సాయణాచార్యులవారి వంశంలో వశిష్టగోత్రజుడైన గోవిందదీక్షితులుద్భవించినాడు. గోవింద దీక్షితులు తండ్రి సాంగవేది మహాపండితుడైన విశ్వేశ్వర దీక్షితులు తన పత్నియైన లక్ష్మాంబతోనూ, కుమారుడైన గోవిందునితోనూ తాళికోట యుద్ధానంతరము విజయనగరము నుండి పెనుగొండ నగరానికి రాజవంశాలవారితో బాటు తరలి వచ్చినాడు. ఈ వంశంవారు విజయనగర చక్రవర్తుల ఆస్థానంలో పండితులై, అనేక రాజవంశాలవారికీ సామంతులకూ గురువులై ఉంటూ ఉండిరి.
రాజవంశీకుడూ, అచ్యుతరాయచక్రవర్తికి తోడల్లుడూ అయిన చిన చెవ్వప్ప నాయనింవారు తంజాపూరిలో రాజప్రతినిధిగా, సామంతుడిగా ఉండి, తాళికోటలో చక్రవర్తి సైన్యాన్ని నడుపుతూ యుద్ధం చేసిన సేనాపతులలో ఒకడు. ఆ యుద్ధంలో రామరాయులవారు పడిపోవడంతోనే జయం పొంది ఉన్నప్పటికీ విజయనగర సైన్యాలు చటుక్కున చెదిరిన గుండెచే పగరకు వెన్నిచ్చి విజయనగరం పారిపోవడం సాగించినవి. అవక్రపరాక్రమంతో యుద్ధం చేసిన చిన చెవ్వప్పనాయనింవారు సైన్యాల్ని నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికిన్నీ వారు నిలవలేకపొయినారాయెను. తన సైన్యాలను మాత్రం తాను సరిచేర్చుకొని చెవ్వప్ప నాయనింవారు తిరుమల నాయనింవారితో స్వామీ ! ఆనగొందెదగ్గర మనం తురుష్కుల సైన్యాల్ని నిలబాటు చేస్తే, కొద్దిదినాలకు అవి నాశనం అయితే జయం మనదే అవుతుంది అని మనవి చేసినా, అన్నాగారు పోయిన బెంగచేత, తుంగభద్ర దాటి విజయనగరం చేరి, యావత్తు రాణీవాసంతో, సైన్యాలతో పెనుగొండకు ప్రయాణం కట్టినారు. ప్రభువు పారిపోతే ప్రజలెవరుంటారు కనకా, విశ్వేశ్వర దీక్షితులు తన కుటుంబంతో సామానుతో బయలుదేరి వెళ్ళే సమయంలో చెవ్వప్ప నాయనింవారు ఆ పండితేంద్రులను తన సైన్యరక్షగా తీసుకువెళ్ళి పెనుగొండ నగరంలో దిగవిడిచినారు.
ఈ ప్రయాణంలో చెవ్వప్పనాయనిం వారికి విశ్వేశ్వర దీక్షితల వారంటే ఎంతో భక్తి కుదిరింది. యువకుడైన గోవింద దీక్షితులు ఇరువది సంవత్సరాల ఈడుగల బాలుడు. ఆ బాలుని పాండిత్యం చూచి, అఖండ ప్రజ్ఞ గ్రహించి, ఉత్తమశీలము అతని మోమున ప్రకాశిస్తుండగా దాన ఓలలాడిన చెవ్వప్పనాయనింవారు ఆనందంతో ఉప్పొంగిపోయినారు. విశ్వేశ్వరదీక్షితుల వారిని సకుటుంబంగా తంజావూరు రావలసిందని ఆ ప్రభువు ఎంతగానో కోరినా తాను చక్రవర్తి కుంటుంబాన్ని వదిలి రావటం వీలులేదని, కాబట్టి తన కుమారుని తంజావూరు తీసుకువెళ్ళ వచ్చునని విశ్వేశ్వరులు చెప్పినారు.
చిన చెవ్వప్ప ప్రభువు అందునకే సంతసించి ఆంధ్ర సామ్రాజ్యానికి, తన రాజ్యానికి తురుష్కుల వల్ల కోటి వేల బాధలు రాబోవుతున్నవనీ, అందుకు ఉత్తమ పురుషుడూ, ప్రతిభావంతుడూ అయిన పురుఫుడొకడు తనకు మంత్రిగా ఉండటము చాలా అవసరమని నిశ్చయానికి వచ్చి ఉండటం వల్ల గోవింద దీక్షితులను రావలసిందని ప్రార్ధించినాడు. గోవింద దీక్షితలకు రెండు సంవత్సరముల క్రితమే వివాహమైనది. వ్యక్తురాలు కాకపోయినా అగ్నిహొత్రదీక్షకై భార్య అత్తవారింటికి వచ్చినది. గోవిందుని భార్య తల్లికోట యుద్ధానికి ముందే తన పుట్టినిల్లు అయిన మైసూరుపొయి ఉన్నది.
విశ్వేశ్వర దీక్షితులు తన తనయుని అగ్నిహొత్రముతో కోడలితో తంజావూరు పంపుతానని చెవ్వప్ప నాయనిం వారికి మాట ఇచ్చినారు. చెవ్వప్ప నాయనింవారు తంజపురి చేరిన రెండు సంవత్సరాలకు శాక.శ.1489 అక్షయనామ సంవత్సర వైశాఖ శుద్ధపంచమి శుక్రవారం నాడు
దీక్షితులకూ, సౌభాగ్యవతి నాగమాంబకూ పునస్సంధాన ముహూర్తం జరిగినది. ఆ వెనుక శ్రావణమాసంలో శుభముహుర్తమందు అగ్నిహొత్రంతో, భార్యతో, శిష్యులతో, పరివారంతో తంజపురి చేరినారు, గోవింద దీక్షితమంత్రి.
చాలాకాలం వరకూ గోవిందులకు సంతతి లేకపోయినది. శాలివాహన శకం 1498చ యువసంత్సర ఫాల్గుణమాసంలో నాగమాంబకు ఇరువది నాలుగేడులున్నప్పుడు ఆమె గర్భము ధరించినది. రాజనగరులలో దీక్షిత మంత్రి భవనాలలో వారి విద్యాశ్రమములో మహొత్సవములు జరిగినవి. ధాతసంవత్సరములో శుభముహూర్తమందు సర్వగ్రహాలు మంచిస్థితులలో ఉన్న సమయములో గోవింద దీక్షిత మహామంత్రికి పుత్రుడుద్భవించినాడు. తాను పుత్రునికై నారాయణ యజ్ఞముచేసి ఉండడం చేత అతనికి యజ్ఞనారాయణుడని గోవిందదీక్షితులు పేరుంచినారు. మనుమడు కలిగిన సంతోషవార్త విన్నప్పుడు విశ్వేశ్వరదీక్షితులకూ, లక్ష్మమాంబకూ కలిగిన ఆనందం వర్ణనాతీతము. పండై ఉన్న విశ్వేశ్వర దీక్షితులు మనుమడు పుట్టిన రెండేళ్ళకు కోడలు రెండవసారి గర్భిణి అన్న శుభవార్తమానము విన్నారు. ఆ వెనుక ఆయన సన్యసించి గోవిందునికి రెండవ కుమారుడు వెంకటమఖి పుట్టిన మూడు నెలలకు సిద్ధిపొందినారు. భర్త సన్యాసత్వము పొందిన వెంటనే లక్ష్మమాంబ కుమారుని ఇంటికివచ్చి మనుమని ఆడిస్తూ ఒక పరమశువేశ పరబ్రహ్మ సాయుజ్యమందినది. |