అక్కడ ఎక్కడా మనిషి సంచరిస్తూన్న అలికిడి లేదు. పక్షులు ముక్తకంఠంతో, సహస్ర కిరుణునికి స్వాగతగీతంలా, కిలకిలారావాలు పాడుతున్నవి. ప్రక్కనే ప్రవహిస్తున్న నదీ సుందరి, ఒంపులు తిరిగి ఒయారాలు పోతూ, సముద్రదిశగా ప్రియబాహు పరిష్వంగాసక్తయై, వేగరియౌతూ ఉన్నది. అంధకారము నుండి వెలుగులోనికి, చాలీచాలని గాలిగలతావు నుండి చల్లని పిల్లగాలులు ఒడిలోనికి వచ్చి యాచమ నాయకునకు ప్రకృతి దేవత, ఆనందంగా తమనను ఆహ్వానిస్తున్నట్లు తోచినది. వెంటనే రామరాయకు చేయందించి బయటకు చేర్చుకొని ,ప్రేమతో హృదయానకు అదుముకొనివాడు.
ధూపదీపనైవేద్యాలులేని ఈ శివలింగాన్ని చేస్తూనే యాచమనీడు భక్తి పారవశ్యంతో పులకరించినాడు. మహాదేవా, నీలకంఠా, మృత్యుం జయా ! సర్వసర్వేశ్వరా, సర్వలేకేశ్వరా ! త్రిశూలాంకితదివ్యహస్తా, భుజంగాలం కృతశరీరా ! జ్వాజ్వల్యసోమసూర్యాగ్ని నేత్రా, విరుపాక్ష త్రినేత్రా ! విశ్వేశ ఈశామహేశా ఉమేశా ! కపాలమాలాసంశోభిత విశాల, వక్షా ! శ్మశాన సంచార, పూతభస్మాలంకృత శరీరా ! ఫాలచంద్రా, దివ్యగంగాధరా ! శ్రీ చంక్రసంచారిణీదత్తసంతతా శ్లేషితాంగా ! లయానంద పంచనాద స్వరూపా ! నమస్తే, నమస్తే, నమః యాచమ నాయకుడు నేత్రగంగతో రుద్రాభిషేకము చేసినాడు.
రామరాయలు తల్లితండ్రుల వియోగములను తలచుకొని తలచుకొని విలపించినాడు. ఇందులకు యాచమనీడు అభ్యంతరము తెలుపలేదు. ప్రదేశమంతయు నిర్మానుష్యముగ నున్నది. రామరాయల హృదయవేదన బయల్పడక తప్పదు. అందులకా ప్రదేశము అనుకూలముగ నున్నది.
శివాలయము వెనుక పెరటి గోడలు ఎండలకు ఎండి, వానలకు తడిసి కూలుటకు సిధ్ధముగ ఉన్నవి. అవి యాచమ నాయకుని బలిష్ట బాహువులతో ఒక్కత్రోపు త్రోసినంతనే ఇట్టే కూలిపోయి, మార్గమిచ్చినవి. అచట నుండి పది గోరుతములు నడచి, నదిని దాటినట్లయిన, చాలవరకు...భయము లేనట్లే. ఇరువురూ మిక్కిలి వేగాన నడచినారు. యాచమ నాయకుడు ఉత్తరీయం కొనను రామరాయల నడుముకు కట్టి, రెండవకొనను తన నడుమునకు కట్టుకొని నదీతరణం ప్రారంభించినాడు. కొంతవడికి రామరాయలు తన తలను నీటిపై నిలుపలేకపోయినాడు. యాచమ నాయకుడు ఒక చేత నీటిని త్రోయుచూ రెంవడచేత రాయలను వీపుపైన వేసుకొని, అతికష్టాన ఆవలి ఒడ్డుకు చేరుకొన్నాడు. అచ్చట నదీతీరము కీకారణ్యము. దట్టంగా పెరిగిన చెట్లతో, ఒత్తుగా పెరిగిన పొదలతో తమకు మిక్కిలి భద్రతనిస్తూ ఉన్నవి. ఇకను, శత్రువులు పట్టజాలరు.
యాచమ నాయకుడు దీర్ఘంగా నిశ్వసించినాడు. ఒక గుబురు చెట్టు నీడన చేయి తలక్రింద పెట్టుకొని విశ్రమించినాడు. రామరాయలు అడవిలో కొంచెందూరం తిరిగి, మధురఫలాలను, సుగంధ పరిమళ పుష్పాలను తెచ్చి యాచమ నాయకుని పాదాల చెంత ఉంచి తాతయ్యా ! అని నోట మాటరాక అట్లే ఉండిపోయెను. చిట్టితండ్రి, ఎందుకయ్యా పూలు తెచ్చావు, ఈ సిగలో పెట్టుకోనా ! అని పకపక నవ్వెను.
తాతయ్య ! నువ్వు ఉదయం శివలింగం దగ్గర ఏవో మంత్రాలు చదివావే, అలాంటి మంత్రాలు ఇప్పుడు నీ దగ్గర చదవాలనిపిస్తోంది. కానీ నాకు చేతకావటం లేదు. నువ్వు...నువ్వు...ఆ దేవుడికన్న. కన్న తల్లి తండ్రులకన్న ఎంతో ఎంతో గొప్పవాడివి...ఈ పువ్వులలో నీకు పూజ చేయనీ, తాతాయ్యా ! అని వలవల ఏడ్చినాడు. ఆ చిన్నిమదిలో కదలాడిన కృతజ్ఞతాభావానికి యాచమ నాయకుడు కదలిపోయెను.
తప్పు, నాయనా ! నేను నీ సేవకుణ్ని. ప్రభుభక్తే నాకు ఊపిరి. నా గుండె ఎల్లప్పుడూ, ప్రభూ, ప్రభూ అంటూ కొట్టుకుంటుంది...నీకు పట్టాభిషేకం చేసేవరకు నేను స్థిమితపడను....మూడు దినాలలో ఇద్దరు చక్రవర్తులను కోల్పోయిన పెరుగొండ పుర ప్రజలదెంత దౌర్భాగ్యమో ! నీ క్షేమమే సర్వ విజయనగర సామ్రాజ్యానికీ క్షేమము. నీవెంతో అపురూపమైన పెన్నిధవి. నిన్నెలా కాపాడుకుంటానో, తండ్రీ అని నేను శతవిధాలుగా, సహస్రవిధాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. మన అదృష్టం కొద్దీ, జగ్గరాజు నగరానికి ఉత్తరాన ఉన్న ఈ శివాలయాన్ని వదలి దక్షిణాన ఉన్న శివాలయంకడ తన సైనికుల్ని ఉంచి ఉంటాడు. ఒక ఘడియ సేపు నీవూ విశ్రమించు. ఇకనుంచి నీవే నవవాలి సుమా ! ఇంక ఈ ముసలి వాడు నిన్ను మోయలేడు, అని చిరునవ్వులో రామరాయలను పొదవుకొన్నాడు. రామ రాయలు తన భారాన్ని యావత్తూ యాచమ నాయకుడే వహించినందున,తాను నిశ్చింతగా నిదురకూరినాడు. సంతోషమూ దుఃఖమూ లేని తావునకు, శాంతమూ క్రోధమూలేని తావునకు, వెలుగూ చీకటిలేని తావునకు, జ్ఞానమూ, అజ్ఞానమూ లేని తావునకు గొంపోయి నిద్రాదేవి వారిని గాఢంగా పొదవుకొన్నది. ఒక ఘడియకు లేచి ప్రయాణము సాగించవలెనను కొన్నవారికి సాయంకాలము పక్షులు గూళ్ళకు చేరకుంటూ చేసిన సందడికిగాని మెలకువ వచ్చినది కాదు. |