యాచమ నాయకుడు : ప్రభూ ! గొబ్బూరి జగ్గరాజు దుష్టుడని చక్రవర్తులు గ్రహించుకొన్నారు గాని, మరీ ఇంతటి దుర్మార్గుడనిన్నీ, కిరాతకుడనిన్నీ భావించి యుండలేదు. జగ్గరాజు తమ వంశము వారిపై ఏదైన కుట్ర జరిపి విశ్వపతి రాయలను సింహాసనం ఎక్కించే పక్షంలో తక్షణము పరిస్థితులను తమకు విన్నవించమని చక్రవర్తులు నాకు ఆదేశమిచ్చియున్నారు. ఇన్నినాళ్ళుగ మా ప్రయాణము కత్తిమీద సామువలె నడచినది. కొందరు దుర్గాధిపతులు రామరాయలవారిపైన సానుభూతి చూపించినప్పటికీ రక్షణ ఇచ్చేందుకు భయపడినారు. జగ్గరాజు తమ కోటలను నాశనం చేస్తాడనే అనుమానంతో మమ్ములను గురించి వార్తలను తమకు నివేదించగల వేగులను నియమించేందుకు సహితము వారు సంశయించినారు.
రఘు : మానవ స్వభావమట్టిదే. ధర్మరక్షణకన్న ప్రాణరక్షణమిన్న అన్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు.
అమాత్యులున్నూ, సైన్యాధ్యక్షులున్నూ వచ్చే లోపున, యాచమ నాయకుడు తమ ప్రయాణంలోని అనుభవాలను ప్రభువులకు విన్నవిస్తూ ఉండినాడు. రామరాయలు చిన్న బాలుడిలా ఎలా అడలిపోయినదీ, తల్లితండ్రులను సోదరులను పోగొట్టుకొని ఎంత తల్లడిల్లిపోయినదీ వినిన ప్రభువుల కనులు అర్ద్రమైనవి. యాచమ నాయకుడు జింజికోటలో తాము మోసగింపబడకుండ ఎట్లు తప్పించుకొని వచ్చినదీ విశరపర్చినాడు.
అధికారము కొరకు గొబ్బూరి జగ్గరాజు చేసిన నరమేధమును యాచమనాయకుడు కనులకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఉన్నప్పుడు, ప్రభువులు రాచరికములో ఎంతటి భయంకరమైన ప్రమాదములు దాగి ఉన్నవోకదా ! అని విన్నబోయిరి. మొగిలిపూ గంధానికి మిన్నాగులు ఆకర్షింపబడినట్లే రాజ్యలక్ష్మీ రమ దుర్మార్గులను ఆకర్షిస్తూనే ఉంటుంది !
చోళమండలేశ్వరులు, శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయక మహారాజులు యాచమనాయకుని ప్రభుభక్తికి పరవశులై అత్యంతాదరాభిమానములతో అతనికి సర్వ మర్యాదలు నెరపించి గౌరవించిరి. ప్రభువులు ప్రధానామాత్యులతో ప్రత్యేక మంతనాలు సలిపే సమయంలో, యాచమ నాయకుడు, మహారాజా మనము కేవలము ఒక దుష్టునిపై యుద్ధము ప్రకటించి ప్రయోజనం లేదు. గొబ్బూరి జగ్గరాజు అనేకమంది సామంతులను
కూడగట్టుతూ ఉన్న సంగతి నాకు పొడగట్టింది. వేంకటపతి రాయలవారి నిర్యాణానికి ముందు దాదాపు పదిమాసాల నుండి జగ్గరాజు ఇట్టి ప్రయత్నాన్ని చేస్తు ఉండి ఉండవచ్చునని నా అంచనా అని మనవిడినాడు.
రఘునాథులు : యాచమ నాయాకా, జగ్గరాజు పన్నుతున్న కుట్ర అంతసులువుగా ఫలించడానికి గల కారణం ఏమై ఉంటుందో నీవు ఊహించగల్గినావా ?
యాచమ : చిత్తం, మహాప్రభూ, ధనాశ, అధికారవాంఛా, సామంతులు కట్టే కప్పం యావత్తూ చక్రవర్తుల కోశాగారానికి చేరనీయక, జగ్గరాజు మరొక భవంతిలో అధికభాగం భద్రపరిచేవాడట. అతడు గత అయిదారు వత్సరాలుగ, రాజద్రోహులైన కొంతమంది ఉద్యోగులను కూడగట్టుకొని ఈ దొంగపనిని విజయవంతంగా చేయగలిగినాడు. తనకు అనుకూలంగా ఉన్న దుర్గాధిపతులను తన గుప్పిట ఇరికించుకొని, ప్రతికూలంగా ఉన్న వారిపైన దోషారోపణలను చక్రవర్తులకు చేస్తూ ఉండేవారు.
రఘు : అనగా, జగ్గరాజు పైన మనము యుద్ధం ప్రకటించినట్లయితే కొందరు సామంతులు వాని పక్షానకు వెళ్ళి చేరే అవకాశం ఉన్నది, అని నీ అభిప్రాయము. అవునా ?
యాచమ : చిత్తం, చిత్తం. ఇందుకెట్టి సందేహమూ లేదు ప్రభూ . చుట్టు మార్గాల ప్రయాణం చేస్తూ ఇచటికి వచ్చేటప్పుడు. జగ్గరాజు కొందరికి పంపిన వార్తలను కొన్నిటిని నేను గ్రహించగలిగినాను. విజయ నగరరాజ్యంలోని ముఖ్యవేగులలో అతి ముఖ్యుడు కాయప్ప నాకు ఆప్తమిత్రుడు. జింజి ప్రభువుకు యుద్ధ సన్నద్దులు కమ్మని జగ్గరాజు పంపిన కమ్మన కాయప్ప నాకు చూపించినాడు ఎన్నో తావులలో యమకింకరుల వంటి సైనికులను మా ఇరువురి కొరకు జగ్గరాజు సన్నద్ధపరపించినాడు. ఎన్నోమారులు మేము మృత్యుగహ్వరం వరకు పోయి తిరిగి రాగలిగినాము. ఈ విషయాలన్నీ వివరంగా ఏలినవారికి మరో సమయాన విన్నవించుకొంటాను.
గోవింద : మహారాజా, యుద్దప్రయత్నలను చాల త్వరగానూ, మిక్కిలి పటిష్టంగానూ చేయవలసి ఉన్నది. మనము కూడా మార్గమధ్యాన ఉన్న సామంతులకూ రాజ ప్రతినిధులకూ తగు సందేశాలను పంపక తప్పదు.
యాచమ : అలా చేయవలసిన అవశ్యం తప్పక ఉన్నది, ప్రభూ, లేకపోతే మనము దారి పొడవునా యుద్ధాలు చేసుకొంటూ గమ్యాన్ని చేరవలసి వస్తుంది.
రఘు : గురదేవా, గజ, అశ్వ, రధ పదాతి దళాధిపతులకూ, వ్యూహా నిర్మాణ దక్షులకూ, ధనుర్విద్యా కౌశలురకూ, గజ, అశ్వవిద్యా ప్రవీణులకూ, శిరస్త్రాణాది సర్వాంగ కవచ నిర్మాతలకూ, అన్నమరాజుకూ, కప్పలదొరకూ రణసన్నద్ధం కావలసినదిగా వార్తలను పంపిచండి. సామంతులందరికీ శ్రీముఖములు పంపండి, వారు ధర్మపక్షాన చేరుతారో అధర్మపక్షాన చేరుతారో నిశ్చయించుకొని మనకు వెంటనే తెలియజేయ వలసిందివగా లేఖలను పంపండి. యుద్ధానికి సిద్ధం కావలసిందిగా యువకులను జాగృత పరుస్తూ గ్రామగ్రామాన దండోరా వేయించండి. నేటి నుండి యుద్ధ శిక్షణలను ముమ్మరంగా జరిపించవలసిందిగా, సైన్యాధ్యక్షులందరికీ ఆజ్ఞలను అంపించండి.
రహస్య సమాలోచనం ముగిసినది. ప్రభువులు అంతఃపురాభిముఖంగా నడచిరి. అమాత్యులు, యాచమనాయకుడు తమ తమ నెలవులకు వెడలిరి.
శుకవాణీ దేవి వీక్షించిన ప్రధమ దివ్యక్షణాన్నుండీ శ్రీశ్రీశ్రీ రఘునాథ ప్రభువులను హృదయ శల్యంగా పరిణమించినదొవ భావన. తమకు ఆరాధ్యదైవము, ఏకపత్నీ వ్రతుడైన శ్రీరామచంద్రమూర్తిని తాము అకుంఠితమైన భక్తిప్రపత్తులతో సేవించుకొంటూ ఉండగా తాన మువ్వుర భార్యలను ఎట్లు స్వీకరించగలిగెను ? స్వీకరించినాడు సరే, మరల ఇంకొక కన్నెపై తన మనస్సేల ప్రసరిస్తూ ఉన్నది ? ప్రసరిస్తూ ఉన్నది సరే. మువ్వురు రాణుల చెంతకైనా వెళ్ళుటకు తన తనువేల నిరాకరిస్తూ ఉన్నది ? గురుదేవుల పితృదేవుల అంగీకారంతో ఆశీర్వాదంతో ధర్మబద్ధంగా ఉద్వాహమాడిన కళావతీ దేవినిగాని, రామభద్రా దేవిని గాని, లక్ష్మీదేవిని గాని మనఃపూర్వకంగా తనదరి చేరదీయలేకపోతున్నదెందులకో ?
రఘునాథుల ఆలోచనా స్రవంతి ఆగిన తృటికాలములో ఆయనకు రాజ ధర్మమునకూ దేశధర్మమునకూ మించిన ధర్మంలేదనే పరమసత్యం పొడగట్టినది. శుకవాణి దేవి ఈ అన్ని ధర్మాలనూమించి హృదయధర్మాన్ని ప్రబోధిస్తూ ఉన్నది. ఈ బంధము అంతరంగ బంధము. ఇది బహిర్భంధాలవలె యాంత్రికమైనదికాదు. సర్వకాల సర్వావస్ధలలోనూ శుకవాణీదేవి స్మరణం చేయడమే తన ధర్మంగా హృదయం భావిస్తూన్నప్పుడు కరచరణాదులను నిలవరించుకోగలగడం ఎలాగ ? |