భారతీయ సంస్కృతి యావత్తున్నూ క్రతురూపాన నిక్షిప్తమై యుండెనని విశ్వసించినట్లయిన, యజుర్వేదానికే ప్రధమ తాంబూలమీయవలెను. యజ్ఞ నిర్వహణలో మూడు వేదాలూ ఏకమై యజ్ఞపురుషుని ముక్తకంఠంతో కీర్తిస్తూ ఉన్నందున మూడు వేదాలకున్నూ సమాన ప్రాధాన్యమే ఉన్నది. అని శిష్యులకు తెలియజేస్తూ ఉండిరి.
ప్రాచీన కాలంలో శిష్యులు, మూలమును శోదించి తాము నేర్చిన దానిని నూతనరీతులలో వ్యాఖ్యానించి, కొంగ్రొత్త భాష్యములను బోధిస్తూ తమంతటివారు అగుటకు, గురువులు ఆనందంతో అంగీకరించేవారు. ఈ శిష్యులు తమ శిష్యులకా కొంగ్రొత్త భాష్యములను బోధిస్తూ ఉన్నప్పుడు శిష్యుల పేరిటనే ఈ నూతన శాఖలు వర్ధిల్లుతూ ఉండినవి.
వాజసనేయ యాజ్ఞవల్క్యుడు శుక్ల యుజుర్వేదమును పదునేనుమంది శిష్యులకు నేర్పియుండెను. వారందరు గురువంతటివారై, ప్రత్యేక శాఖలకు పెంపొందించిరి. ఇట్లు జాబాల, బౌధాయన, కాణ్వ, మాధ్వందినేయ, శాఫేయ, తపనీయ, పౌండర, వత్స, ఆవతిక, పరమావతిక, కాపోల, పారాశర, వైనేయ, అర్ధ, భౌధేయ అనే శాఖలు వైదిక వాజ్ఞ్మయమును సుపోషితం చేయడమేగాక దేశములోని మూలమూలలకు కూడ యజ్ఞ విద్యను వెదజల్లి రాయెను.
శ్రీశ్రీశ్రీ రఘునాథ మహారాజులు తమ అమాత్యులు సంకల్పించిన యాగమును నిర్విఘ్నంగా పరిసమాప్తం చేయవలసినదిగా అనేక విధాల ప్రార్ధించి, ఒప్పించి యుధ్దాలకు వెడలిరి. అందువలన గోవిందదీక్షితామాత్యులు వాజపేయ యజ్ఞమును చేయవలెననియే నిర్ణయించుకొనిరి. కాని వారిని వేధిస్తూ ఉన్నది ఒకే ఒక బాధ. తాము చేసిన అన్ని క్రతువులకూ రఘునాథ నాయనిం వారు తమ వెన్నంటి ఉండి, తమకు ముత్యాల వెల్లగొడుగులు నట్టి, కుడిభుజమువలె ఉండిరికదా, మరి ఆ ప్రభువులు నగరిలో లేనపుడు తాను యజ్ఞమేల చేయవలయును ? పోనీ, ప్రభువులు వచ్చేవరకూ వేచి యుండరాదా ? అనిన అందులకు ప్రభువులే అంగీకరించరైరి.
యజ్ఞనారాయణ దీక్షితునకు ఫల పుష్ప గంధ తాంబూల మొసగి, తాము చేయు యజ్ఞమునకు అధ్వర్యులుగా ఉండి యజ్ఞ నిర్వాహణ చేయవలసినదిగా అర్ధించిరి. యజ్ఞనారాయణకన్న ఇతర పండితులకు ఒడలు మండినది. తలలు పండిన ఇందరు పెద్దలుండగా పిన్నవయస్కుడు యజ్ఞయ్యకు ప్రధమ తాంబూలమా ? అని లోలోన గుంజాటన పడిరి. అందునా తన కడుపున పుట్టినవాడే కావలసి వచ్చినాడా ? అని లోలోన ఈసడించుకొనిరి. కాని ఒక్కరునూ నోరు మెదపరైరి. తమ అంతరాలలో యజ్ఞనారాయణుని ప్రతిభ వారికి తెలియకకాదు. అతని జ్ఞాన ప్రకాశము అరచేతితో అడ్డినంత మాత్రంచేత కాంతి తగ్గదనేది కూడ వారు పూర్తిగా ఎరిగియే ఉండిరి.
వాంఛేశ్వరుని, సుచేతనుని, కైవల్యాచార్యుని, బిందుమాధవుని, కాత్యాయనుని, దక్షిణామూర్తిని యజ్ఞనారాయణునకు సహాధ్వర్యులుగ గోవింద దీక్షితులవారు నియమించి, మిగిలిన ఋత్విగుల ఎంపికను కులపతికే వదలిరి.
ప్రపంచంలోని సర్వస్వమూ అగ్నిమీద ఆధారపడి ఉన్నది. అన్నిటిలోనూ అగ్ని నిక్షిప్తమయ్యే ఉన్నది. అగ్నిలేనిదే ఏ శక్తిన్నీ లేదు. సముద్రాన, బడబానల రూపంలో అగ్ని ఉన్నది. ఆకాశంలో మెరుము రూపాన అగ్ని ఉన్నది దారువులో అగ్ని ఉన్నది. పాషాణంలో అగ్ని ఉన్నది. నీటిలో అగ్ని ఉన్నది. వైశ్వానరరూపంలో అన్ని ప్రాణులలోను అగ్ని ఉన్నది, అని యజుస్సులు చెపుతున్నవి. విశ్వవ్యాపకుడైన అగ్ని దేవుని అర్చించుట అనాదికాలంగా వస్తూ ఉన్న ఆచారం. ఈ అగ్నికి నాలుగు కొమ్మలు, మూడు పాదాలు, రెండుతలలు, ఏడు చేతులు ఉన్నట్లుగా యుజుర్మంత్రం వర్ణించినది. నాలుగు కొమ్మలు, నాలుగు దిశలు, మూడు పాదాలూ, మూడు కాలాలూ, రెండు తలలు పవలూరేయిలు, ఏడు చేతులు సప్త సింధువులు.
ఋగ్వేదంలో మూడువందల మంది దేవతలు ప్రస్తుతింపబడిరి. వీరిలో తిర్యక్కులుకూడా ఉండిరి. దివ్యలక్షణ శోభితులూ, మహామహిమాన్వితులూ అయిన ముఖ్య దేవతలు ముప్పదిమంది. ఈ ముప్పదిమంది ముఖ్యులలో అగ్ని ముఖ్యాతి ముఖ్యుడు అగ్ని తరువాత ఇంద్ర, సోమ, మిత్ర, వరుణ, అశ్వి, విశ్వేదేవాదులు ప్రధాన దేవతలు. ఈ అగ్ని ఇంద్రులే కాలక్రమాన శివకేశవులైని అని యజ్ఞనారాయణ దీక్షితులు వక్కాణించెడివాడు. |