దేవీ ! ఆత్మాకర్షిణి రాగంతో నన్ను మరింతగా లోగొన్నావె ! నీ ఈ విరహంలో ఇలా మ్రగ్గిపోడానికేనా ? నీకు హృదయ చంద్రికను నేను బహుకరిసస్తాను, ప్రియా ! కాని ఇప్పుడు కాదు. సర్వదేవతలూ మనలను అనుగ్రహించి మనపై పూలసేసలు చల్లిననాడు. సర్వగ్రహాలు చిరునగవుతో మనలను అనుగ్రహించిననాడు, గురదేవులు రెండుచేతులా మనలను మనసారా ఆశీర్వదించిననాడు సృష్టిలో ఉన్న సర్వ ఆనందమూ మనలను అలముకొన్ననాడు, నేనూ నీవూ చంద్రుడూ చంద్రికలా ఏకమైననాడు, నీ కన్నులనుండి ఆనందజ్యోత్స్నలు ఉప్పొంగినవాడు, పరమాద్భుతమైన, పరమ ప్రశాంతమైన, పరమ దివ్యమైన మూలాధార విశుద్ధఅనాహత ఆజ్ఞా చక్రాలడి వినిర్గమించే ఈ నా హృదయం చంద్రికరాగమయూరిని నీకు కాన్కచేస్తాను, ప్రియా !
నీ కనుల వెలుగులో
ఏమున్నదో దేవి
ఆఘవేఘాలనై
నిను చేరబోయెను || నీ ||
పగడంపు మోవిలో
ఎన్నెన్ని మధువులో
చవి చూడ నా మనసు
తొందరించేనూ || నీ ||
నీ కంఠహారాలు
చిక్కువడుతుంటేను
గుండెలో గొంతుతో
గుజగుజలు పోయెను || నీ ||
వీణె మీటే వేళ
కొనగోటి మొనలపై
తళుకులీనే మెరపు
లందుకోబోయేను
ఆశతో వేగేను || నీ ||
శ్రీశ్రీశ్రీ రఘునాథ మహారాజుల వారి కంఠము అరఘడియ క్రితము రణభేరి మ్రోగిస్తున్నట్లుగా యుద్ద సన్నాహములకై గంభీరనాదంతో ఆజ్ఞచేసినది. శుకవాణీదేవి మందిరానకు వారు విజయం చేసినంతనే కంఠము మంద్రగాత్రాన ప్రణయమంత్రాలను వల్లవిస్తూ ఉన్నది.
రఘు : దేవీ, శ్రీరామచంద్రుని దివ్యగాధను విరచించాలనే కోరిక నన్ను తొందరిస్తూ ఉన్నది.
శుక : అహో ! ఎంత చక్కని యోచన ! ప్రభూ.
రఘు : వాణి, నా ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అంతరాయాలు వస్తూనే ఉన్నవి. ఇప్పుడు మరలా యుద్ధ సన్నాహాలు ప్రారంభమవుతూ ఉన్నవి. కావ్యరచన ఆరంభించిన తరువాత విఘ్నం కలగకుండ వ్రాయాలన్నదే నా తపన.
శుక : ప్రభువులు తులచుకుంటే కావ్యరచనము ఎంతసేవు ?
రఘు : మరి యుద్దమో ?
శుక : తమరు సవ్యసాచులు. ఒక చేత ఖడ్గము ఒక చేత ఘంటము పూనగలరు.
రఘు : అనగా, పగటివేళల రణము రాత్రివేళల రామాయణము, ఇదే కాదా నీ భావము, దేవీ ?
శుక : చిత్తము
రఘు : ఇలా చేయడానికి నాకెట్టి అభ్యంతరమున్నూ లేదు గాన మన మిరువురమూ కలసియే ఈ మహద్గ్రంధాన్ని రచించాలనేది నా ప్రగాడవాంఛ.
శుక : ఒకే కావ్యాన్ని ఏకకలాన ఇరువురమెలా వ్రానేది, స్వామీ ?
రఘునాథ ప్రభువులు చిర్నగవుతో చూచిరి. చూడు దేవీ ! నిరంతర యుద్ధ పరిశ్రమతో కరకుదేలిన ఈ కరము, తీయనైన తెలుభాషా మకరందాన్ని స్రవింప చేయగల్గుతుంది అని అనడానికి నీకేదైనా సందేహమా ? అని ప్రశ్నించిరి.
లేదు లేద న్నట్లుగ శిరఃకంపనము చేసి, శుకవాణి, ప్రభూ ! ఎంత మాట ! మీ కవనాన నవరసాలు వెల్లివిరుస్తాయి. హృద్యమైన భావనా సంపత్తులు కొల్లలు కొల్లలుగ, పుష్కలంగా పంపడమేగాక, సందర్భోచితంగా కావ్య రచనచేసి మెప్పించే నేర్పు మీకెంతో ఉన్నది, అని ప్రత్యుత్తరమిచ్చినది.
రఘు : అవునా, మరి. ఇంతటి వానిని తన శేముషీత్వంతో ఒప్పించిమెప్పించిన ఈ శుకవాణి గీర్వాణభాషలో రామకధా మరంద మధుర స్రవంతిని ప్రవహింప చేస్తుందట.
శుకవాణిదేవి మోము విరసిన జాజి పూవువలె తెల్లనైనది.
శుక : ప‌్రభూ :....రామాయణమా...నేనా...సంస్కృతంలోనికి...మీరు వ్రాసిన కావ్యాన్ని...అనువదించడమా !
రఘు : అవును దేవీ ! ఎందుకంత బేలవవుతావు ? నీవు నైషధం వ్రామ లేదా ? కుమార సంభవం వ్రామలేదా ? నీ పాండిత కాళిదాసున కీడైనదని పండితులు నిన్ను మెచ్చలేదా ?
శుక : ప్రభూ, మీ తెలుగు పలుకుబడి, మీ వ్యావహారిక భాషా సౌందర్యము, మాట విరుపులో మీరు సందడింపజేసే శ్లేష, వీటినన్నిటిని నేను సంస్కృతాన ఏలాగున తేగలను ?
రఘు : వాణీ ! కావ్యరసానందము ఏ భాషలోనైనా, ఒక్క తీరుగానే అనుభూతమవుతుంది. మౌలికమైన సువర్ణము ఒక్కటే అయినా, వేర్వేరు ఆభరణాలుగా స్వర్ణకారుడు మలచేలాగున ఒకే చక్కెరతో పలువిధాలైన మధుర పదార్ధాలను పాచకుడు పచనంచేసే లాగున. ఆత్మలో కదలాడే ఒకే భావానందాన్ని వేర్వేరు భాషలలో, వేర్వేరు అలంకారాలలో, వేర్వేరు రసాలలో కావ్యకర్త విశదపరుస్తాడు. సర్వభావాలకూ జన్మస్థలం ఒకటే, దేవీ ...నీ ప్రతిభ మీద నీకు ఇంకనూ అనుమానం ఉన్నదా ?
శుక : లేదు ప్రభూ, రామాయణ మహాకావ్య నిర్మాణంలో నేనూ ఆనందంగా పాలుపంచుకొంటాను.
రఘునాథుడు ఉద్వేగంతో కంఠమెత్తి,
మాటికి రసపరిపాటికి
మేటికవులు మెచ్చి మేలు మేలనగూర్పన్
దేటగు రామయణ కథ
మటలు పొందికల గుమగుమ బిసాశించున్.
అని అశువుగ పలికెను. |