153
 

అమ్మా, ఈ కావ్య‌సృష్టికి ఎన్నో ఆటంకాలు వ‌స్తాయ‌ని ప్ర‌భువులు ముంద‌రే చెప్పారు. సీతారాములు వివాహ ఘ‌ట్టం ఆయ్యాక ప‌ట్టాభిషేక స‌న్నాహాల వ‌ర‌కూ ఇరువుర‌మూ క‌లిసే వ్రాశాము -

క‌లిసే అంటే ? ....ఎలా ?

ఇందిరామందిరాన నీ కొమార్తె నివ‌సించే అంతఃపురానికి ప్ర‌భువులు సాయం వేళ‌ల విచ్చేసిన‌పుడు మేమిరువుర‌ము దగ్గ‌ర ద‌గ్గ‌ర‌గా చెరివొక స్వ‌ర్ణ‌పీఠిక‌పై ఆశీనుల‌మ‌వుతాము. మాకు ఇరుప్ర‌క్క‌లా పండితులు కూర్చుండి మేము చెపుతూ ఉంటే.... వ్రాస్తూంటారు. అమ్మా ! నేను వీణెను వాయిస్తూనే క‌వ‌న‌ము...చెప్తాను.

ర‌చ‌న చేస్తున్న‌ప్పుడు వీణానాదం అవ‌రోధం కాదా, త‌ల్లీ ?

పండితులేమ‌న్నారో విను, అమ్మా, శృంగార, వీర‌, భ‌యాన‌క మున్న‌గు న‌వ‌ర‌సాలు ఉన్నాయి, క‌దా కావ్యంలో ఏ ర‌సం చిత్రిస్తున్నామో ఆ ర‌సాన్ని వీణెపై ప‌లికిస్తున్న‌ప్పుడు రామ‌చరిత్ర క‌న్నుల‌కు క‌ట్టిన‌ట్లుగా ఉన్న‌దని వారు చెపుతూ ఉన్నారు. ఈ సంగ‌తి వినిన ప్ర‌ముఖులు చాల మంది మా ర‌చ‌నా వ్యాసంగాన్ని స్వ‌యంగా తిల‌కించాల‌ని వాంఛిస్తూ ఉన్నారుట‌.

కావ్యం ఎంత‌వ‌ర‌కూ వ్రాశారే, చెంచూ ?

చెప్పానుగా ఈ యుద్ధ‌మే అంత‌రాయం క‌లిగించ‌కుండా ఉంటే, ఈ పాటికి సగ‌భాగం పూర్తియేది. అదేమి విచిత్ర‌మోగాని శ్రీరామ ప‌ట్టాభిషేకం వ‌ర‌కూ వ‌చ్చి ఆగింది.

అయితే అంత మళ్ళీ ర‌ఘునాథ ప్ర‌భువులు వ‌చ్చేవ‌ర‌కూ నీ కావ్య నిర్మాణం అక్క‌డే ఆగిపోతుంద‌న్న మాట‌. అంతేనా ?

అలాగ‌, కాద‌మ్మా, వారు చెపుతూంటే అంత వేగంగానూ వ్రాసే పండితులు ప్ర‌భువుల వెంట వెళ్ళినారు కాదా, క‌నుక‌, రాత్రులందు యుధ్ద‌శిబిరాల‌లో ప్ర‌భువుల కావ్య వ్యాసంగం అకుంఠితంగా జ‌రిగిపోతూనే ఉంటుంది. ప్ర‌భువులు తాము ర‌చించిన‌ దానిని మూడు దినాల‌కొక మారు వేగ‌రుల‌తో నాకు పంపిస్తారు ఇక‌, ఇక్క‌డ నేను ఇప్ప‌ట్లాగే ఇందిరామందిరంలో కావ్య‌ము అల్లుతూ ఉంటాను. చూడ‌ద‌ల‌చిన వారు వ‌చ్చి చూడ‌డానికి మ‌హారాజులు అంగీకారం ద‌య‌చేసినారు.

అయ్యో ! అలాగా ! ప్ర‌భువులు వ‌చ్చేవ‌ర‌కూ నువ్విక్క‌డ ఉంటావ‌ని అనుకొంటున్నానే!...

త‌ప్ప‌ద‌మ్మా. ఇది ప్ర‌భుకార్య‌మూ. దైవ‌కార్య‌మున్నూ.

ఆత్మ‌కార్యం అని కూడా అన‌రాదుటే, చెంచుత‌ల్లీ !

అవున‌మ్మా. రామాయ‌ణం వ్రాయ‌ల‌ని నా ఆత్మ‌వాంఛ, అంటే జ‌న్మ‌జ‌న్మ‌ల వాంఛ‌. అది ఈనాడు ఈడేరుతోంది.

రెండు దినాలు మాతృమూర్తితో గ‌డిపి తిరిగ‌వ‌చ్చిన పిద‌ప‌, శుక‌వాణి రామాయ‌ణ కావ్యాన్ని వీణావాద‌నంతో ర‌చిస్తూ ఉంటే, చూడ‌వ‌చ్చిన‌వారు ఉత్కంఠ‌తో, శ్ర‌వ‌ణానంద‌క‌రంగా ర‌సానందం అనుభిస్తూ ఉండిరి.

సంస్కృత‌భాషా పరిచ‌యం వారిలో చాల‌మందికి త‌క్కువే అయినా, న‌వ‌ర‌సాలొలికే రాగాల‌ను ప‌లికించే ఆమె విపంచీ విన్యాసాల‌కు మ‌న‌సార లోబ‌డి యుండిరి.

శ్రీ రామ‌చంద్రుని దివ్య‌సుంద‌ర మంగ‌ళాకృతిని వ‌ర్ణించే తావులందు శుక‌వాణి ప్ర‌యోగించిన ఛందోరీతులు వినూత్న శోభ‌ల‌తో అల‌రారిన‌వి. వ‌సంత తిల‌క వృత్మును పండితులు వెనువెంట‌నే గ్ర‌హంప‌లేక‌పోయిరి. వసంత తిల‌క వృత్త‌మును సైత‌వాచార్యులు ఉద్ధ‌ర్షిణి అని పేర్కొనిరి. శ్రీ‌రామ‌మూర్తి యొక్క ధ‌ర్మౌద్ధ‌త్యం వ్య‌క్త‌మైన‌పుడు ప‌ర‌మ ర‌మ్యాకృతి ఈ శ్లోక‌ములో క‌నుల‌కు క‌ట్టిన‌ది. ఈ వృత్త‌మునే కాశ్య‌పుడు సింహోన్న‌త అనెను. శ్రీ‌రామ‌భ‌ద్రుని సింహ ప‌రాక్ర‌మ‌ము ఇచ్చ‌ట ధ్వ‌నించ‌గా శ్రోత‌లు స‌హిత‌ము ఆవేశ‌పూరితులైరి.

 

గోమాన‌సుడు మ‌ధుమాధ‌వి య‌నియు రామ‌కీర్తి చేతోహిత అనియు వ‌సంత తిల‌క‌ము పేరుపెట్టిరి. శుక‌వాణీ దేవి గానంలో మ‌ధుమాధ‌వి వ‌లె హృద్యంగ‌మము గాను, చేతోహిత‌వ‌లె మాన‌స‌ము న‌ల‌రిచున‌దిగాను శ్లోక‌ము శోభించిన‌ది.

సీతారాముల ప్ర‌ధ‌మ ప‌ర‌స్త‌ప‌రావ లోక‌న‌ముల‌ను వ‌ర్ణించునెడ భ్ర‌మ‌ర‌ మాలికావృత్తాన్ని, అహ‌ల్యాశాప విమోచ‌న స‌మ‌యాన ఇంద్ర వ‌జ్ర ఛంద‌స్సునూ ప్ర‌యోగించిచ‌, కావ్య సౌంద‌ర్యానికి శుక‌వాణి మ‌రింత వ‌న్నెల‌న‌మ‌ర్చిన‌ది. శిఖ‌సారిణీ, స్వాగ‌త, ప్ర‌హ‌ర్షిణీ, ర‌ధోద్ధ‌త మున్న‌గు రాగాను కూల‌, నాట్యానుకూల‌మైన ఛందోరీతులు ఆమె జిహ్వ‌గ్రాన లాస్యంచేసిన‌వి.

********