పంచమ సర్గము
స్వర్ణ స్నానము
పరమ రమణీయంగా ఫలపుష్పాదులతో కలకల నవ్వే ఉద్యానవనాలు, ధీరనాయకులవోలె గంభీరమూర్తులై నిలిచిన మనోజ్ఞగిరి శిఖరాలు, మంజులాకారంతో ఒయారాలు పోతూ ఉన్నభూదేవిని ఆర్ద్రంగా అనంత బాహువులతో చుట్టుకొన్న సముద్రుని వినీలకాంతుల ధాళంధళ్యాలు నంతరించుకొన్న సింహళ ద్వీపము ప్రపంచంలోనున్న ద్వీపములన్నిటి అందాలను తలదన్న గలిగిన సరుచిర సుందర రూపిణి.
తమ జీవితాలను సుందర ద్వీపాల సందర్శనకే ముడుపు గట్టిన సౌందర్యోపాసకులైన కేఫ్తానులు సింహళము వంటి చక్కని దీవి లోకంలో మరొక్కటి లేదని ముక్తకంఠంతో కీర్తించి యుండిరి. విదేశీ యాత్రికులకు ఈ దీవి స్వరతుల్యముగా కనుపట్టనది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడూ బుద్ధ శిఖరాన్ని చూడక వెనుతిరిగిపోడు. బుద్ధశిఖరాన్నే ఆదాముశిఖరమని అనడం కూడా కద్దు.
తథాగతుడు ముమ్మారు వచ్చి ఈ శిఖరంపైన ధ్యాన నిమగ్నుడై కొంతకాలము ఇచ్చట తపసు చేసెనని ప్రతీతి. మూడవమారు నిష్క్రమిస్తూ తన పాద చిహ్నాన్ని బుధ్ధ భగవానుడు ఇచట నిక్షేపించినాడని బౌద్ధమతస్థుల నమ్మిక. స్వర్గము నుండి దిగివచ్చిన ఆదాము ఈ శిఖరముపైననే తన మొదటి అడుగునున పెట్టినాడని క్రీస్తుదేవుని అనుయాయుల భావన.
అమృతమువలె తీయనైన నీరాలను ఇచ్చే...వాహిని ఈ కొండ పై ఎచట ఉద్భవించి ఉన్నదో ఎరుక లేకుండినది. ఆదాము కనుల నుండి స్రవించిన అశ్రుబిందువులే ఈ సెలయేటికి మూలస్థానములని కొందరు భావిస్తే, బుద్ధదేవుని కరుణాంతరంగమునుండి వినిర్గతమైన దివ్యశాంతి వరయే ఈ సెలయేటికి జన్మస్థానమని మరికొందరు భావిస్తూ ఉండిరి.
ఎవరెవరు ఏలాగున భావించినప్పటికిన్నీ విధాత ఈ తావును ఇంత మనోజ్ఞంగా సృష్టి చేసేసమయాన ఎంతగా శ్రమించినాడో కదా అని ఎల్లరకూ అనిపిస్తున్నది. ఆ విశ్వశిల్పికి...బాధలు ఈడెరెలాగున చిరుగాలులనర్పిస్తూ వాయుదేవుడున్నూ, దప్పికను బాపేటందుకు తీయని నీటిని అందిస్తూ సెలయేరై పారిన వరుణ దేవుడున్నూ, చల్లని నీడను ఇస్తూ దివ్యతరులతాది రూపం దాల్చిన ప్రకృతి కన్యయూన్నూ అచటి నుండి మరలిపో మనసురాక, శాశ్వతంగా నిలిచిపోయి, తమ సన్నిధానానకు ఏ తెంచిన తైర్థికులకు ఆహ్లాదమును కలుగజేస్తూ ఉండిరి.
హిందూదేశమును పరిపాలించే మౌర్యచక్రవర్తి అశోకుడు, తథాగతుని దివ్యబోధనలను వ్యాప్తి చేసేటందుకుగాను, అనేకమంది స్త్రీ పురుషులను సింహళద్వీపమునకు పంపియున్నారు. వారిలో మహేంద్రుడున్నూ, సంఘమిత్రాదేవియున్నూ ఎన్నతగి ఉండిరి. వీరు రాజకుమారుడు రాజ కుమారికా అయి ఉండడం చేత సింహళీయులకు అత్యంత ఆకర్షణ కలిగినది.
ఈ దేశస్థులు స్వభావసిద్ధంగా పరమదయాళువులున్నూ, హింసను నిరసించే ప్రకృతి గలవారున్నూ, దుఃఖితులైన సాటి మానవులకు సానుభూతిని చూసించే వారుగానున్నూ ఉన్నందువలన తధాగతుని అహింసా సిధ్ధాంతము వారినిట్టే ఆకట్టుకొనగలిగిన దాయెను, సౌజన్య సౌకుమార్య స్వభావంగల సింహళపౌరులు బుధ్ధభగవానుని శాంతి సందేశాన్ని మన స్తూర్తిగా శిరసావహించగలిగిరి.
హిందూదేశము నుండి ఒక బ్రాహ్మణ స్త్రీ బుద్ధదేవుని శ్రీదంతమును ఒక బంగరు కలశములో భద్రపచుకొని సింహళద్వీపమునకు గైకొని వచ్చనది. ఈ శ్రీ దంతమును అత్యంత భక్తి శ్రధ్దలతో పూజించే ప్రజానీకము ఒక మహా చైతత్యమును నిర్మించిరి. ఎవరికే కష్టము కలిగినా అచటికి వచ్చి మ్రొక్కుడిలినంతనే వారి కష్టములు తొలగిపోతున్న ఉదంతం గమనించి ఆ శ్రీదంతము మహిమాన్వివతమైనదని తలచిరి.
జాఫ్నా పట్టణాభిముఖంగా సముద్ర తీరాన పయనిస్తూ ఉన్న శ్రీశ్రీశ్రీ రఘునాథ నాయనిం వారున్నూ, చేమకూర వేంకటపతిరాజున్నూ బుధ్ధ సంఘిలక ప్రభువు తమ దేశచరిత్రలోని చిత్రవిచిత్ర విషయాలను, ముఖ్యగాధలను చెపుతూ ఉంటే, అతి శ్రధ్ధతో ఆలకిస్తూ ఉండిరి.
సంఘి : ప్రభూ, సింహళరాజ్యాన్నేలిన మొదటి ప్రభువు విజయుడని మా పూర్వీకులు చెప్పుకొంటూ ఉంటారు. |