147
 

శుక‌వాణిదేవికి ప్ర‌భువుల ప్రేమోన్మ‌త్త‌త అవగ‌త‌మయి అవ‌న‌ట్లుగ ఉండెను. త‌మ‌ను తాము నిలువ‌రించుకోలేని స్థితిని ప్ర‌భువులు అనుభిస్తూ ఉన్నార‌ని గ్ర‌హించిన‌దై, స్వామీ! నేడేల ఇంత ఉద్విగ్నులైరి ? అని చిరుస్వ‌రాన ప‌లికి, వేంక‌ట‌మ‌ఖ‌ఙ అయ్య‌వారికి ఈ రాగం ఆరోహ‌ణ అవ‌రోహ‌ణ‌ల‌ను మాత్రం వినిపించినాను. అంత‌టికే వారు దీనిని ఆత్మాక‌ర్ష‌ణి రాగ‌మ‌ని సెల‌విచ్చి ఉన్నారు ప్ర‌భూ ! ఈ రాగ‌మును త‌మ‌కే అంకితం గావిస్తూ ఉన్నాను. దీనిని త‌మ‌కు త‌ప్ప మ‌రొక‌రికి వినిపంచజాల‌ను. ఇందులో నా స‌ర్వ‌శ‌క్తుల‌నూ పొందుప‌ర‌చి, త‌మ‌కు పైవేద్యం చేస్తూన్నాను అనిన‌ది.

శుక‌వాణీదేవి క‌నులు నీటిపొర‌తో మిల‌మిల‌లాడిన‌వి. ప్ర‌భువుల పాదాల‌ను త‌న కోమ‌ల‌హ‌స్తాల‌తో సున్నితంగా స్పృశించి న‌మ‌స్క‌రించిన‌ది. శ్రీ‌శ్రీ‌శ్రీ ర‌ఘునాథ మ‌హారాజులు ఆమెను అతినెమ్మ‌దిగా లేవ‌నెత్తి అపురూపంగా హృద‌యాన‌కు హ‌త్తుకొనిరి.

స‌ర్వ‌సృష్టీ నిల‌చిపోయిన క్ష‌ణ‌మ‌ది,
నింగీనేలా క‌లుసుకున్న క్ష‌ణ‌మ‌ది,
చ‌లువ‌రేడూ క‌లువ‌క‌న్నే పుల‌కించిన క్ష‌ణ‌మ‌ది.

ఎంత కాలంగానో అంత‌ర్గ‌తంగా జ్వ‌లిస్తూ ఉన్న వారి విర‌హాగ్నిని ఆ కౌగిలి చ‌ల్ల‌బ‌ర‌చ‌గ‌లిగిన‌దా ? లేక మ‌రింత ర‌గిలించిన‌దా ?

19

యాచ‌మ నాయ‌కుడు, రామ‌రాయ‌లు తంజ‌పురి ప‌ట్ట‌ణాభిముఖంగా ప‌య‌నిస్తూ ఉండిరి. ఈ మ‌హాప్ర‌యాణంలో వారిరువున్నూ ఎన్నో విధాలుగా వేష‌ముల‌ను మార్చుకొనిరి, ఎన్నో పేర్ల‌నున్నూ మార్చుకొనిరి. కాని,యాచ‌మ నాయ‌కుడు త్రోవ‌లోగ‌ల కొంద‌రు దుర్గాధిప‌తుల‌ను ఒంట‌రిగా క‌లుసుకొని, వారితో ర‌హ‌స్య స‌మాలోచ‌న‌ల‌ను జ‌రిపి, వార‌ల‌ను గొబ్బూరి జ‌గ్గ‌రాజున‌కు ప్ర‌త్య‌ర్ధులుగా మార్చి మ‌రీ ప‌యనం కొన‌సాగిస్తూ ఉండెను. కొంద‌రు దుర్గాధిప‌తులు త‌ట‌స్థ‌వైఖ‌రిని అవ‌లంభించిరి. మ‌రికొంద‌రు రామ‌రాయ‌ల‌కు అనుకూలంగా ఉండి ప్రాణ త్యాగానికైనా వెనుదీయ‌మ‌ని శ‌ప‌ధాల‌ను పూనిరి.

జింజి ప్ర‌భువు, యాచ‌మ నాయ‌కుడు చెప్పిన మాట‌ల‌ను వినిన వెంట‌నే అమితాగ్రహంతో గొబ్బూరి జ‌గ్గ‌రాజుల‌ను దూషించుట మొద‌లిడినాడు. అత‌ని ధోర‌ణిని బట్టి. అత‌ని మాట‌ల‌లో యాచ‌మ నాయ‌కున‌కు విశ్వాస‌ము కుద‌ర‌లేదు. అత‌ని వంక‌ర న‌వ్వు, పెద‌వి విరుపు, వ‌క్ర‌పు చూపు, భృకుటిని క‌దిల్చే విధ‌ము గ‌మ‌నించి, యాచ‌మ నాయ‌కుడు, అతి జాగ్ర‌త్త‌గ, తూచితూచి మాట‌లాడినాడు. జింజి ప్ర‌భువు రామ‌రాయ‌ల కొర‌కు చాల అత్ర‌ప‌డుతూ ఉన్న‌ట్లుగా ప్ర‌శ్నించినాడు. చిన్న‌దొర ప్రాణాల‌ను ర‌క్షించానంటివే ! నీతోబాటుగ ప్ర‌యాణ‌మును కూడ చేయిస్తూ ఉన్నావంటివి. మ‌రి, ఇచ‌టికేల గోనిరాలేదు ? చ‌క్ర‌వ‌ర్తుల‌కు పూట‌కూళ్ళ ఇంట బ‌స ఏర్పాటు చేసిన‌వా ? ఎంత‌టి వాడ‌వ‌య్యా ! వెంట‌నే తీసుకొనిరా అని యాచ‌మ నాయ‌కుని త్వ‌ర‌పెట్టినాడు. రాచ‌మ‌ర్యాద‌ల‌తో కోట‌కు తోడ్కొని ర‌మ్మ‌నినౌ బ‌త్తుల నేర్పాటు గావించుట‌కు గాను ఆజ్ఞ‌ను ద‌యచేయిస్తూ ఉన్న జింజి కృష్ణ‌మ‌నాయ‌కునిలో వృద్ధ జంబుకచ్ఛాయ‌ల‌ను ప‌సిగ‌ట్టిన యాచ‌మ నాయ‌కుడు, గ‌డియ సేప‌టిలో రామ‌రాయ‌ల‌ను సిధ్ద‌ప‌రుస్తానంటూ నిష్క్ర‌మించెను. యాచ‌మ నాయ‌కుడు, రామ‌రాయులు మ‌ర‌ల త‌మ వేస‌ముల‌న‌ను, పేర్ల‌ను మార్చుకొని, అనెగొందెలో కుమార‌వీర నాయకుడు ప్రేమ‌తో కాన్క‌చేసిన ఉత్త‌మాశ్వాల‌నెక్కి మెరుములా అతివేగాన జింజిన‌గ‌రం వీడి వెడ‌లిపోయిరి.

చుట్టుదారుల‌లో, చిక్కుదారుల‌లో ప‌య‌నిస్తూనే యాచ‌మ‌నాయ‌కుడు రామ రాయల‌కు ప్ర‌పంచ‌జ్ఞాన‌మును రంగ‌రించి పోసినాడు. అందిన‌చోట ఫ‌ల‌ములు, అంద‌నిచోట నీర‌ములు, అదృష్ట‌ము క‌లసి వ‌చ్చిన‌చోట విందు భోజ‌న‌ములు చేస్తూ. ఏచ్చోట వీలైతే అచ్చోట‌నే విశ్ర‌మిస్తూ రామ‌రాయ‌లు క‌ర‌కు దేలినాడు. అత‌ని శ‌రీర‌ములోని కుసుమ పేశ‌ల‌త్వ‌ము స్థానాన క‌టువైన నిబ్బ‌ర‌ము నిలువ‌గ‌లిగిన‌ది. క‌ష్ట‌ముల‌కు ఓర్చుకోగ‌లిగిన స్థ‌యిర్య‌ము శ‌త్రు సంహార‌ము చేయ‌వ‌లెన‌న్న ప‌ట్టుద‌ల‌ల‌తో, రామ‌రాయ‌ల కొద‌మ సింగ‌మువ‌లె గాంభీర్య‌మునూ వ‌య‌సుకు మించిన వివేక‌మునూ సంత‌రించుకొన‌గ‌లిగెను.