ఉద్యోగం ఎందుకు
ఇదేం ప్రశ్న పిచ్చి ప్రశ్న. అనుకుంటున్నారుకదూ. జీవనోపాధికేగా ఉద్యోగం అనికూడా అనుకుంటున్నారు కదూ ! నిజమే. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ పురుషుడు చేసే ఉద్యోగం జీవనోపాధికి సంసార రథ చోదకానికి అత్యవసరం అయినప్పుడు స్త్రీ చేసే ఉద్యోగం ఇంకాస్త సాయంగానూ చేదోడువాదోడుగానూ ఉంటుంది ఇంతేకాదు మా రాజేశ్వరిని చూశాక స్త్రీకి ఉద్యోగం ప్రాణంపోకుండా కూడా ఆపగలదు అనే సత్యం తెలిసింది.
భార్యాభర్తలకు ఏకారణం చేతనైనా తగాదాలు వచ్చి విడిపోడందాకా కూడా వస్తే అటు తల్లిదండ్రులకో అన్నదమ్ములకో భారం లేకుండా తనను తాను పోషించుకుంటూ అవసరం వస్తే పిల్లలనుకూడా పోషించుకోగల్గితే చాలావరకు ఆత్మహత్యలు తగ్గుతాయి.
భర్తకొట్టినా తిట్టినా మెడపట్టుకు బయటికి గెంటేసినా మళ్ళీ కాళ్ళుపట్టుకుని బ్రతిమాలుకుంటూ, అలాగే క్షణంక్షణం నరకాన్ని అనుభవిస్తూ, అ యింట్లోనే పడిఉండాల్సిన అవసరాన్ని కూడా ఆమెకు ఉద్యోగం తప్పించగలదు.
ఓ రోజున మా ఫ్రెండ్ రాజేశ్వరికి చాలా సీరియస్‌గా ఉందనీ హాస్సటల్‌లో ఉందనీ వార్త అందితే పరిగెత్తుకు వెళ్ళాను. ఏం జబ్బో అనుకుంటూ, అప్పటికే మూడు రోజులుగా మృత్యువుతో పోరాడుతోందిట. ఒళ్ళంతా కాలపోయింది. డెభైశాతం కాలిందట. బ్రతకదని డాక్టర్లు చెప్పేశారు. నల్లగా కమలిపోయింది. ఒక కన్ను కాలి పోయింది. జుట్టులేదు తలంతా పుళ్ళయి పోయాయి. చూడగానే ఒళ్ళు గగుర్పొడిచింది ఎంతో భయంకరంగా ఉంది. శరీరంనుంచి దుర్వాసనరావడం ప్రారంభం అయింది. ఎంతో చక్కనిచుక్క, బంగారపుబొమ్మ. మా రాజేశ్వరి ఆ స్థితిలో చూసి గుండె చెరువైపోయింది. ఒళ్ళంతా మంటలు విపరీతమైన దాహం తట్టుకోలేని తాపం ఎక్కడ ఏకాస్త ఏదైనా తగిలినా ప్రాణంపోయేలా గిలగిల్లాడిపోతోంది. దాని మూలుగులూ, ఏడుపూ వినలేక హృదయం బ్రద్ధలైపోయింది. ఎంత చలాకిపిల్ల ఎంత స్వచ్ఛ హృదయ దీనికి శాపం ఏమిటి ? మేజిస్ట్రేట్ గారు వచ్చి డైయింగ్ డిక్లరేషన్ తీసుకు వెళ్ళారు. వంట చేస్తుంటే పొరపాటున చీర అంటుకుందని చెప్పింది.
మళ్ళీ రెండురోజులకు వెళ్ళాను. దాని బాధ అలాగే ఉంది. చప్పున ప్రాణం పోయేలా ఏ ఇంకక్షనైనా ఇయ్యమని నర్సుని బ్రతిమాలుతోంది. రాజీ తప్పే ! అలా అనకు అన్నాను ? ఒంటి కన్నుతో నన్ను చూసింది. రెండో కంటికి కట్టు. పక్కనే ఉన్న పిల్లల్ని జాలిగా చూసింది. నీ కన్నబిడ్డల్ని విడిచి ఎలా వెళ్ళిపోదామనుకున్నావు. నీకు తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పాను. శరీరం మీద గాయాలు పుళ్ళూ బాధలూ మీకు కన్పిస్తున్నాయి. నా మనస్సులో గాయాలు ఎవరికీ కన్పించవు అని ఏడ్చింది. అప్పుడే అన్పించింది. రాజీ ఏమైనా అఘాయిత్యం తలపెట్టిందేమో ? పొరపాటు కాదేమోనని. ఇంతలో ఎవరో వచ్చారు. ఆ ప్రసక్తి అక్కడితో ఆగి పోయింది. ఎలాగైతేనేం రాజేశ్వరి మృత్యుంజయురాలై నలభై రోజులకి ఇంటికి వచ్చింది. మొహం నిండా భయంకరమైన మచ్చలు. వడిలిపోయినట్లు ముడతలుపడినట్లు శరీరం పరమ వికారంగా ఉంది. పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంటే ఇక భర్త సంగతి చెప్పాలా ? ఇలాంటి పరిస్థితుల్లో స్నేహమే దానికి ఓదార్పునిచ్చేది ! అప్పుడప్పుడూ వెళ్ళి నాల్గు మంచి మాటలు చెప్పి నవ్వించి, ఉల్లాసపరచి వస్తూండేదాన్ని.
ఓసారి వెళ్ళే సరికి రాజీమోహం ఏడ్చి ఏడ్చి వాచిపోయిఉంది. నేను అడక్కుండానే ఏవేవో బొంకింది. తరువాత దాని మాటల్లో ఉన్న నిజం దానికెంత తెలుసో నాకూ అంతే తెలుసని గ్రహించుకొని భోరుమని ఏడ్చింది. రెండో కన్నుకన్పించడం మానేసినా నీళ్ళు కార్చడం మానలేదు ! కళ్లు తుడుచుకుంటుంటే చూశాను. మొన్న వొళ్లు కాలినప్పుడు కాలకుండా మిగిలిన చేతుల మీద వాతలు అట్లకాడలతో పెట్టినట్లు సన్నగా గీతలు, వంకాయ రంగులో బొబ్బలెక్కి ఉన్నాయి. నీకు ఇదేం ఖర్మమే అని కన్నీళ్ళు పెట్టుకున్నాను. రాజీ నువ్వు నిజం చెప్పు ! మొన్న నీచీర పొరపాటున అంటుకుందా లేక మీ ఆయనఅంటించాడా ? అన్నాను. ఇలా ఎవ్వరూ దాన్ని అడగలేదు. ఎందుకంటే ఎవ్వరికీ ఇంత అనుమానం రాదు. వాళ్ళది ఆదర్శ దాంపత్యమనే అందరూ అనుకుంటారు. దాని మొగుడు దానికి ఎన్ని చీరలు ఎన్ని నగలు తెస్తాడు. ఎంత ప్రేమగా చూస్తాడు. అనే అనుకుంటారుగానీ ఇలా కాల్చి వాతలు పెడతాడు అని ఒక్కళ్ళకి కూడా తెలిదు.
రాజీ తన బాధలు చెప్పడం మొదలు పెట్టింది. ఆ బాధలన్నిటితో మూడు నవలలు రాయవచ్చు. సినిమా తీస్తే లవకుశను మించిన కన్నీళ్ళు రాల్పించవచ్చు. అలనాటి సీతమ్మ వారి కష్టాలు రాజేశ్వరి కష్టాల ముందు ఏపాటివి ? అన్పించింది. రాత్రిళ్లు బాగా తాగి చచ్చేలా కొడతాడుట. ఇది చాలామంది చేసేవనే కాని కొడితే ఏడవకూడదట. దాని నోట్లో అదే గుడ్డలు కుక్కుకుని పక్క గదిలో పిల్లలకు కూడా తెలీయకుండా మసలుకోవాలిట ! గుభీకి, గుభీకి చప్పళ్ళువిని పిల్లలువచ్చిమా అమ్మని కొడితే ఊరుకోం అని పోట్లాడటం మొదలు పెట్టారు. నా పిల్లల్ని నామీదకేఉసిగొల్పుతున్నావా అని చిత్రహింస చేయడం మొదలు పెట్టాడు. పిల్లల్నీ హింసించడం, వాళ్ళకి కావల్సిన పుస్తకాలు కొనడు. జీతాలు సరిగా కట్టడు, నలుగురిలో అవమానంతో వాళ్లు నలిగిపోతున్నారు. ఇదిలా ఉండగా పులిమీద పుట్రలా శీలాన్నే అనుమానించడం మొదలు పెట్టాడు.
ఓనాడు పాలవాడు వస్తే చిన్నబాబు పాలు పోయించుకోడానికి వెళ్ళాడు. అమ్మగారు లేరాండి అని అడిగాడు పాలవాడు.
ఎవరు పాలు పోయించుకుంటే వాడికెందుకు, వాడికి అమ్మగారే కావల్సి వచ్చారా మీ ఇద్దరి మధ్యా ఏదోవుంది అని అన్నాడట. మార్కెట్‌కి ఎప్పుడూ ఒకే రిక్షాలో వెడతావెందుకు అని అడిగితే వాడు మిగతా వాళ్ళకన్న తక్కువకి వస్తాడందిట. ఎందుకు తక్కువ తీసుకుంటాడు వాడికింకా ఏమి ఇస్తున్నావోనని ఇంకో పేచీట ! దీనితో రాజీకి వళ్లుమండిపోయింది. అవును నాకు పాలవాడూ రిక్షావాడూ ఏకూలినాలి వెధవో తప్ప మీలాగ కొలీగ్స్ దొరకరు అనేసరికి అతనికి ఉక్రోషంతో వళ్లు మండిపోయింది. ఈ మధ్య అతను ఆఫీసులో చేసే రాసలీల భాగోతం ఊరందరికి ఎప్పుడో తెల్సినా రాజీకి ఈ మద్యే తెలిసింది. రాజీని అతన ఎంత నీచంగానైనా అనొచ్చుగానీ అది ఒక్కమాట అతన్ని అనడానికిలేదు. ఏదన్నా అంటే నీ ఇష్టం ఉంటే ఉండులేకపోతే ఫో అంటాడు ఎక్కడికిపోతుంది తల్లిలేదు. తండ్రి అన్నగారి మీద ఆధారపడి ఉన్నారు. తను వెడితే పిల్లలు ఏమౌతారు పరువు ఏమౌతుంది, నలుగురూ నవ్వరూ ? ఇంక ఎదురు మాట ఒక్కటనేసరికి అతడిలో మానవత్వం పూర్తిగా నశించింది. క్రూరుడైపోయాడు. రాక్షసుడై పోయాడు. దెబ్బలతో వళ్ళు హునం అయిపోయింది. అతడు తిట్టిన తిట్టకి అసహ్యకరమైన పదజాలానికి మనసు ఉడికిపోయింది. బయటికి వెళ్లూ అన్నాడుట నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. నల్లులమందే త్రాగుతావో ఎండ్రినే తాగుతావో కిరసనాయిలు పోసుకుని తగలడతావో నీ యిష్టం.
ఈ విషయంలో నాకింత స్వాత్రంత్యం ఇచ్చినందుకు ఎంత సంతోషించానో తెలిదు. మాత్రలకి విషానికి బయటకిపోవాలి. కిర్సనాయిలు రెడిగా ఇంట్లోనే ఉంది అంటించుకున్నాను. కానీ ఒళ్ళంతా మండిపోతూవుంటే గదిలో ఉండిపోలేక బయటికి పరిగెత్తుకు వెళ్ళాను. అలా ఎందుకు పరుగెత్తాకు వెళ్ళావు అని ఇప్పుడు కాల్చుకుతింటున్నాడు. దెయ్యంలాంటి మోహం చూడలేకుండా ఉన్నాడట అంది రాజీ... నాకేగనక ఒక చిన్న ఉద్యోగంవుంటే కనీసం ఒక్క పూట తినేందుకు అయినా చాలు నేను సంపాదించుకోగల్గివుంటే ఇలాంటి పని చేసేదాన్ని కాదు. నేను ఆశాజీవిని. చచ్చిపోవాలని నాకు లేదు. నాకు చావంఏ ఎంత భయమో అని ఏడ్చింది రాజీ ! అవును రాజీలాంటి నిర్భాగ్యులు ఏడవడం తప్ప ఏం చేయగలరు ?
అప్పుడు నాకు అన్పించింది నిజంగా స్త్రీకి ఉద్యోగం ఎంత అవరసమో అని. ఇది వరకు మీ అమ్మా అమ్మమ్మా ఉద్యోగాలు చేశారుటే అంటే ఇప్పటి వాళ్ళకి మల్లే వాళ్ళు హింసపెట్టేవాళ్ళుకాదు. అయినా పరువుపోతుందనో, పాపమనో, నరకమనో అనుకునేవాళ్లు. ఇప్పటి వాళ్ళకి పాపమూ లేదు పరువూలేదు అంది.
ఇక రాజీ బ్రతుకు ఎలా తెల్లారుతుంది ? దాని ఎనిమిదో క్లాసు చదువు దానికేం ఉద్యోగం తెచ్చిపెడుతుంది ? మిషను కుట్టుకునో వంటచేసుకునో బ్రతికేందుకు మధ్య తరగతి అహం ఎంతవరకు అంగీకరిస్తుంది అని పగలూ రాత్రీ ఆలోచిస్తున్న రోజుల్లో రాజీ ఒక సంతోషకరమైన వార్త చెప్పింది. బేబీ కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తోందిట. ఈ ఆధారంతో నేను భగవంతుడిచ్చిన ఆయుర్ధాయాన్ని పూర్తిగా అనుభవిస్తాను. మధ్యలో చచ్చిపోనక్కర్లేదు అంది. అర్థబలం ప్రాణానికి ఇంత అవసరమో రాజీగాథ తెలియజేస్తోంది. చదువెందుకు ? ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా అన్న మాట ఎంత అర్థరహితమో తెలుస్తోందికదూ ?
|