ఇంతలో గురువుననుసరించి యజ్ఞ నారాయణ దీక్షితులు లోనికరుదెంచి, తండ్రికి నమస్కరించి, కొంచెము దూరములో ఒక కుశాసనం మీద ఆసీనుడయ్యాడు. యజ్ఞ నారాయణుననుసరించి, వెంకట మఖియా అక్కడకు వచ్చినాడు. అతడు తండ్రికి నమస్కరించి, రఘునాధ నాయకునకు అభ్యుదయము పలికి, అన్నగారికి వందన మాచరించి విద్యార్ధుల మధ్య కూర్చుండినాడు.
గోవింద : మహాప్రభూ ! శ్రీ రామరాయలుంవారు చేయజాలని పని తాము నిర్వహించుకు వచ్చారు. తాము శ్రీకృష్ణదేవరాయ సార్వభౌముల అవతారమే అని నిశ్చయంగా చెప్పగలను. అచ్యుత దేవరాయలు చక్రవర్తి భార్య వరదాంబికాదేవి, వారీకీ వారి అన్న శ్రీకృష్ణదేవరాయ సార్వభౌములకూ మేనమామ కూతురు. ఆమె చెల్లెలు మూర్తిమాంబాదేవి. మూర్తిమాంబాదేవి గారు తమ నాయనమ్మ గారు. శ్రీకృష్ణరాయ సార్వభౌముల రక్తము తమయందునూ ప్రవహిస్తున్నది.
రఘు : గురుదేవా, తమ ఆశీర్వాద బలం వల్ల నేను తురుష్కులను ఓడించగలిగాను.
గోవింద : అబ్బాయి యజ్ఞనారాయణుడు తమను ఒక్క నిమేషమూ ఎడబాసి ఉండనంటాడు. అతడు కూడా కత్తి పట్టినాడా ఏమిటి ?
రఘు : ఘంటము ఎంత సులభంగా చేతబడతాడో అంత సులభంగా కత్తి పట్టుతారాయన ఎంత చక్కని సాహిత్యవేత్తో అంత దిట్టరి అయిన యుద్ధవీరుడు. నాకాయన యుద్ధంలో దారి పొడుగునా అంగరక్షకుడుగానే యున్నారు.
యజ్ఞ : బాబయ్యగారూ ! ప్రభువువారి పరాక్రమం, యుద్ధనిర్వహణ ప్రతిభ అప్రతిమానం.
గోవింద : అవసరమైతే తామొక్కరే ఒక్కొక్క దళాన్ని ముక్కలు చేయగలరు.
రఘు : నన్ను పొగడకండి, గురదేవా !
గోవింద : నిజం చెప్పినా పొగడడమైతే ఇంక ఉత్ప్రేక్షను ఊహించలేము.
యజ్ఞ : గోలకొండ సైన్యాలు మహాడాబుగా వచ్చారు. పెనుగొండ ముట్టడించారు. మన ప్రభువు చారులు, కోటలో తిండిలేక చాలా ఇబ్బంది పడే సార్వభౌముల సైన్యాలకు ధైర్యం కొలుపుతూ వార్తలందించారు.
గోవింద : అంత హీనస్థితిలోకి వెళ్ళిపోయారు కాబోలు పెనుగొండవాసులు.
యజ్ఞ : చిత్తం బాబయ్యగారూ ! కోటను హరిహరులు పట్టలేరు గనుకగాని, తురుష్కుల ముట్టడి భయంకరంగానే సాగుతున్నది. మధుర నాయకులుగాని, మైసూరు ప్రభువుగాని సాయానికి రాలేదు. పెనుగొండలో చక్రవర్తికి బందీగా జింజి కృష్ణప్ప నాయకుడు ఉండిపోయారు. మన సైన్యాన్ని పంపమని తాము మహారాజులంవారికి ఆలోచన ఇవ్వడం, మా గురువుగారైన యువరాజులంవారు సహాయం వెళ్ళడం సార్వభౌములకు కోటివేల ధైర్యం వచ్చిందట. బాబయ్యగారూ !
గోవింద : అందులో ఈ దినాలలో అవక్రమపరాక్రములు, శ్రీరామచంద్ర సమానులు రఘునాథ నాయనింవారు. సైన్యాలతో రావడం ఇంద్రునికి సహాయంగా, నరకునికి వ్యతిరేకంగా శ్రీకృష్ణపరమాత్ముడు వెళ్లడం వంటిది.
యజ్ఞ : సరిపోయిన స్వభావోక్తి !
రఘు : స్వభావోక్తి అయితే గరుత్మంతుడేడయ్యా యజ్ఞనారాయణ దీక్షితుల వారూ !
గోవింద : కూడా వెళ్ళిన సత్యభామ ఏది అని అడిగినారు కాదు !
రఘు : నరకుడు చెరపట్టిన పదహారువేలమంది బాలికలు !
యజ్ఞ : కృష్ణప్ప నాయనింవారి కొమరిత ప్రభువువారి నూత్నవధువు వనచెంజి లక్ష్మిదేవిగారు పదహారు వేలమంది రాజకుమారికల కీడైన వారు కారూ !
గోవింద : కూడా వెళ్ళిన ప్రభువుల బాహువులవసించే విక్రమశక్తే సత్యాదేవి !
రఘు : ఎక్కినతేరు గరుడపక్షి ! ( చిరునవ్వు నవ్వును) అక్కడ వింటున్న బాలబాలికలు, ముఖ్యంగా చెంచులక్ష్మి తమ చిరునవ్వులను వెన్నెలలా ప్రసరింపచేసినారు.
యజ్ఞ : తాము తురుష్క సైన్యాలు కోటను ఒత్తిడి చేయడం తగ్గించి, కోటలోనికి భోజన పదార్ధాలూ సైన్యాలూ పంపిస్తానని తాము మిగతా సైన్యాలతో పైనుండి గోలుకొండ సైన్యాలను నాశనం చేస్తూ ఉంటామనీ, సార్వభౌములు లోననుండి ఒత్తిడి ఎక్కువ చేయవలసిందని మా చారులు లోనకు అందిచ్చిన వార్త బాబయ్యగారూ !
గోవింద : అదే మహాయుద్ధ కౌశల్యమంటే !
రఘునాథ నాయకులు తమ దేశికులకు జరిగినదంతా విన్నవించడానికే అక్కడకు వచ్చినది. యజ్ఞ నారాయణ దీక్షితులు చెప్పడము ఔచిత్యమే ! కాని తనను తప్పక పొగిడి తీరుతాడు అతని ప్రేమ అలాంటిది. ఏదైనా సంతోషంతో ఆయన అంతా విపులంగా చెప్పి తీరుతాడు. తాను పొగడవ్దయ్యా అని ఎలా చెప్పగలడు ? |