మరకతవల్లీ అతడూ ఎప్పుడూ ప్రేమతరంగాలలో, గాంధర్వ నృత్య విద్యోత్సవాలలో ఓలలాడిపోతూ ఉంటారు. వారిద్దరూ తన బాలిక జగత్ప్రసిద్ధ విదుషీమణీ, కవయిత్రి , జగన్మోహన కళాకౌశల కావాలని సర్వవిధాలా కోరుకుంటారు. ఆమెను గోవిందమఖి మంత్రికి శిష్యురాలుగా అప్పగించినారు. ఆ బాలిక కోరిన వస్తువు ఆమె ఆటల గృహంలో ఉండవలసినదే. ఆమె తలచిన పని నెరవేరవలసినదే. ఆమె వీణను శృతి చేస్తే తుంబురనాదులు ఉలికిపడవలసినదే. ఆమె కంఠము దివ్య గాంధర్వ పూర్ణమై, సంగీతశాస్త్రంలో ఈమెతక్క ఇంకొక బాలిక ఏది ? అన్న ఖ్యాతిని పూర్తి స్వభావోక్తిని చేసినది.
ఆ బాలిక తల్లిదండ్రుల క్రీగంటిసన్నల మెలగుతుంది. తండ్రి మూర్తెప్పనాయనింవారిని భగవంతుని అపరావతారమని నమ్ముతుంది. ఆమెకు చదువు, నాట్యము, సంగీతము అభ్యసించడలూ, ఆవల తన పెద తల్లి కొమరిత నగరాజకుమారితో ఆటలాడుకొనడమూ ఇవే పనులు. ఈమెతో నగరాజును జతకలిపి, ఇరువురు బాలికలను గోవింద దీక్షితులవారి ఇంటికి పంపేవారు. గుర్రపు బండిమీద పోయి, మళ్ళీ ఆ బండిపైన వస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి రత్నమాణిక్య రుచులతో వెలిగే పల్యంకికపై వెళ్ళి వస్తూండేవారు.
నగరాజకుమారికి పదునాలుగవ వత్సరము జరుగుతున్నది. కస్తూరి రంగప్రియ, తనకు కొమరిత మరకతవల్లి పుట్టుక పూర్వము కుమారికనొకరితను పెంచుకొని ఆమెకు శృంగారవల్లి అని నామకరణము చేసుకొన్నది. శృంగారవల్లి అచ్యుతనాయనింగారి కూమారితయే అని అంతః పురంలో వాడుక ఉన్నది. శృంగారవల్లి విద్యాంసురాలు. నాట్య సంగీత విద్యాపారీణ. ఆమె అందము తంజపురిలో పేరు పొందినది. శృంగారవల్లి అచ్యుతనాయనింవారి బావమరది వేంపరాజుగారు గాంధర్వ విధి ఉద్వాహమైనాదడు. శృంగారవల్లి నగరు వేంపరాజు నగరిని అనుకొని ఉన్నది. వారి నగరు మరకతవల్లి నగరకు ఒక తాంబూలపు దూరమున్నది మాత్రం. ఈ రెండు నగరులకు ఆనుకొని ఉన్న తోటలూ కలిసే ఉన్నవి. అందుచేత సులభంగా ఒకరియింటికొకరు వస్తూఉంటారు.
6
రఘునాధనాయకులు చెంచులక్ష్మి వైపు చూచి, గురుదేవా ! ఈ బాలిక ఎవరు ? అని ప్రశ్నించినారు.
ఈ బాలిక పేరు చెంచులక్ష్మీ. మూర్తెప్పనాయనింవారి కొమరిత, పద్మినీజాతి బాలిక ! నేను ఈమెను శుకవాణీ అని పిలుస్తాను .
అఖండ ప్రజ్ఞాధురీణ అని సాముద్రిక చిహ్నాలు, అవునా ?
అవును, మహాప్రభూ ! లోకవిజిత సౌందర్య కాబోవుతున్నదనీ ఆ సాముద్రికమే వ్యక్తం చేస్తున్నది.
ఈ బాలిక ఎంతకాలం నుండి తమకడ...
అయిదవ ఏటినుండీ ! దేవభాషాజ్ఞానంలో శ్రీహర్షుని పందేనికి పిలువగలదు.
ఓహొ !
తాము పరీక్షింప నా కోరిక
తమ శిష్యుడను నేను. ఆ బాలిక తమ శిష్యురాలు.
ఆ బాలిక తమ శిష్యురాలు కాదగినది
ఆమె తల్లి ?
మరకతవల్లి.
అవును మూర్తెప్పనాయనింవారికి ఆమెపై ఉన్న ప్రేమ మహాకావ్య విషయోత్తమమని వింటిని.
మూర్తెప్ప నాయనింవారు తమ మేనమామలు. ఆయనకు విద్యకు తగినట్లు రసగ్రహణపారీణత్వమూ గంభీరము
చిత్తం ! చిత్తం !
ఈ బాలిక ఇంక యే విద్యల్ని నేర్చుకుంటోంది, గురుదేవా ?
ఈ బాలిక కావ్యసరస్వతి, సంగీత శారద, నృత్యభారతి, విజ్ఞాన సావిత్రి. |