రఘునాథులు : ఏమీ సంఘిలక ప్రభూ, మా చేమకూర రచించే విజయ విలాసంలోని విజయుడూ, మీ విజయుడూ ఒకరేనా ! అని మేలమాడినారు.
వేంకట : మీ సింహళీయుల పేర్లుకూడ మా భారతీయుల పేర్లవలెనే ఉన్నవే ! అబ్బురపడినాడు.
సంఘి : ప్రభూ , మా విజయ మహారాజులవారి తల్లి, మీ భారతదేశ రాకుమారికి జనించిన ఆడబిడ్డయే. ఆమె తన మనుమనికి తమదేశంలో గొప్పఖ్యాతి నార్జించిన ప్రముఖుని పేరు పెట్టుకొన్నదట.
రఘు : సంఘిలక ప్రభూ, ఆ గాథ మాకు పూర్తిగా వినిపించరాదా వినాలని కుతూహలగా ఉన్నది.
సంఘి : హిందూదేశంలోని దక్షిణ తీరాన్నేలే ఒక సామంతరాజు కుమార్తె. సౌందర్య ప్రభాదేవి. ఆమె స్వేచ్ఛా విహంగం వలె సంచరించాలని అభిషలించేదేగాని ఒకచోట నిలవడానికి అంగీకరించేది కాదు. ఆమెను రాజు అడ్డగించలేకపోయినాడు. కొండల వెంటా కోనలవెంటా చిత్తమొచ్చిన రీతిని సంచరించేది. బెగ్గరు పక్షిలా, వనమమూరిలా, కృష్ణ మృగములా, గిరిశిఖరాల నుంచి త్రుళ్ళి పడే జలపాతంలా ఆమె కదలాడుతూ ఉంటే సౌందర్య రహస్యాలను వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఉండేది. ఆమె ఎంతటి సుకుమారియో అంతటి శౌర్యవంతురాలున్నూ అయి ఉండడంతో తండ్రిగారికి ఆమె క్షేమాన్ని గూర్చి చింతించనవసరం లేకపోయింది. మరిన్నీ ఆమె వాడిచూపులలో ఒక వింత శక్తి ఉండేది. ఒక వ్యాఘ్రమో, సింహమో, మత్తేభమో ఆమె తేరిపారచూస్తే, వెనుకకు మరల వలసిందేగాని ఎదురువచ్చి నిలువగలిగేది కాదు.
ఒకమారు సౌందర్య ప్రభాదేవి కొందరు వర్తకులతో కలిసి సముద్రాంతర తీరాలకు పోవ సంకల్పించినది. ప్రభువులు తమ కుమార్తెను వారించలేక వెంట సైన్యమునిచ్చి పంపిరి. కొన్ని దినాలకు ఆమె సైన్యమును సహితము తిరస్కరించి వెనుకకు పంప తలపెట్టినది. చేయునది లే క సైనికులు వెనుకకు మరలిరి.
వ్యాపారులతో కలసి ఆమె అరణ్యమధ్యాన ప్రయాణిస్తూ ఉండగా ఒక సింహము వారిపైకి రాబోయినది. అందరూ భయముతో చెల్లాచెదురుకాగా, ఆ రాకుమర్తె తన తీక్షణచూపులతో ఆ సింహమును ఎదుర్కొని, నిలబెట్టి, వెన్ను నిమిరి, లాలించినది. ఆ మృగరాజు ఆమె లాలనకు మైమరచి, ఆమెను తనవీపుపై విడుకొని తన గుహకు పరుగిడినాడు....విరగబూచిన కదంబవృక్షములా యౌవనశోభతో పరీమళించిపోతూ ఉన్న రాకుమరిని రాకుమార్తెతో....
రఘు : ఆ ! తరువాత?......తరువాత ?
సంఘి : ప్రభూ ! మీరు విశ్వసించరనీ, కాగా నవ్వుతారేమోననీ జంకుగా ఉన్నది.
రఘు : ఎందుకు ? మిత్రమా, చరిత్ర ఎలా ఉన్నా మనకు శిరోధార్యం కాకపోతుంది ? అని ప్రోత్సహించినారు రఘునాథ మహానాయకులు.
సంఘి : ఆ రాకుమర్తెతో సింహము ఆ గుహలో కాపురముచేసి ఒక మగ, ఒక ఆడ కవలశిశువులను కనినది ప్రభూ ! బిడియపడినాడు.
వేంకట : ఈలాటి గాధలు మాకూ ఉన్నాయి, సంఘిలక ప్రభూ ! ఉత్సాహ పరచినాడు.
సంఘి : సౌందర్య ప్రభాదేవి కుమారునకు పదునెనిమిది ఏండ్లు వచ్చిన పిమ్మట, అతడు తన తల్లినీ, దోబుట్టువునూ వెంటబెట్టుకొని ఆ గుహనుండి పారిపోయినాడు. మృగరాజు తన భార్యాబిడ్డలకై వగచి వగచి అడవిని విడిచి. గ్రామలపై విరుచుకొనిపడి ప్రజలను హింసించసాగినాడు. ఆ ప్రదేశాన్నేలే నాయకుడు ఆ సింహమును చంపినవారికి మంచి బహుమతి ఇస్తానని చేసిన ప్రకటన ఆ సింహము కన్నకొడుకు చెవిని పడినది. అతడు తన వాడి బాణాలతో ఆ సింహాన్ని సంహరించి, బహుమతులను పేరు ప్రభ్యాతులను గడించి రాజుగారి సోదరిని పెండ్లాడి, తన తల్లితో సుఖముగనుండెను. ఆ సమయంలోనే ఆ దేశనాయకుని కుమారుడు సింహమునకు పుట్టిన కన్యను పెండ్లాడెను. వారికి జనించిన పుత్రుడే విజయుడు. విజయుని జాతకమును గుణించిన పండితులు అతని ఉనికి దేశానికే మాత్రము క్షేమకరముకాదనీ అతనిని సముద్రంలో పారవేయమనీ అతని తండ్రిని ప్రోత్సహించిరి. తన చేజేశులా తన పుత్రుని చంపుకోలేక, అతడు ఒక నావలో కొంతమంది సైనికులను తోడుచేసి, విజయుని సముద్రంలో వదలివైచినాడు. విజయుని నావ అలల తాకిడికి తునకలు అయిపోగా విజయుడు ఒక కొయ్యముక్క ఆధారంతో ఒక దీవికి కొట్టుకొని వచ్చినాడు. ఆ దీవియే సింహళము. విజయుడు అచటికి చేరుకొన్న సమయాన ఈ దీవి రాక్షసులకు, పిశాచాలకు నిలయమై అనేకమైన అరాచకాలకు ఆలవాలమై ఉన్నది. |