గోవింద : ప్రభూ ! ఆనందం, ఆనందం తాము కారణంలేక ఏ పనీ చేయరని నాకు తెలుసును.
యజ్ఞ : నాన్నగారూ ! పెనుగొండలో ప్రభువువారు చారుల పంపి మ్లేచ్ఛులు ఎక్కడెక్కడ. ఎంతమంది ఉన్నదీ గ్రహిస్తూ, చిన్న చిన్న దళాలను పంపి వారిని ఓడిస్తూ, వారిని నాశనం చేస్తూ బందీలుగా పట్టుకొంటూ పదిదినాలున్నారు. ఈలోగా వెంకట దేవరాయ సార్వభౌములు రఘునాథ ప్రభువులు ఆలోచన చెప్పినవన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. అక్కడ నుండి తురుష్కులు ఏ కోటనన్నా ముట్టడించి ఉంటే, వారిని నాశనం చేసి ఆ కోటను విడిపించారు. ఏ కోటనన్నా పట్టుకొని ఆ యవనులు చేరి ఉంటే, ఆ కోటను ముట్టడించి , వారిని నాశనం చేసి, ఆ కోటను స్వాధీనం చేసుకొనేవారు. చిన్నచిన్న గ్రామాలు ఆక్రమించినవారిని ఓడించి బందీలుగా పట్టుకొని ఆ గ్రామాలు విడిపించారు. వచ్చిన తరుష్క సైన్యంలో రెండువంతులు నాశనమైపోయారు. ఒకవంతు పారిపోయారు. అంతటితో వదిలారా ? విరోధి సైన్యాలు గోలుకొండ చేరకుండా తాము సైన్యాలను నడుపుకొని , అనెగొందె ఆవల విరోధిని నిలువరించి, సైన్యాన్ని చిన్న చిన్న తుండేలుగా ఖండించివేసినారు.
గోవింద : ఓహొ ! తళ్ళికోట పరాభం ఈనాటికి క్షాళనమై పొయింది. హంపీ విరూపాక్షుని కృప !
రఘునాథుడు గురువును నిర్దేశించి గురుదేవా ! నేను మెచ్చుకోతగిన పని చేసి ఉంటే అదంతా తమ పరమకరుణ అని చేతులు జోడించి తలవంచి నమస్కరించినాడు.
శుకవాణి కుటుంబం తంజపురిలో ప్రసిద్దికెక్కిన వేశ్యా కుటుంబం. చెవ్వప్ప నాయనింవారు తంజపురీ మహాసామంత సింహాసనం అధివసించడానికి సర్వ వైభవాలతో సకల సైన్యాలతో దాసదాసీజన, పరివార జనాదులతోవస్తూ ఉన్నప్పుడు, తనకు ప్రియురాలైన వేశ్య లక్ష్మీదేవిని కూడా తన అంతఃపురభామినిగా తీసుకొనివచ్చి ఉండెను. వారిరువురకు సద్గుణ గరిష్ఠ మహా విద్వాంసురాలు కస్తూరి రంగప్రియయను తనయ ఉద్భవించింది. ఆమెను అచ్యతనాయక మహారాజు సామంతుడు కామరాజు అంతఃపురస్త్రీగా పరిగ్రహించినాడు. ఆమెకు మరకతవల్లి ఉద్భవించింది.
మరకతవల్లి అష్టభాషాపండితురాలు, కవయిత్రి, సంగీత నాట్యాదుల యందు ప్రసిద్ధిపొందిన బాలికయై ఈడువచ్చి, తంజపురి మహారాజు బంధువులయిన యువప్రభువుల హృదయాలు చాలామందిని చూరగొన్నది. కాని ఆమో హృదయం మాత్రం మూర్తెప్ప నాయనిం వారిపై లగ్నమైనది.
విజయనగర సార్వభౌములైన అచ్యుత దేవరాయులవారి మరదలి పేను మూర్తిమాంబ. తంజపుర ప్రభువు అచ్యుతనాయకులవారి ధర్మపత్ని పేరు మూర్తిమాంబ. ఈ మూర్తిమాంబకు ఆ మూర్తిమాంబ అత్త మేనత్త. ఈ మూర్తిమాంబ తమ్ముని పేరు మూర్తప్పనాయకుడూ. మూర్తెప్ప నాయనింవారికి కూడ మరకతవల్లిపై గాఢానురాగము జనించినది. మూర్తెప్ప నాయనింవారు ఎంతో అందమైన వీరులు. మూర్తెప్పనాయనింవారు మరకతవల్లిపై ఉన్న ప్రణయంచేత అగ్నిసాక్షిగా వివాహం చేసుకోక గాంధర్వ రీతిని మహావైభవంతో వివాహం చేసుకొనినారు. వారి ప్రేమ ఒక్క తంజపురినే కాక సకల ఆంధ్రమహాసామ్రాజ్యం యావత్తూ ప్రఖ్యాతి పొందినది. వారిరువురి జన్మలు తరింపచేస్తూ శారదాదేవి, లక్ష్మీ, పార్వతి, రతి మొదలైన దేవీగణ సౌందర్యము అంతా తానే మూర్తించుకొని చెంచులక్ష్మి పుట్టినది.
ఆంధ్రసామ్రాజ్యాల కాలం నుండి, చాళుక్య కాకతీయ విజయనగర సామ్రాజ్యాలకాలం నుండీ భోగినికులము చాలా ఉన్నతికి వచ్చింది. వారు అన్ని విద్యలలోనూ అఖండ పాండిత్యము సముపార్జించేవారు. అందానికి ప్రసిద్ధికెక్కిన వారు. భరత విద్యాపారంగతులు, విమల గాంధర్వ ప్రతిజ్ఞాప్సరలు, కావ్యసరస్వతులు, మహారాజులు, మహాసామంతులు, మహాకవులు, వాగ్గేయకారులు ఈ అప్సరాంగనల ప్రేమించి, ఆ ప్రేమానందార్ణవంలో సర్వమూ మరిచిపోయేవారు. ఈ కులపు సుందరాంగులను అంతఃపురాంగనలుగా, భార్యలుగా, గాంధర్వ వివాహాన పరిగ్రహించే వారు. సర్వవిధాలా ఈ జాతి బాలికలు ఆంధ్రరాజ్య వంశాలవారికి ఇంకా ఎక్కువ కీర్తిని ప్రాభృతంగా అర్పించేవారు.
మరకతవల్లికి మూర్తెప్పనాయకుడు తన నగరివంటి చక్కని నగరు కట్టించి ఇచ్చినాడు. మూర్తెప్పనాయనింవారు మరకతవల్లిని ఒక్క నిమేషమేని వదలడు. ఆయన సామంతరాష్ట్రం వల్ల వచ్చిన ఆదాయంతో ఆనందముగా జీవిస్తాడు. ఆనందంగా మేనల్లుడైన రఘునాధనాయనిం వారితో యుద్ధాలకు వెడతాడు. యుద్ధంలో మేనల్లునికి అంగరక్షక నాయకుడై అద్భుత వీర విక్రమశక్తి ప్రదర్శిస్తాడు. యుద్ధానంతరము, యుద్ధము చేయడం అంటే ఏమిటో ఎరగని జీవితానంద విలాసుడలు పురుషునిలా సంచరిస్తాడు. యుద్ధము దారుణమని ఆ ప్రభువు వాదిస్తాడు. నృత్యగీతకావ్య పఠనాది వినోదాలతో జీవితం వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. |