ఆనందవర్మ : అక్కడ నుండి కదలివారందరూ శ్రీరంగరాయలను సకుటుంబంగా బంధించి ఉంచిన భవంతికడకు వెళ్ళరి. వారు నిలబడిన తావున నేలకదులుతూ ఉన్నట్లనిపించినది. భూకంపం అని భయపడకండి. ఇది రంగరాయల పక్షమువారి పన్నాగము. వేంకటపతిరాయులు యాచమనాయకునితో ఒక రహస్య భూమార్గమును గురించి లోగడ చెప్పినాడు. అప్పుడు నేనక్కడనే ఉన్నాను. ఆ రహస్య మార్గము ఈ జలాశయం నుండి ప్రారంభమై, ఊరికి దక్షిణాన ఉన్న శివాలయానికి చేరుతుంది. ఈ మార్గంగుండా పాలకుల శయనాగారానికీ మహారాణీవారి అంతఃపురానికీ కూడ చేరవచ్చును, అంటూ జగ్గరాజు ముందుకు నడచినాడు, భవన ప్రాంగణంలో వీరందరూ చేరిన సమయానకు, రాత్రి మూడోయామములో సగభాగము గడిచిపోతూ ఉన్నది.
భూగర్భ మార్గము నుండి శ్రీ రంగరాయలు బంధింపబడిన భవంతి లోనికి రాజభక్తులైన పదిమంది వీరులచేత సొరంగమును త్రవ్వించి శ్రీ రంగరాయ సార్వభౌములను రక్షించి, బయటకు తప్పించి తీసికొనిపోయే ప్రయత్నమును యాచమ నాయకుడు సాగిస్తూ ఉండెను. మరి రెండు మూడు నిమిషాలలో పరిపూర్తి కావలచ్చునని అతడు తలపోస్తూ ఉండగా. భవంతిలో ప్రవేశించిన మొదటివీరుని ఆర్తనాదుమునకు మిగిలినవారి గుండెలదరిపోయినవి. వాని తల తెగిరక్తము సొరంగ మార్గంలోనికి ప్రవహించి రాసాగినది. జగ్గరాజు పక్షము వారు ముందుగా భవంతిని ప్రవేశించిన ఆరుగురు వీరులను ఖండించి మార్గమును మూసివేసిరి. నలుగురు వీరులు జలాశయం వైపు పరుగిడిరి. యాచము నాయకుడు ఎవరికంట పడకుండా ఒక మూలకు ఒదిగి, ఊపిరి బిగపట్టుకొని కూర్చుండెను. అతని బ్రతుకు మరికొన్ని క్షణాలలో ముగియవచ్చును. సొరంగమునకు రెండువైపులా శత్రుభటులు కాపలా కాస్తూ ఉండవచ్చును. అతని తల బయటికి వచ్చిన వెంటనే తెటిపడుట తధ్యము.
యాచమ నాయకుడు, మరికొన్ని క్షణాలకు స్త్రీ యొక్కచ పిల్లల యొక్క ఆర్తనాదాలను వినలేక చెవులు మూసుకొన్నాడు. ఛీ , ఛీ జగ్గరాజు ఇంతటి రాక్షసుడా ! ఈ్రఃస్త్రీలను బాలురను సైతము చంపివేస్తూన్నట్లున్నది ! శ్రీ రంగరాయల వారిదేవి వైశ్వానరీదేవిని అయినా ప్రాణాలతో ఉండనీయడా ! అనుకున్నాడు. కొన్ని క్షణాలకు ఆర్తనాదములు, ఏడుపులు మూలుగులు ఆగిపోయినవి.
అచట మరెవ్వరైనా ఉన్నారో లేరో, అనుకుంటూ, సద్దు చేయక వెలికివచ్చిన యచమ నాయకుడు దిగ్ర్భాంతుడైనాడు. అతని తల గిఱ్ఱున తిరిగినది. తన అనుచరులు మెరికలు వంటివారు, ప్రాణాలను స్వామి కార్యమునకై తృణప్రాయముగ ఎంచినవారు ఆరుగురు తలలు తెగిరక్తపు మడుగులలో పడి ఉండిరి. అంతర భవంతి లోనికి నెమ్మదిగా అడుగుపెట్టినాడు. అచట రాజముద్రాంకితుడు శ్రీ రంగరాయలు, అతని దేవేరి వైశ్వానరీదేవి, వారి మువ్వురు కొమరులు తలలు మొండెములు వేరుకాగా నెత్తురు రక్తపుటేరులలో తేలుతూ ఉండిరి. అదివీర భయంకరుడైన యాచమ నాయకునికి, ఈ భీభత్స దృశ్యమును చూచి వెంటనే క్షణకాలము మతిచలించినట్లయి, మ్రాన్పడిపోయినాడు.
వైశ్వావరీదేవి శిరము రక్తసిక్తమై శ్రీరంగరాయల పాదాలచెంతపడి ఉన్నది. ఆమె కంఠహారములు అటునిటు చెదిరిపడి ఉన్నవి. పసి బాలురు భయంతో తల్లిచీర చెరగుగట్టిగా పట్టుకొనిననట్లున్నది. కిరాతలకులా బాలురను ఈవలకు లాగినప్పుడు వారి గుప్పెట్లలో ఆమె చీరకొంగూ కూచ్చెలలూ చిక్కుకున్నవి. శ్రీరంగరాయల కడగొట్టు బిడ్డలకి ఇంకనూ ఏడేండ్లు నిండలేదు. బూరెబుగ్గలతో పాల్గారునట్లున్న నిండు చందమామ వంటి వారి మోమున భయరేఖలు లేవు. నిదురలో ఉండగనే, ప్రప్రధముగ, ఆ పసిపాపడిని, తల్లితండ్రుల కన్నుల యెదుట వధించిరి కాబోలు ఏతల్లి తండ్రులకైనా ఇలాగ ఇంతటి భరించరాని దుఃఖము కలిగించిన ఈ కసాయి క్రూరులకు ఎటువంటి శిక్ష విధించినప్పటికిన్నీ సరిపోదు.
వద్దు, వద్దు అంటూనే ముద్రికను ధరించినావు కదా, శ్రీరంగరాయ ప్రభూ ! నీవంటి దురదృష్టవంతుని ఈ కనులతో చూచి ఉండలేదు సరికదా, వినికూడా ఉండలేదయ్యా అని యాచమ నాయకుడు అశ్రువులు దొనదొన రాల్చినాడు. కాని తాను దుఃఖించుచూ కూర్చుండుటకు అది సమయంకాదు. శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు దాని రక్షణకొరకు మానిసి సర్వప్రయత్నములూ చేయవలసినదే . తానిప్పుడు ఎట్లు తప్పించుకోవలెనన్నది ముఖ్య సమస్య శ్రీరంగరాయన వ్రేలికి ఉన్న రాజముద్రికను తీసి తన నడుముకు ఉన్న తోలుపటకాలో పదిలపరచుకొన్నాడు. |