శబర నాయకులు తెచ్చిన కుబ్జదంతావళాలు నదిలోనికి దిగినంతనే, చోళగుడు పెంచిన మొసళ్లు నోళ్ళు తెరిచి ఏనుగులపైకి వచ్చినవి. కరిమకరలు పోరు ప్రారంభం కాకముందే, కప్పలదొర సైనికులు విషలిప్తబాణాలతో వాడి కత్తులతో మొసళ్ళను చంపివేసిరి. కోట బురుజుల నుండి, కందకానికి కాపుగా అటనట కట్టబడి ఉన్న చిన్నచిన్న రాతి శిబిరాల నుండి చోళగుడి బంట్లు శతఘ్నులను, అగ్ని కందుకాలను, అమ్ములను ప్రయోగించి నదిని దాటబోతూ ఉన్న చోళసైన్యమును చీకాకు పరచిరి. శతఘ్ని యుద్ధంలో ప్రవీణులైన మహారాజులు తమ ప్రాణాలకు సహితం కలుగగల ప్రమాదాలనయినా పరిగణిచక ఎక్కువ చొరవతో ముందుకు చొచ్చుకు పోయిరి, అపార శబరసేన మహారాజులననుసరించినది. కోయదొరలు విసిరిన ఈటెలకు, త్రిశూలాలకు కోట బురుజుల నుండి, కాపలా శిబిరాల నుండి చోళగుని బంట్లు చచ్చిపడిరి. చావగా మిగిలిన చోళగుని సేవ, ధైర్యము కోల్పోయి,కోట తలుపులు తెరచి, నదీ తీరము దిశగా పరుగెత్తినది.
చోళగుడు మహాభయంకరుడు, మహా కోపోద్రిక్తతవల్ల అతని కన్నులు రక్తవర్ణం దాల్చి ఉన్నవి. చోళసేనను చీల్చి చెండాడుతున్న వానిని రఘునాథులుచూచిరి. తన ప్రభువును అంటిపెట్టుకొని ఉన్న వేంకటపతిరాజు, మహాప్రభూ చోళగునికి మంత్రబలం ఉన్నదని జంకవద్దు. మూర్తీభవించిన ఈ అధర్మాన్ని ఆదిత్య స్మరణంతో అంతం చేయండి, అని భోదించినాడు. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరే భ్యోన్నమః అని ద్వాదశాదిత్య స్మరణం చేసి, సూర్యదేవుని ముమ్మారు ధ్యానించి, ఆదిత్య హృదయం పఠిస్తూ, తమ ధనుస్సు నుండి విషలిస్తశరపరంపరను, రఘునాథ నాయని వారు వర్షపాతంటా కురిపించి నంతనె చోళగుడు చచ్చి విరిగిన కొండ శిఖరంలాగ నేలకూలినాడు. రఘునాథడన్న పేరు సార్ధకమయ్యే లాగున నాయకరాజు సముద్రమును దాటి లంకకు వెళ్ళి యుద్ధ కౌశలమును చాటిరాయెను. అతడు చెరబట్టిన రమణీమణులకు విముక్తి లభించిదని. జాఫ్నా రాజకుమారుడు, బుధ్ద సంఘిలకునకు పోయిన సింహాసనము తిరిగి ఇప్పించుటకై సింహళాభిముఖులై తంజపురీశ్వరులు పయనము సాగించిరి.
*****
మహారాజులు చోళగుని సంహరించినారన్న వార్త అంచెలమీద అతి వేగాన మహామంత్రులకు చేరినది. గోవిందామాత్యులు అతి చాకచక్యంతో రాజ్యం నిర్వహణ చూస్తూ. గ్రామ గ్రామల నుండి వచ్చి చేరతూ వున్న సేనలను, ఎప్పటికప్పుడు కొంత పెనుగొండ వైపునకూ కొంత నాగపట్టణం వైపునకూ పంపించు చుండ, రామేశ్వరము వద్ద సముద్రతీరము పొడవునా, ఎనుబదివేల నావలను, నలుబది వేల పొట్టి ఏనుగులనూ సిద్ధముచేసిరి. రఘునాథ ప్రభువులు దేవికోట నుండిరామేశ్వరము చేరుసరికి సైన్యము సర్వసన్నద్ధమై, యుద్ధాయత్తమై యుండురీతిని సకల ఏర్పాట్లును గావించిరి.
పెనుగొండకు చేరికొనవలసిన సైన్యము కుంభవృస్టివల్లనూ, ఏరులూ వాగులూ పొంగి పొరలుతూ ఉన్నందువల్లనూ మార్గమధ్యాన నిలచిపోవలసి వచ్చినది. శ్రీశ్రీశ్రీ రఘునాథ ప్రభువులు శిబిరంలో కావ్యరచనా దీక్షాబద్ధులై యున్నందున ఎవరికిన్నీ ప్రవేశము లేదని ప్రకటింపించిరి. ఆ శిబిరంలో ప్రభువులు లేరన్న సత్యము అన్నమరాజు వంటి విశ్వాసపాత్రులైన కొందరు ముఖ్య సేనాధిపతులకు మాత్రమే తెలియును. మిగిలినవారు తాము ప్రభువులతో ప్రయాణిస్తున్నామనే భావనతో ధైర్యముగా సంచరిస్తూ ఉండిరి. విజయనగర సామ్రాజ్యములోని సామంతులు సహితము శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయనిం వారు అపార సేనతో గొబ్బూరి జగ్గరాజును అణచుటకు కదలివస్తూ ఉండిరని తెలిసి తమ సైన్యమును కూడవారి సైన్యమునకు తోడుచేస్తూ ఉండిరి. యుధ్ధమాలస్యమైన కొలది ఇరుపక్షాలకూ సైన్యసమీకరణకు మరింత వెసలుబాటు లభించినట్లాయెను.
మూడు గుఱ్ఱములు పూన్చిన అరధములో తాము యుద్ధశిబిరంలో విరచించిన రామాయణ మహాగ్రంధాన్ని, శ్రీశ్రీశ్రీ రఘునాథనాయనిం వారు ఇందిరా మందిరమునకు అంపించిరి. శుకవాణిదేవి కన్నులు చెమ్మగిల్లినవి. గ్రంథమును భక్తితో కన్నులకద్దుకొని పరికించినది. రామప్రభువు సముద్రముపై సేతువు నిర్మించే వరకు రఘునాథప్రభువు రచనను చేసియున్నారు. శుకవాణి తానెంతవరకు కావ్యాన్ని నిర్మించినదీ జ్ఞప్తికి తెచ్చుకొన్నది. అంతఃపురాన రాజభోగాలను అనుభవిస్తూ, గ్రంధరచనలో రణరంగంలో ఉన్న మహారాజులకన్న తాను ఎంత వెనుకబడియున్నదో నన్న విషయం గుర్తించి శుకవాణి సిగ్గుపడినది. ప్రభువులు ఇంతవేగంగా కవనమల్ల గలరు గనుకనే శతాధిక గ్రంధకర్తలైనారు. |