137
 

మరల సొరంగమార్గముననే బయటపడవలెనని యోచిస్తూ ఉన్న యాచమ నాయనికి మంచముల క్రిందుగా చిన్న అలికిడి వినిపించినది. తొంగి చూచినడు. భయంతో గజగజవణికిపోతూ , నేలను అంటిపెట్టుకొని ఉన్న బాలకుడు కన్పించినాడు. ఆ బాలుడు శ్రీరంగరాయలవారి రెండవ కొమరునిగా గుర్తించినాడు. బాలుని భుజము పట్టుకొని వెలికిలాగ యత్నించగా బాలుడు రోదించసాగినాడు. నాయనా, భయములేదు. నేను నిన్ను చంపుటకు రాలేదు. రాయవంశము పూర్తిగా నశించిపోలేదు. నీ రూపాన మిగిలి ఉన్నది, తండ్రీ ! ఆ విరూపాక్ష స్వామివారి కృప, నా ప్రాణాలను అర్పించి అయినా సరే నిన్ను నేను ఈ విజయనగర సామ్రాజ్య సింహాసనాన కూర్చుండబెట్టి తీరతాను. బయటకు రాబాబూ ! నేను నీ తాతవంటి వాడిని, అంటూ ఆ పన్నెండేడుల బాలుని అనునయించి, భుజాన వేసుకొని, సొరంగ మార్గాన ముందుకు నడచినాడు.

సొరంగమార్గంలో బాలుడు ఊపిరి సరిగా ఆడడం లేదని ఏడుపు మొదలు పెట్టబోతూండగా, మాటలలో పెట్టి సేదతీర్చినాడు, యాచమనీడు.

తండ్రీ ! నీ పేరేమిటి ?

నా పేరా ? రామరాయులు.

అబ్బో ! ఎంత మంచిపేరు పెట్టారు, బాబు నీకు ! రాయలవారంతటి ప్రభువువు అవుతావా ? నీ వంశంలో ఎందరో మహావీరులు పుట్టి ఎన్నో యుద్ధాలు చేసి, శత్రువులను ఓడించారని నీకు తెలుసునా చిన్ని దొరా ?
ఎందుకు తెలీదు, తాతయ్యా ? కృష్ణరాయలవారి వీరగాధలు మా లమ్మగారు మా నాన్నగారు అస్తమానూ వినిపిస్తూనే ఉంటారుకదా ;

అవునా,మరి కృష్ణరాయలవారిలాగ నువ్వూవిజయనగర సామ్రాజ్యాన్ని ఏలగలవా ?

ఎందుకేలను? మా అమ్మగారు నాకు కత్తి ఇయ్యరు. చిన్నపిల్లవాడివి గాయాలు చేసుకొంటావు అంటారు. లేకపోతే నేను కత్తితో ఇందాక వచ్చిన రాక్షసులను అందర్నీ చంపేవాడినే. తాతయ్యా ! మా అమ్మా నాన్నగారు చచ్చిపోయారుకదూ ? నాకు ఏడుపొస్తొంది తాతయ్యా.

చూడు, తండ్రీ ! రాజ్యాలు ఏలే రాజులు ఏడకకూడదు. నువ్వు చక్రవర్తివి కనుక అసలు ఏడవకూడదు. యుధ్ధాల్లో తమ్ముళ్ళూ, కొడుకులూ, స్నేహితులూ చచ్చిపోతూనే ఉంటారు. మహారాజులు ఏడిస్తే ప్రజలు నవ్వుతారు. ఇదెక్కడి ప్రభువు, ఇలా ఏడుస్తున్నాడు అని హేళన చేస్తారు. నువ్వు ఎంతో ధైర్యంగా ఉండాలి. ఆకలవుతోందీ... అమ్మ కావాలీ....ఊపరి సలపడలం లేదూ అంటూ పిరికివాళ్ళు ఏడుస్తారు. నువ్వు మీ తాతాగారి లాగ, యుద్ధంలో శత్రువుల్ని చంపాలి చూడు బాబూ, మీ అమ్మగారిని, నాన్నాగారినీ నిర్ధాక్షిణ్యంగా చంపిన రాక్షసుల్ని నువ్వు మొదట చంపాలి.

ఏదీ , మరి నాదగ్గర కత్తిలేదుగా!

నా దగ్గిర ఉంది , నాన్నా ! నే ఇస్తాగా. యుద్దం చేయడం నీకు నేను నేర్పిస్తాను. సరేనా ?

సరే, తాతయ్య ! ఇంక ఏడవను...మనం బయటికి ఇంకా ఎంత సేపటికి వెడతాము ?

బాలుని ప్రశ్నకు యచామ నాయకుడు ఉలికిపడినాడు.

యచమ నాయకునకు కాలమెంత అయినదో తెలియలేదు. అదివరకు ఉన్న పాతభూమార్గం కాక, తాను మరి ఒక కొత్తభూమార్గం త్రవ్వించినాడు. రామరాయలతో సంభాషిస్తూ నడుస్తూ ఉండడంవల్ల తానే మార్గాన పయనిస్తున్నదీ గ్రహించలేకపోయినాడు. సూర్యోదయమైనదో, లేదో ? తనకు మాత్రం కటిక చీకటి. రాయవంశానికి ఉన్న ఈ ఒక్క ఆశాకిరణాన్ని రక్షించడం ఎలాగ ? ఎక్కడ ఏ రక్కసుడు పొంచి ఉన్నాడో ? ఇట్టి ఆలోచనలు చేస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉన్న యాచమ నాయకుడు మార్గం చివరకు చేరినట్లు గ్రహించినాడు. రామరాయలను సొరంగంలోనే ఉంచి, తాను బయటకు పోయేదారికి అడ్డంగా ఉన్న రాతి ఫలకాలను తొలగించి జాగ్రత్తగా పారకించినాడు. అది పాడుబడిన శివాలయమని తెలుసుకొన్నాడు. గర్బగుడికి ఈశాన్యకోణమున బయటకు వచ్చినాడు.