రెండు శిరసుల నాగు రివ్వునరివ్వున వచ్చి ఇంటి కోడలి పురుగూదింది దొడ్డిలో రెండు శిరసుల నాగు దాంపత్య ధర్మ ప్రతీకగాననీ ధర్మమునకు కూడా కొంత నష్టము తప్పదనుటయే. మరియు పాము రివ్వురివ్వున వచ్చెనుట మార్పుశీఘ్రముగ వచ్చుననుటయే. ఇచట పాము కోడలిని ఊదెనట. ఊదుట కరచుటంత ప్రమాదకరము గాకపోయినను బాధాజనకమే యనవలెను. గణాచారి వదినగారైన రంగమ్మ విచ్చలవిడగ సంచరించుచు గృహస్థ ధర్మముల నశ్రద్ధచేయుచు క్రీడలకు, కాలక్షేపమునకు యిల్లువీడి సంచారము చేయుచుండిరి ఇందువలననే పురుగూదుట జరిగినది.
చివరిగా ఒక శిరసు నాగన్న ఒయ్యారముగ వచ్చి నిజముగా నా తండ్రి నిన్ను కరచిందిరా అని పసరికను పాము కరిచినపుడు పాడినది. ఇంతటితో నాశనము అగుట పూర్తియైనది. పాము బెదిరించి బెదిరించి తుదకు కాటు వేయనే వేసినది. ఈ కాటుతో జాతి సమూలముగ నాశనము గాకతప్పదు. సస్యశ్రీ, పై రుపచ్చయైన పసరికనే పాము కాటు వేసినది. ఆహారధాన్యములే కరవైనచో వ్యక్తి యునికియే సంశయాత్మకము కాక తప్పదు. ఉదరపోషణము తరువాతనే యెట్టి ధర్మమైన ! అసలుకే మోసము వచ్చినది. జాతి యి తావున ప్రాణములేని సుందరశిల్పమైనది. గణాచారి దుఃఖించినదిందులకే.
గణాచారి పాత్ర పోషణములోగాని భారతీయ సంప్రదాయ నిరూపణములోగాని పరాకాష్ఠదశయనదగిన దామె ప్రాణ నిష్క్రమణ ఘట్టము. ఇచట యోగరహస్యములు గుంభనముగ పొందుజరచబడినది.
గణాచారి తన కంత్య దశ వచ్చుచున్నదని తెలిసికొనినది. తన కనగా వ్యక్తిగతముగ తనకొక్కరితకుగాదు. స్వర్గమర్త్యములకు లంకెయగు దివ్యావతరణములకే యిది యంత్యదశ. ప్రజలకు తమ వంటివారి యక్కరలేదు. నాస్తికత ప్రబలినది. దైవమున్నాడనియు, నతనిని చేరుటకొక మార్గము కలదనియు తెలుపు గణాచారివంటి లంకె తెగిపోయినచో సామాన్యముగా కనరానివాడు కనుపింపకనేపోవును. కనరాని దానిని లోకము లేదని వాదించుటలో దప్పేమున్నది అని విశ్వనాథవారు హేతువాదుల దృక్పథమును సందర్భానుగుణముగ స్పందింపజేసినారు. ఆధునకులు భగవంతుడు లేడందురు. ఏలననగా నుండెనని చెప్పి నిదర్శనములు చూపుటకంటె లేడనుట నొక్కమాటతో తీరిపోవును. భక్తి, జ్ఞాన, కర్మయోగ మార్గములలో నేయొక్క మార్గముగాని భగవద్దర్శనము మిక్కిలి కష్టసాధ్యమైన విషయము. ప్రయాససడి వానినాచరించి యాతని యునికిని కనుగొనుటకంటె లేడని యధేచ్ఛగా పలికి పబ్బముగడుపుకొనుట సులువైన పని. హేతువాద ప్రాబల్య ప్రచారమువలన సామాన్య జన హృదయసదనములలో నిట్టి భావములు చెలరేగజొచ్చినవి. గణాచారి వంటి యోగినికి ప్రజలను నమ్మించుట కష్టమైనది. కనుక నామె తన ప్రస్థానమునకు సంసిద్ధురాలు కాదొడగినది.
ప్రారంభమున గణాచారి కేశములు జడలు కట్టదొడగినవి. ఐదు దినములలో నయిదు జడలయినవి . ఇదివరకే కట్టవలసినది. నేనే కట్టనీయలేదు అని గణాచారి పలికినది. అనగా తన మరణము తనయధీనమునందే యున్నట్లిట సూచింపబడినది. నిరంతరము యోగసమావిష్టురాలైనది. భీష్మునివంటి మహాపురుషునకు తాను కోరినపుడె మరణ మాసన్నమయినది. అట్టిదానినే స్వచ్ఛంద మరణమందురు. యోగాభ్యాసముననది కైవసమగును. యోగాభ్యాసమున సర్వేంద్రియములను ప్రాణశక్తిని ఇచ్చాశక్తితోడ బంధించినపుడు ప్రాణనిర్గమనమును కోరినప్పుడు చేయగల్గుటయన్నది భారతీయ పురాణగ్రంథములందు దాహృతమైయున్నది.
గణాచారి తన జడలను పూర్తిగా కత్తిరించి స్వామికర్పించినది. ఇంకనీ జడలే స్వామి యాలయములోనుండును. నాకును స్వామికిని సంబంధములేదు. నేనింక దేవాలయములోనికి రాను అని గణాచారి పలికినది. ఇంతటితో నామె యవతరించుటకుగల కారణము పరిసమాప్తమైనది. దేవదూతవలె వచ్చినది. ప్రజలనను తన మార్గమునకు త్రిప్పికొనలేక పోయినను తన జన్మమును సార్థకముచేసికొని ముక్తురాలు కాగల్గినది. ఈమె సమర్పించిన పంచజటలును పంచేంద్రియములును పంచకర్మలును పంచప్రాణములను పంచభూతములను తలపింపజేయుచున్నవి. సమస్తము స్వామికర్పించి కేవలము భౌతికకాయముతో ఆలయమునుండి వెడలిపోయినది. ధర్మమంటపములోని రెండవ స్తంభముకూడ కూలిపోయినది.
భక్తి స్ఫోరకముగ కేశసమర్పణము చేయుట సంప్రదాయము. అట్లే గణాచారి తన కేశములను సుబ్రహ్మణ్యస్వామికి సమర్పించినది. అచ్చోటనవి నిక్షేపింపబడినవి.
ఆ రాత్రి గణాచారి నివసించుచున్న పాకకు నిప్పంటుకొనినది. ఆమె పంచప్రాణములు పంచభూతములలో లీనమైనవి. ప్రాణశక్తి యగ్ని రూపమున బయల్వెడలి భౌతికకాయమున కగ్ని సంస్కారావకాశమునకు కూడ పరులకు తావీయక భౌమ స్థితినందినది. గణాచారి తాను తనయైన తత్త్వంబునందైక్యమయినది. అనగా ఆత్మపదార్థ మొక్కటియే జగద్వ్యాప్తమైనట్టిది. అదియే అహం అనబడునట్టిది. ఆత్మ యాత్మలోలీనమగుటచే జగత్తు మిధ్యగ మిగిలిపోయినది. గణాచారి రూపములో నణువునైన నగ్ని దేవుడు మిగల్చక దగ్ధముచేసివైసినాడు. ఇచట వైశ్వానరుడు విశ్వరూపమును ప్రదర్శించినాడు. ఇట్లు గణాచారి జీవితమునుండి నిష్ర్ర్కమించినది. ప్రపంచమున కార్యకారణ సంబంధములేక పూచికపుల్ల కూడ కదలదు. అట్టిది నిష్కారణముగ గణాచారి నివసించు పాకకు నిప్పెట్లంటుకొనెనో విచారింపవలయును. గణాచారికి తనయంతము తనకు తెలియును. అందుచేతనే సర్వసన్నద్ధయైనది. గణాచారి వంటి జ్ఞాని కావలెనని పాకకు నిప్పుపెట్టియుండదు. ఇట్లు చేసినచో నాత్మహత్యాపాతకమామెపైబడును. మరి యేదేని రహస్యముండవలె. అదియే యెగరహస్యము. ప్రతి వ్యక్తిలోనుండు షట్చక్రములలో నాగ్నేయ చక్రమునందు అగ్ని రూఢముగనుండునని యోగశాస్త్రమున చెప్పుచుందురు. ఈ చక్రమును ఆజ్ఞాచక్రమందురు. ఈ చక్రము భ్రూమధ్యప్రదేశమునందుండును. మూలాధార చక్రమునుండి కుండిలిని ఉద్భుద్ధమైనపుడు ఆరోహణ సమయమున చైతన్యశక్తితోపాటుగ తనతో చక్రములలోనున్న సహజశక్తులను తత్త్వములను పైకి తీసికొనిపోవును. పృథ్వివ్యప్వాయురాకాశతేజస్తత్త్వములిట్లు కుండలినీ శక్తితోగూడి పయనించి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను ఛేదించుకొని బహిర్గతమగును. ఇప్పట్టున యోగియొక్క కోరిక ప్రకారము ప్రాణనిర్గమనము జరుగును. ఇట్టి శక్తి శిరసును ఛేదించుకొని వచ్చునప్పుడగ్నిశక్తి బహిర్గతము కావచ్చును. ఈ యగ్నివలన శరీరము దగ్ధమై పరిసరముననున్న వస్తువులు కూడ దగ్ధము కావచ్చును. ఇట్లు ప్రాణశక్తి పైకి పయనించు సమయమున అగ్ని వ్యుత్పన్నమగుట నాయన యనబడు కావ్యకంఠ గణపతిమునియెడ సంభవించినవి. నాయనకు కపాలము విభేదమై యచటినుండి చంద్రకాంతివంటి జ్యోతి, ధూమము, ఆవిరి పుట్టుట ఆయన సహచరులు భార్య, పుత్రికలు వీక్షించియున్నారు. 1922-25 సంవత్సరముల మధ్యకాలమున నాయనకిట్టి యనుభవము జరిగినది. గణపతిముని శిరస్సునందు తీవ్రమైన బాధ కలిగి తరువాత కపాలభేదనమైనది. ఆ సమయమున నాయన శిరస్సునుండి యొక శబ్దముకూడ బహిర్గతమైనది. టప్ మను శబ్దమొకటి వినబడి విశాలాక్షి వజ్రమ్మల దృష్టుల నాకర్షించెను. దానివెంబడినే చంద్రకాంతివంటి జ్యోతి యొకటి శిరస్సునుండి వెడలి గుహయొక్క లోపలికప్పుపై బింబాకారముగాపడుచు తత్కాంతిచే గుహయందలి చీకటి తొలగించెను. ఇట్లు కపాలభేదమైన తరువాత నాయనకు బాధ శాంతించినది. గణపతిముని ఇట్లు రుద్రగ్రంథి విభేదనమైన తదుపరి కూడా జీవించియున్న మహనీయుడు. నాయన యొక్క యీ యనుభూతిని పురస్కరించుకొని శ్రీ అ.నరసింహముగారిట్లు నుడివియున్నారు. ఈతనికి శాస్త్రాలు కేవలం చదివి విషయజ్ఞానం తెలుసుకోవడంకాకుండా అనుభవజ్ఞానం ఉండేది...కపాల విభేదము యెగాభ్యాసముచేత సిద్ధించిన వ్యక్తి అనిరి. వీరు సాక్షాద్గణపతియే గణపతిముని యనియు యోగానికి ప్రత్యక్షానుభూతిని ప్రకటించుటకే జన్మించెననియు నుగ్గడించిరి.
|