ఆమె చూపులు తనపై ప్రసరించడం రఘునాధుడు గమనిస్తూనే ఉన్నాడు. అతడాబాలిక పెద్దకళ్ళు, బరువులెక్కిన మత్తతలు కూడుకునే కళ్ళు, దీర్ఘాలైన మత్స్యలోచనాలు, వెడదలైన పద్మదళనయనాలు, అర్ధనిమీలితాలైన చకోరనేత్రాలు ఆమె ఇక మదిరాక్షి కాబోతున్నది.
ఈ బాలికను తాను మొదట చూచినప్పుడే మనస్సు ఏదో ఆరాటము పొందినది. చిన్న బిడ్డ ! యవ్వనచ్ఛాయలీ బాలికను స్పృశించాయి. అయినా ఈ బాలికలో ఏదో పరమ మనోజ్ఞత్వమూ, ఏదో గాఢాతి గాఢస్త్రీత్వమూ, ఏదో పవిత్ర రసజ్ఞత్వమూ ఉన్నాయి. ఈ బాలిక తనను చూపులతోనూ , రూపంతోనూ, ప్రతిభతోనూ ఆకర్షిస్తున్నది తమ జన్మల రెంటికీ ఏదైనా పూర్వానుబంధము ఉన్నదా ? అయినా ఎవ్వరీ బాలిక అనుకుంటూ ఉండగా యజ్ఞనారయణుడు, తండ్రిగారికి తక్కిన శ్లోకాలు చదివి వినిపించినాడు.
కర్ణాటక దేశన్ని రక్షించడానికై ససైన్యంగా విచ్చేసిన రఘునాధుని గురించి చారులద్వారా విన్న కొందరు యవనులు అరణ్యాలు పట్టుకొని పోయినారు. కొందరు మదాంధతచేత, గర్వోన్మత్తులై జవనాశ్వముల నధిరోహించి ఎదుర్కొనినారు.
గోవింద : అమ్మయీ ! శుకవాణీ ! ఈ శ్లోకానికి నీవర్ధం చెపుతావూ ?
శుకవాణి తన మధుర కోకిల స్వరాన్ని సిగ్గుతో అణచివేసుకొన్నది. కాని దీక్షితులవారు ప్రోత్సహించాక ఆమెకు చెప్పక తప్పలేదు.
శుకశాణి : రాజకుమారుని బాణవర్షానికి గురైన శత్రు సైనికులు కొందరు కూడుచుండగా, కొందరు ఆర్తనాదాలు చేసుకొంటూ, దిక్కుతోచక అటు ఇటు పరుగులెత్తుచున్నారట.
గోవింద : అసలు అలంకారాన్నే దాచేశావు కదమ్మా, ఇంక ఈ శ్లోకంలో అందం ఏదీ ?
శుకవాణి : ఆ ! మరిచిపోయా ! రామస్త్రతో రాత్రిచరా ఇహాసన్ , అన్నారు కదూ ? అట్లా భయంతో ఆర్తనాదాలు చేసికొంటూ, పారిపోతూ కూలిపోయే ఆ సైనికులు రాముని బాణానికి కూలిన రాక్షసులవలె నున్నారుట.
యజ్ఞ : ఊ ! ఈ చివరి వాక్యం వినండి. బలాఢ్యమేవం బహుమన్యతేస్మ.
గోవింద : సార్వభౌములు రఘునాధ ప్రభువులకు సమస్త భూషణాదులూ ఇచ్చి, వాహనాదుల నొసగి సన్మానించారంటారు, అంతేకాదూ ?
వెంకట : అంతేకాదండీ . నాన్నగారూ ! నిండు పేరోలగంలో బంధుమిత్రులు , రాణీవాస స్త్రీ జనము ఆనందంగా చూస్తూండగా మన ప్రభువువారిని అర్ధాసనంపై కూర్చొండ జేసికొని రాయలవారు ఆనందించారు.
గోవింద : ఇంతటి మహావీరుని సన్మానించే మహా అదృష్టం రాయలవారికి ఉన్నపుడు అలాకాక ఎలా అవుతుంది, మరి ?
యజ్ఞ నారాయణ శ్లోకాలు చదువుతున్నప్పుడు శుకవాణి లోనపొందే ఆనందము, ఆమె ముఖంపైన వెలుగు గాంధర్వంగా హాసము, నర్తకిగా నృత్యము చేస్తున్నవి. అవన్నీ రఘునాధ నాయకుడు గమనిస్తూనే ఉన్నాడు.
కొమరుడు శ్లోకాలు గంభీరార్ద్ర రాగయుక్తంగా చదివి ఆపుచేయగానే గోవింద దీక్షితులు నాయానా ! యుధ్ధవిధానం అంతా చెప్పు అని కోరినారు.
యజ్ఞ : నాన్నగారూ ! ప్రభువు సార్వభౌములకు వార్తపంపి, తాము అతి వేగంతో తులుష్కులను తాకినారు. ఆ సమయంలోనే లోనికి ఆహారాదులు మనుష్యులు రావడంవల్ల కోటివేల బలంవచ్చి కోటలో నుండి తాకుడు ఎక్కువైంది. తులుష్కులు వెన్నిచ్చి ఆ రాత్రి పారిపోయినారు. కోటద్వారాలు తెరవగానే మా ప్రభువు పెనుగొండ ప్రవేశించారుజ మన సైన్యం చివరిక్షణాన పెనుగొండలో ప్రవేశించడం చాలా లాభించింది.
గోవింద : రఘునాధ ప్రభూ ! మీరు తులుష్కులను వెన్నంటి తరిమి వారిని పూర్తిగా నాశనం చేయలేకపోయినారా ?
యజ్ఞ : అక్కడ ప్రభువారి యుద్ధ నిర్వహణ ప్రజ్ఞ మహాకాంతితో భాసిల్లింది. ఆ పారిపోయే తులుష్క సైన్యాలు పెనుగొండదాటిన పది క్రోశాలలో రఘునాథుని సైన్యాన్ని నాశనం చేయ ఆ రాత్రే మాటుపన్నినారట. ప్రభువు అలాంటిదే ఊహించి నగరం చుట్టూ ఉన్న గ్రామాలలో శత్రు నిశ్శేషం చేయ సైన్యాలకు ఆజ్ఞ యిచ్చి తాము నగరం ప్రవేశించినారు. |