గోవిందదీక్షితుల వారికి మూర్తెప్ప నాయనిం వారి వేదన గ్రహింపైనది. వారు గాఢముగ నిట్టూర్చిరి. మూర్తెప్పా ! ఆందోళన చెందినంత మాత్రం చేత కార్యములు జరుగవని తెలిసి ఉండిన్నీ ఇలా వ్యధ చెందుతావేమయ్యా ? మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికి విధి కూడా అనుకూలించాలి గదా ! అనిరి.
మూర్తెప్ప అమాత్యుల మాటలకు ఖిన్నుడాయెను. మహామంత్రీ ! మీరు తలుచుకుంటే, కాని కార్యం ఉంటుందని నేనే కాదు, ఈ అఖండ ధరిత్రిలో ఎంతటి మూఢుడైనా అనుకోలెడు. విధి వ్రాత ఎలా అయినా ఉండనీయండి మీ చల్లని ఒక్కవాక్కు ఒక్కసారి శుభం అని అంటే మహాద్భాగ్యంగా భావిస్తాను, అని మూర్తెప్ప నాయనిం వారు, రుద్దకంఠంతో వేడుకొనిరి.
గోవిందమఖికి మూర్తెప్ప మాటలకి నవ్వు వచ్చినది. మూర్తెప్ప మాటలు తన చిన్ననాటి ఒక సంఘటనను జ్ఞప్తికి తెచ్చినవి. సప్తవర్షాలకే గోవిందుడు, యజ్ఞోపవీతంతో, గోష్పాదశిఖతో థగథగ వెలిగే కుండలాలతో చెంగావిపట్టు అంగవస్త్రం ధరించి, అవరవామనునిలా చూపరులకు కనువిందులు చేస్తూ ఉండేవాడు. తండ్రి ఒడిలో కూర్చొని సర్వస్తోత్రాలు హృద్గతం చేసికొనేవాడు. ఒకమారు రాబోయే విఘ్నేశ్వరచతుర్ధికి తానే పూజ చేయిస్తానని పట్టుబట్టినాడు. అప్పడు విశ్వశ్వర దీక్షితులవారు కొమారునకు పూజావిధానాన్ని అవగతం చేయించినారు. తదుపరి గోవిందుడు మేనమామల గ్రామానికి వెళ్ళినప్పుడు మేనమామ మేనల్లుని మేధకు సంబరపడి, ఏమిరా, గోవిందూ ! నువ్వు వినాయకపూజ చేయించడం నేర్చినావుట. ఒక మాటు వినిపించరా అన్నాడు. మామయ్యా ఇప్పుడిక్కడ వినాయకుడి విగ్రహం లేదుకదా పూజ ఎలా చేసేది ? అని గోవిందుడు అన్నాడు. మేనమామ నవ్వుతూ అక్కడే ఆడుకొంటున్న బొద్దుగా పెద్ద బొజ్జతో ఉన్న ఒక పిల్లవానిని చూసి ఇదిగో వీడే వినాయకుడు. పూజ చేయి అన్నాడు.
కొందరు పిల్లలు ఆకులూ పువ్వులూ పట్టుకొని వచ్చినారు. గోవిందుడు ఆ బొజ్జబాలుని వినాయకునిలా కూర్చుండచేసి కనులు మూసికొని ఆవాహన చేసి అష్టోత్తర పూజచేసి ధూపదీపారాధనతో షోడశోపచారములతో అర్చించినాడు. గీతం శ్రావయామి, నాట్యందర్శయమి అనినప్పుడు, గోవిందుడు చక్కని శ్రావ్యగానంతోనూ నాట్యంతోనూ గణపతిని అర్చించి, పూజానంతరం స్వామికి ఉద్వాసన చెప్పేసరికి ఆ బాలుడు విగతజీవుడై పడిపోయినాడు. అందరూ గొల్లుమని పెట్టిన గోల చెవులబడి, గోవిందుడు కనులు తెరచి చూచినాడు. కాని గోవిందుడు అతి చిన్నవాడై నందున ఆ బాజ్జబాలునికి జరిగినదేమిటో బోధపడలేదు. తన మేనల్లునికి ఆమోఘ వచనశక్తి ఉన్నదని మేనమామ గ్రహించి మిక్కిలి భిన్నుడైనాడు. మరలాఆవాహయామి అనిపించేసరికి బాలుడు లేచి కూర్చున్నాడు ! ఆనాటి సంఘటనను కథలా అప్పుడప్పుడు అందరూ చెప్పుకుంటూ ఉంటారు.
ఇప్పుడు మూర్తెప్ప నాయకులు కూడా, గోవిందదీక్షితులు ఆశీర్వదించినట్లయితే, తిరుగులేని ఆయన వాక్కుకు తప్పక తమ కొమరిత వివాహం అవుతుందని ఆశపడుతూ ఉండిరి. గోవిందామాత్యులు నవ్వుతూ, లలాట లిఖితమును పరమేశ్వరుడైనా మార్చలేడు. నీ కుమార్తెకు వచ్చిన కీడేమీ లేదు. ఆమె కీర్తి ఆచంద్రతాకార్కమూ, శాశ్వతంగా ఉంటుంది. అనిరి.
చెంచులక్ష్మీదేవి జాతకాన కళ్యాణయోగం ఉన్నదా లేదా అని పేరి శాస్త్రులవారు గోవింద దీక్షితులవారితో చర్చించసాగిరి. |