిన‌ది గాని కాటు వేయ‌లేదు. అన‌గా ధ‌ర్మ‌చ్యుతి జ‌రుగున‌న్న భ‌య‌మేగాని య‌ధార్థ‌ముగ జ‌రుగ‌లేదు. ముందు జ‌రుగునున్న సూచ‌న‌. ఇచ‌ట నాలుగు శిర‌సులును చాతుర్వ‌ర్ణ‌ముల‌కు సూచ‌న‌గా వ‌చ్చును.