163
 

వేంక‌ట : మా ద‌శ‌ర‌థ రాచ‌చంద్రుడు రక్క‌సి మూక‌ల‌ను చెండాడినాడు కాడా ? ఇంకెక్క‌డి రాక్ష‌సులు ?

సంఘి : వేంక‌ట‌క‌వీ , ఏ జీవినైనా స‌మూలంగా నిర్మూలించ‌డం అ దైవానిక‌యినా సాధ్య‌ప‌డుతుంద‌ని అనుకోరాదు. కాగా, రామాయ‌ణ‌ము పురాణ‌గాధ‌...ఇది చరిత్ర‌. అక్ష‌రాఆ జరిగిన య‌దార్ధ‌గాధ‌...విజ‌యుని ఒక రక్క‌సి క‌న్య‌క వ‌ల‌చివ‌చ్చి తోడు నిల‌చిన‌ది.

ర‌ఘు : ఏదీ ! మ‌న హీడింబి భీముని వ‌ల‌చిన‌ట్లా, వేంక‌ట‌ప‌తీ !

సంఘి : అచ్చంగా అదే విధాన జరిగింది మ‌హాప్ర‌భూ, ఆమె సాయంతో త‌క్కిన రాక్ష‌సుల‌ను విజ‌యుడు చీల్చి చెండాడినాడు. కొంద‌రు ప్రాణ‌భీతిలతో పారిపోయినారు. కొంద‌రు కొండ‌ల‌లో కోన‌ల‌లో త‌ల‌దాచుకొన్నారు. ఈనాటికీ ఈ జాతి మిగిలి ఉన్న‌ది వీరిని వెడ్డ‌లు అని పిలుస్తూ ఉంటాము.

శాంత‌స్వ‌భావులు మాత్ర‌మే ప్రాణాల‌తో నిలువ‌గ‌లిగినారు. వారు సింహ‌ళ‌ద్వీపానికి విజ‌యుని సార్వ‌భౌమునిగ నిర్ణ‌యించి ప‌ట్టాభిషేక‌ము చేయ త‌ల‌పెట్టిరి. కాని విజ‌యుడు అందుకంగీక‌రించ‌లేదు. త‌న తండ్రి క్ష‌త్రియుడే అయిన‌నూ, త‌ల్లి మృగేంద్ర సంజాత అయి నందున త‌న‌ది స్వ‌చ్ఛ‌మైన క్ష‌త్రియ ర‌క్త‌ము కాదు కావున‌, భావిలో దేశానికి చ‌క్ర‌వ‌ర్తి కాగ‌లిగిన త‌న వంశాంకురానికి సుక్ష‌త్రియ వంశానికి చెందిన క‌న్య తల్లి అయిన‌ట్ల‌యిన దోష‌ర‌హితంగా ఉంటుంద‌నే గాఢ‌కాంక్ష‌ను వ్య‌క్తం చేసినాడు. విజ‌యుని అనుచ‌రులు హిందూ దేశ‌మున‌కు వెడ‌లి, కావేరీన‌ది సంద్రాన క‌లిసే సంగ‌మ‌స్థాన రాజ్య‌ము నుండి. ఒక రాకుమారిని తెచ్చి, విజ‌యునికిచ్చి వివాహము చేసిరి. త‌రువాత అత‌ని వంశ‌ము వారు సార్వ‌భౌములై అనేక త‌రాల‌పాటు దేశాన్ని పాలించిరి. విజ‌యుని తల్లిపేరు సింహ‌ళిక‌. ఆమె పేరుమీదుగానే ఆదేశ‌ము సింహ‌ళ‌మై ఒప్పారుతూ ఉన్న‌ది.

ర‌ఘు : మిత్ర‌మా, ఈ సింహ‌ళిక పేరును వింటూ ఉంటే కాళిదాసుని మాళ‌విక‌జ్ఞ‌ప్త‌కి వ‌స్తూ ఉన్న‌ది. ఆమె కూడా సింహ‌ళ రాకుమారి క‌దా !

వేంక‌ట : అవును మ‌హాప్ర‌భూ ఆమె ఓడ‌లో హిందూదేశాట‌న‌కు వ‌స్తూ ఉండ‌గా ఒడ‌ప‌గిలిన‌ది - సంఘిల‌ప్ర‌భూ, మీదేశ గాధ‌ల‌ను గ్రంధ‌స్తం చేసి ఉంచుకొన్నారా ? వీర పురుషుల దివ్య చరిత్ర‌ల‌ను విన్నంత మాత్రాన ఒడ‌లు గ‌గుర్పొడిచేలా, భావిత‌రాల వారికి ఉత్తేజం క‌లిగించేలా మీరు వారిని శాశ్వ‌తుల‌నుగా రూపొందించుకొన్నారా ?

సంఘి : మ‌హావంశ‌, కుల‌వంశ‌, దీప‌వంశ‌, రాజావ‌ళీయ మొద‌లైన గ్రంధాల‌న్నీ మా దేశ‌చ‌రిత్ర‌ను చ‌క్క‌గా చాటుతాయి. అయితే కొంద‌రు మ‌త ప్ర‌వ‌క్త‌లు కొన్ని రాచ‌కుటుంబాల‌ను గుప్పెట‌లో ఉంచుకొన్నందున కొన్ని గాధ‌లు య‌దార్థానికి దూరంగా ఉండ‌టం గ‌మ‌నింప‌వ‌చ్చు.

వేంక‌ట : అలాటి అస‌త్యాలు మా గ్రంధాల‌తోనూ పొందుప‌ర‌చారు. రాజ వంశావ‌ళిని చాటే పురాణాల‌లో ఎన్నో ప్ర‌క్షిస్తాల‌ను చూడ‌వ‌చ్చు. భ‌విష్య‌త్పురాణం అనే గ్రంధంతో గ‌తించిన పాల‌కుల పేర్ల‌ను పాత తాటియాకుల మీది కెక్కించి జ‌నుల‌ను న‌మ్మింప‌జూపే కిత‌వులు మ దేశాన ఉన్నారు.

ర‌ఘు : ఏమి మిత్ర‌మా. పురాణాల మీద‌కు ధ్వ‌జ‌మెత్తుతూ ఉన్నావు ?

వేంక‌ట : మ‌హాప్ర‌భూ, మ‌హ‌నీయులైన మ‌హ‌ర్షుల వ్రాత‌ల‌లో త‌మ‌వ్రాత‌ల‌ను కూడా చొప్పించివేసే హీనుల‌ను చూస్తూ ఉంటే నా గుండె మండిపోతున్న‌ది. ఏది ప్ర‌క్షిప్త‌మో ఏలాగున తెలుసుకోగ‌ల‌ము ప్ర‌భూ ?

ర‌ఘు : శ్లేష‌క‌వీ, హృద‌యం భారంగా ఉన్న‌ది. యుద్ధ స‌న్నాహ కార్య క్ర‌మం మ‌రింత భారంగా ఉన్న‌ది ఇక అష్టాద‌శ పురాణాల‌లోని ప్ర‌క్షిప్త సంక్షిప్త వార్త‌ల‌ను వినిపించే క‌న్న‌, ల‌లితంగా ఒక‌చక్క‌ని ప‌ద్యం వినిపించ‌రాదా ?

ప్ర‌భువు వారి హృద‌య‌ము ఎక్క‌డ విహ‌రిస్తున్న‌దో తెలుస్తూనే ఉన్న‌దిక‌దా ! అని అనుకున్నాడు, వేంక‌ట‌ప‌తిరాజు.

నువ్వు బువ్వు న‌వ్వు జ‌వ్వ‌ని నాసిక‌
చివురు న‌వురు జ‌వురు నువిద‌మోవి
మ‌బ్బు సుబ్బు గెబ్బు బిబ్బోక‌వ‌తి వేణి
మెఱ‌పు నొఱ‌పు దెఱ‌వ‌మేను.