ఎచటనైన బసచేసి వార్తనంపి, ఆ పిమ్మట పోవలెనని మొదట తలంచిన యాచమ నాయకుడు, వార్తనంపమయే సరాసరిగ పోవుట మేలని భావించినాడు. ఆనాడు, తంజపుర మహారాజప్రపాద ప్రాకారములకడ సేవకులు అడ్డగించినది ఒక సామన్య పౌరునిటా అగుడుతూన్న భావి చక్రవర్తి అని అచట నిలచిని వారికి తెలియక, వారికి ప్రవేశము నిరాకరించిరి. తప్పని సరి పరిస్థితులలో యాచమ నాయకుడు సార్వభౌముల రాజముద్రికను తీసి చూపినాడు. ముద్రికను చూచిన వెంటనే సైనికులు గడగడ వణికిపోయిరి. వంగి వంగి నమస్కరించిరి. రామరాయల పాదాలపై బడి క్షమాపణలను కోరుకొనిరి. రెండవ ద్వారముకడ ప్రధమ ద్వారముకడ జరిగినంత ఆటంకం, కాలయాపన జరుగలేదు.
రామరాయల ఆగమన వార్త మెరపువలె, మహారాజులకు మనవి చేయబడినది. శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయనిం వారు నిలచినవారు నిలచినట్లుగ ఆఘమేఘాలమీద ఇందిరామందిరాన విదేశీరాయబారుల విశ్రాంతి ప్రదేశదిశగ నడచివచ్చిరి. దళవాయి హుటాహుటిగ అచ్చోటకు వచ్చి, మంత్రి సామంత దండనాధాధి ప్రముఖులకు వార్తనంపడమైనదని ప్రభువులకు నివేదించినాడు.
మహారాజుల వేంచేసిన సమయానకు, భావి చక్రవర్తులు బాల్యచాపల్యంతో, శ్రీశ్రీశ్రీ రఘునాథనాయకుల విజయపరంపరను తెలుపుతూ ఉన్న చిత్రపటాలను తిలకిస్తూ ఉండిరి. రఘునాథ నాయనిం వారు మధురా నగరిపై సాధించిన దిగ్విజయాన్ని శిల్పబ్రహ్మలు సజీవంగా శిల్పించిన సుందర దృశ్యాలను వారు మలచిన రీతినీ. విస్తుపోతూ చూస్తూ ఉన్న తరుణంలో ప్రభువులు వేంచేయుచున్నారని పారిపార్శ్వకుడు మనవి చేసినాడు.
యాచమ నాయకుడు మహారాజులకు వంగి నమస్కరించినాడు. రామరాయలను ప్రభువులు పరమ మైత్రీభావనతో, చిన్నితమ్ముణ్ణి అన్నలా అక్కున జేర్చుకొనినారు. ఆ క్షణాన ఇమ్మడి వేంకటపతిరాయ చక్రవర్తులు తనను ఆలింగనము చేసికొనిన క్షణాలు వారి మదిని కదిలి, హృదయము కలత చెందినది. విజయనగర సార్వభౌముల రాజముద్రికను, శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయకులు గౌరవ మర్యాదలతో కనులకద్దుకొనిరి. |