ఏ ప్రకారముగ చూచినప్పటికీ ప్రభువులకు మూడు యుద్ధములు తప్పనిసరి అనునది సత్యము. ఇటు విజయనగర సార్వభౌముల పట్టాభిషేకము జరుగవలెనన్నచో సామంతుల వైఖరిని గురించిన వేగు రావలసి ఉన్నది, కనుక ఇందుక వ్యవధి ఉన్నది. అటు నేపాళమునకున్నూ నౌకా దళమూ, గజదళమూ సిద్ధముగా నున్నవి, కనుక కొంత సైన్యాన్ని అటుమరలించి, కొంత సైన్యాన్ని పెనుగొండ వైపునకు మరలించుట ప్రశస్థము అనిరి.
సర్వ సైన్యాధ్యక్షులకు అమాత్యులు చెప్పినది పూర్తిగ అవగతము కాలేదు. మంత్రివర్యా, ప్రభువులు ఏ సైన్యానికి ఆధిపత్యం వహించవలసి ఉంటుందో సెలవీయండి అనినాడు.
గోవింద : మహారాజులు రెండు సేనలకూ ప్రాతినిధ్యం వహిస్తారు.
సైన్యాధ్యక్షులు : మహామంత్రీ, అదెలా సాధ్యం ?
గోవింద : అది అలాగే సాధ్యపడుతుంది, మహాసేనానీ.
గురదేవుల చిరునగవులో రహస్యార్ధాన్ని అవగతం చేసుకొనిన మహారాజులు నాటికి చర్చలను చాలించిరి.
రణభూమికి పయనమయేవేళ, మహారాజు శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయనిం వారు, తమ గురుదేవులున్నూ, అమాత్యులున్నూ, మేధా సంపన్నులున్నూ, తమ వంశానికి పరమపూజ్యులున్నూ అయిన శ్రీ గోవింద దీక్షితలు వారిన రాజప్రతినిధిగ నియమించి, యావత్తు రాజ్య భారాన్ని వారి భుజస్కంధాలపై నుంచి, శపధములు చేసిరి.
ఛిన్నైర్జగ్గ నృపాది బాహు జనుషాం
సేతుః శరః కర్పరైః
కావేర్యాం యుధిబంధయామి సుదృఢం...
ఆనకట్టను కూలగొట్టిన జగ్గరాజు శిరస్సును కావేరీనదికడ పునాది రాయిగ నిలిపి మరల ఆనకట్టను నిర్మింపచేయనిదే పురికి తిరిగినానని వాక్రుచ్చి వెడలిరి.
సైన్యములోని ఒక దళము పెనుగొండ వైపునకు తరలిపోయినది. రాత్రులందు సైన్యము ఏయే గ్రామాలలో విశ్రాంతి తీసుకొనునో ఆయా తావులలో మహారాజులకు, సైన్యాధ్యక్షులుకు, కొందరు ప్రముఖులకూ ముందుగనే శిబిరములు సిద్ధపచబడుతూ ఉన్నవి. మున్ముందు అశ్వికదళము, పిమ్మట రధదళము, మధ్యన బండ్లపై ఆహార పదార్ధములు, అత్యవసరమైన యుద్ధ పరికరములు, సేవకులు, బిషగ్వరులు, పశు వైద్యులు, ఓషధులు, కవిపండిత గాయకులు, ఆ పిమ్మట గజదళము, ఆవెనుక మరికొంత కాల్బలము ఈలాగున సమర ప్రయాణము సాగుతూ ఉండెను. అశ్విక దళానికన్న ముందుగ ముఖ్య అంగరక్షకులతో మహారాజులు పయనిస్తూ ఉండిరి. రఘునాథ ప్రభువులకు స్నేహసౌహార్థ్రములను ప్రకటిస్తూ వివిధ దుర్గముల నుండి సేనలు వచ్చిచేరుతూ ఉన్నవి.
పయనము చాల నెమ్మదిగ సాగుతూ ఉన్నది. ఎప్పటివలె రఘునాథ మహారాజులు సేనల మద్యకు వచ్చి ప్రతి ఒక్కరినీ పలుకరించుటలేదు. ధైర్య సాహసములు పెంపొందించే ధర్మోపదేశములు చేయుటలేదు. ప్రతి విశ్రాంతి శిబిరములోనూ మూడు నాలుగు దినములు విడిది చేయుట ఎందులకో తెలియక సైనికులు అచ్చరువు పడిరి. ప్రకృతి రమణీయతను వీక్షిస్తూ, సెలయేట స్నానాలు చేస్తూ, సైనికులు విహారయాత్ర రీతిలో సమరయాత్రను సాగిస్తూ ఉండిరి.
సేనలకు ఆధిపత్యం వహిస్తూ మూర్తెప్ప నాయకులు మహారాజులు వెంట వెడలినందున శుకవాణీదేవి తల్లి చెంతకు వచ్చెను. కూమర్తెను గాఢంగా కౌగలించుకొని మరకతవల్లి, ఏమే చెంచుతల్లీ ! ప్రభువులు నగరిలో లేనపుడు అమ్మ కావలసి వచ్చిందే ! అనినది. శుకవాణి తల్లి మాటలకు విన్నబోయినది. లేదులేవే, ఊరకనే అన్నాను. నీవు మూతి ముడుచుకుంటే, నేను తాళలేన అని కొమరితను లాలించినది.
అమ్మా నీకో కమ్మని వార్తను వినిపించాలనుకొన్నాను. నాపైన అభాండాలు వేసినందుకు అది నీకు చెప్పను.
మా అమ్మవుకదూ ! మా బంగారుతల్లివి కదూ ! త్వరగా చెప్పవే, అమ్మా ?
అదీ...అదీ...ఏమిటంటే అమ్మా, నీ ఈ కూతురు శ్రీశ్రీశ్రీ రఘునాథ మహారాజులతో కలసి శ్రీ మద్రామాయణ మహాగ్రంధాన్ని రచిస్తూ ఉన్నది.
ఆ !...ఏమిటి....ఏమన్నావు!....రామాయణమే!...కుమార సంభవమూ పైషధమూ కంటె రామాయణం వ్రాయడం ఎంతో ఘనం కాదుటే ! నాకడుపు పంట, ఇంతటి మహత్కార్యాన్ని చేస్తోందా ! అబ్బో ! నాకెంతో సంతోషంగా ఉందె, చెంచూ ! ఎంతవరకూ వ్రాశారో వివరం చెప్పవూ ? |