తాము శుకవాణీ పాణిగ్రహణము చేసేందుకు ఇంతనూ వ్యవధానము ఉన్నదని గోవింద దీక్షితామాత్యులవారు, మూర్తెప్ప నాయనిం వారితో చెప్పినారన్న వార్త శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయక మహారాజుల వారిని కలచి వేసినది. తమ దురదృష్టమా, దుర్విదా ? తమ ప్రణయంలో ఏదైనాలోపము ఉండెనా ? లేక తమ సంతోషానికి అడ్డుపడతలచి ఎవరైనా పన్నుతున్న పన్నాగమా ? ఎందుకిలా అవుతూన్నది ? తమ ఆనంద ప్రవాహానికి గురుదేవులు ఎందుకిలా ఆనకట్టలు వేస్తూ, ఆంక్షలు పెడుతూ ఉన్నారు ?
మహారాజుల అనంతమైన వేదనా స్రవంతికి భంగం కలిగిస్తూ శుకవాణీదేవి వీణెపై నూతన రాగమును మేళవిస్తూ ఉన్నది. విరహముతో దహించుకుపోతూ ఉన్న మహారాజుల హృదయము, రాగజ్యోత్స్నాభివర్షితమై , సుశీతలమైనది. ఎఱ్ఱబారిన కనుగవ తెలివెన్నెలలో ఆనందంతో మెరిపే కలువలా మెరసినది. ఆయన రత్న సింహాసనాన స్థిరంగా కూరుచుండలేకపపోయెరి.
ఏ రాగమును పల్లవిస్తూ ఉన్నావు దేవీ ! అని ప్రభువుల మనసు ఉద్విగ్నమైనది. పంచ ప్రాణములనూ బంధించి సర్వేంద్రియాలనూ ఆకర్షించి, ఏవేవో లోకాలకు గొనిపోతూ ఉన్న ఈ రాగిణిదేవి ఏ మహర్షి అద్భుత సృష్టి ? ఈ రాగమనోహరి యొక్క జన్య జనక సంబంధ భేదములను గ్రహించవలెనని దానిని రఘునాధుల పరిశ్రమ ఫలించినది కాదు. రాగాంగ, ఉపాంగ, క్రియాంగ, దేశాంగములేవియో శోధించపలెనని తలచిన తలంపు కూడ వ్యర్ధమైపోయినది. ఇదెవ్వరి కృతి ? ఇదే గీతిక ? ఈ ప్రశ్నలు లోలోన రేరెత్తుచూ అణగిపోవుచూ ప్రభవుల హృదయాన సయ్యాటలాడినవి.
అమ్మా ! తెలిసినది ! సరిగరిమపన సనిదసమగరిస. అని గొంతుకతో ఆలపించి, ఇది నభోమణి రాగమా ? ఉహూ, కాదే !... నిషాదమును నభోమణి అని అనరాదు కదా ! నయనరంజనియా ? లేక, నవరస చంద్రియా ? అని తలపోస్తూ ఉండిరి.
ఘడియలు గడచిపోతూన్న కొలదీ శుకవాణీదేవి వీణాగానమున మహారాజులు మరింతగా లీనమైపోతూ ఉండిరి. ప్రతి జీవి చేరవలసిన గమ్యమదే. జన్మమెత్తిన ప్రతి ప్రాణీ ఆశించేదీ ఆనందాన్నే, ఆ ఆనందా మృతమే బిందు మాత్రంగా దరిశెనమిచ్చి, క్రమక్రమంగా వాగై, ఏరై, పెన్నేరై, గ్రోలుటకు రమ్మని మునక విడువమని వేవిధాల ఆహ్వానిస్తూ ఉన్నది. శ్రవణపేయంగా ప్రారంభమైన దివ్యనాదం, మనోమయాది పంచకోశాలనూదాటి, ఆనందమయకోశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలగలిగేటంత విశాలమై, రఘునాథ భూరమణులను నిలువనీయకుండా జేసినది. ఇంత దివ్యనాదాన్ని సృష్టంచే ఆలలితాంగుళులను స్పృశించక నిలచేదెలాగ ? బొండు మల్లెగుత్తులవంటి ఆ అరచేతులను కనుల కద్దుకోకుండా మిన్నకుండేది, ఎలా ? ఎలా ఈ మనమను నిలవరించుకొనేది ? అసమాన సౌందర్యదీధితులతో, త్రిలోకాధిపత్యాన్ని అయినా వహించగలమనే ధీరత్వంలో, జగన్మోహనంగా ప్రకాశించే ఈ మీననేత్రాలను ఈ పెదవులతో సమ్మానించకుండా ఊరుకోవడమెలా ? ఎలా ?...ఎలా?...ఎలా?
అద్భుత గానమాధుర్యంలో, తలముకనలైపోయిన తంజపురాధీశ్వరులు. శుకవాణీ దేవి మ్రోల మోరకిల్లి, దేవీ ! ఇదేమి రాగము ? వశీకరణ మంత్రమునేదైన రవళింపజేస్తూ ఉన్నావా దేవీ ! అని గుజగుజలు పోయిరి. శుకవాణీదేవి రఘునాథుల ప్రణయౌన్నత్యానికి విచలితయై, ఉదుటున లేచి నిలబడినదాయెను. ప్రభూ!...తాము..ఇలా... ఆమె గజగజవణకినది.
వాణీ ! నీవు నిక్వాణించినదేమి రాగమోకాని, మహాద్భుతమైన అనుభవాన్ని చవిచూపినది నాలోని సర్వస్వాన్నీ ముద్దగట్టించి, పూవుగా మలచి దూదిపింజలా తేలికపరచి , తనవైపునకు రావించుకొని అతిగాఢంగా హత్తించుకొనే మహత్తరమైన శక్తి ఈ రాగానికి ఉన్నది. ఈ సుకుమారమైన వ్రేళులకు ఇంతటి మహాత్మ్యము ఎలాగ వచ్చినది ! ఈ స్వచ్ఛ హృదయాంతరంగాన శోభించే ప్రేమామృతకాసారాన్ని ఈ రాగం గట్లు త్రెంపుకొని పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించి నన్ను ముంచివేసింది. దీని పేరు ఏమిటో చెప్పవా., దేవీ ? అనినారు రఘునాథులు అర్ధింపుగా. |