నారాయణభట్టు కొంతవడికి తేరుకొనినాడు. తానింతకు ముందు వినిన గుసగుసలలోని యదార్ధం అతనికీ అవగతమైనది. శ్రీ రంగరాయుని కుమారుడు రామరాయలు ఇచట వధింపబడిన వారిలో లేడట. నారాయణభట్టు హృదయం సంతోషంతో పొంగిపోయినది. రామరాయులు సింహాసనానికి వారసుడు. అతనిని ఏ పుణ్యాత్ములు రక్షించినారోగాని, వారి పవిత్ర పాదాలపై సౌష్టాంగపడవలెనన్న తలంపాతనికి కలిగినది. ఇలాంటి మంచిబుద్ధి తనకు ముందే కలిగి ఉన్నట్లయిన, రక్తపాతము కాకుండ, తానే శ్రీరంగరాయలను రక్షంచి ఉండేవాడనుకదా, అని వాపోయినాడు. జరుగకూడని కీడు జరిగియేపోయిప్పుడు పశ్చాత్తాపము వలన ప్రయోజనమేమున్నది ?
జగ్గరాజు, చెంగల్వనాయకుడు, మరికొందరు ప్రముఖులు హుటాహుటిన ఆ తావునకు వచ్చిరి. శ్రీరంగరాయలపుత్రడు రామరాయలు చావు నుండి, చెరనుండి తప్పించుకొన్నాడన్నవార్త జగ్గరాజు చెవిని పడినది. అతడు మండిపడినాడు. రామరాజు ఏ త్రోవను తప్పించుకుపోయినాడన్న విషయం తన అనుయాయిలతో చర్చించినాడు, కాని గ్రహించలేకపోయెను.
యాచమ నాయకుడు తాను సొరంగ మార్గాన వెడుతూ, ఆ త్రోవను పెద్ద బండతో లోనుండె అతి చాకచక్యంగా మూసివేయగలిగినందున, ఆ మార్గంపై జగ్గరాయాది ప్రభృతులకనులు పడలేదు. అందుచేత, కాపలా కాస్తూ ఉన్న తన సైనికులే తన శత్రువుకు సాయపడి ఉందురని అనుమానించి, ప్రాకారముల, మొగసాలల కడనుండు ఇరవై ఆరుగురు సైనికులను చెరసాలపాలు చేసిరి.
రాజముద్రిక కూడ లేకుండెనన్న విషయము నారాయణభట్టు జగ్గరాజుతో మనవి చేసికొన్నాడు. జగ్గరాజు మహోగ్రుడైనాడు. చిందులు వేసినాడు.
ఇవి యాచమ నాయకుని పనులే. వెంటనే దేశము నలుమూలలకు చారులను, భటులను పంపి,వాని కొరకు గాలించండి అని ఆజ్ఞాపించినాడు.
నెల్లూరు, గండికోట, కొచ్చర్లకోట, ఆదోని, కర్నూలు, ఉదయగిరి, చంద్రగిరి మున్నగు పట్టణాలకు మారువేషాలతో జట్లు జట్లుగా అశ్వికులను జవనాశ్వాలపై పంపినాడు. తిరుపతి, కంచి, శ్రీరంగపట్టణము ఇత్యాది పుణ్యక్షేత్రాలలో యాచమ నాయకుడు రామరాయలు తైర్థికులవలె వేషము మార్చి తిరుగులకు అవకాశము ఉన్నదన్న అనుమానంతో, ఆయా దివ్య క్షేత్రాలకు సైనికదళాలను యాత్రికులవలె నటిస్తూ శత్రువుల ఉనికిని కనుగొనుటకై వినయోగించెను.
ఎక్కడైనాసరే, ఒక నడివయస్సువానితో ఒక పన్నెండేళ్ళ వయసున్న పిల్లవాడు కన్పించినట్లాయెనా, ఏదో ఒక పన్నాగంతో వారిద్దరును బంధించి తీసుకొనిరండి లేదా, తెగనరకి తలలు తెండి, అంతేగాని వారిని ప్రాణాలతో పోనీయరాదు, అని జగ్గరాజు సైనికులకూ చారులకూ ఖండితంగా ఆదేశించినాడు. ఆ పిల్లవాడు పూర్ణాయుష్కుడు కనుకనే తప్పించబడినాడు. అల్పాయుష్కుడైనట్లయిన ఇచ్చటనే వధింపబడి ఉండేవాడు, అని నారయణభట్టు భావించినాడు.
యాచమ నాయకుని జాడ తెలియక, నాటికి మూన్నాళ్ళు, గొబ్బూరి జగ్గరాజు కాలుగాలినపిల్లి ఆయెను, నిప్పుతొక్కిన కోతి ఆయెను. అతడు ఒక గట్టి నిశ్చయానికి వచ్చినాడు. ఏది ఏమైనా యాచమనాయకుని తంజపురికి మాత్రము చేరనీయరాదు, అని తక్షణము సర్వ సైనాధ్యక్షుడు చంగల్వనాయకుని ఒక్కనితో ప్రత్యేక రహస్య సమాలోచనలను చేసినాడు.
ఉన్నట్లుండి, గొబ్బూరి జగ్గరాజు పిడుగువంటి ఆజ్ఞ ఇచ్చినాడు. యాచమ నాయకుడు తనవంటి రాజభక్తులు, విశ్వాసపాత్రులు అయిన దుర్గాధిపతులను, సామంతులను, దళాధి పతులను, కూడగట్టగల సమర్ధుడు. రామరాయలే చక్రవర్తుల నిజమైన వారసుడని ప్రకటించి, పట్టాభిషేకము చేయగల శక్తియుక్తులు గలవాడు. ఇట్టివాడు ప్రాణాలతో నిలువరాదు. ఇప్పుడు అతనిని తంజపురికి చేరనీయరాదు. అతడు తంజపురి చేరెనామన ప్రయత్నాలు , వ్యూహాలు అన్నీ చెడి వ్యర్ధమైనట్లే. అతడు తంజపురికి చేరకుండా ఏ విధాన్నయినా నిరోధించాలి. తంజపూరు పోవాలంటే కావేరిని ఆనకట్టమీదుగా దాటవలసి ఉన్నది. యాచమ నాయకుడు ఆనకట్ట దాటకముందే దానిని అగ్నిగుండ్లతో పేల్చివేయండి.
మిక్కిలి క్రూర స్వభావులైనప్పటికిన్నీ, అప్పుడచ్చట ఉన్న నాయకులు, మహానాయకులు, చారులు, చారనాయకులు ఇత్యాది పరివారము గుండెలు, జగ్గరాజు మాటలకు అదిరి, అరనిమేఫము ఆగిపోయినవి.
ఇది పంటలు చేతికందే సమయం, అంతపెద్ద అనకట్టను ప్రేల్చివేస్తే జలప్రళయం సంభవించి కొన్ని భూములు వరదలవల్లనూ, కొన్ని భూములు నీటి కొరతవల్లనూ ఊళ్ళకు ఊళ్ళేజలసమాధి అవుతాయి ప్రాణనష్టాన్ని గణించలేము. పశువులు అసంఖ్యాకంగా నాశనమై పోగలవు. విస్తట్లో వడ్డించిన మృష్టాన్నమును తన్నివేసినట్లు అవుతుంది....ఈ మాటలు పలుకుతూ ఉన్నవాని నాలుక తటాలున ఖండించబడినది. మిగిలినవారి మాటనోటి బైటకురాగ గొంతులో అట్టే అణగారిపోయినది.
ఒక్క యాచమనాయకుని కొరకు, ఒక్కరామరాయలు కొరకు అశేషజనానికి ప్రయోజనకారియైన ఆనకట్ట, కావేరి నదిపై వెలిసిన అతిపెద్ద, ఆనకట్టచ గొబ్బూరి జగ్గరాజు పనుపున, అగ్రిగుండ్ల వర్షమునకు లోనై అర ఘడియకాలంలో కూలిపోయినది.
నీటి వెల్లువలో కొట్లుకొపతోతూన్నవారి హాహాకారాలు, మునిగి చనిపోతూన్న వారి ఆర్తనాదాలు, సర్వస్వమూ కోల్పోతూ ఉన్నవారి ఆక్రందనలు, ఆ భీభత్సానికి ఉన్మత్తులైన వారి ప్రలాపాలు ఆలకించేవారు లేకపోయిరి.
అక్కడి మ్రుక్కడులవల్ల అలాగ ఇడుములబడ్డ వేలాదిమంది జనుల మహాగోడును విని, ఇక్కట్లను తీర్చగలవాడు ఏ ఒక్కడైనా కలడో, లేడో ? |