గోవిందదీక్షిత దేవుడు ఆ బాలిక చిత్తవృత్తిని వెంటనే గమనించి, ఈ బాలిక రఘునాధుని ప్రేమించినది. ఆ ప్రభువు ఈమెకు నాయకుడు, భగవంతుడు అయినాడు. ఆమె ఈతనికై ఒక్క నిమేషమైనా ఆలోచించకుండా తన సర్వస్వము సంతోషంతో అర్పించగలదు. అని అనుకొన్నాడు. ఈ ఆలోచనతో ఆయనకు ఆ రాజకుమారుని చిన్నతనం జ్ఞప్తికి వచ్చినది.
రఘునాధ ప్రభువు మూడవయేటనే చదువు ప్రారంభించినారు. అక్షరాభ్యాసమహోత్సవము జరుగకుండానే ప్రభువు అంతఃపుర బాలబాలికల విద్యామందిరం లోనికి చిన్నగోపాలకృష్ణయ్యలా నడచిపోయి అక్కడివ బాలబాలికలు వ్రాసుకొనే దేవనాగరి అక్షరాలు, తెలుగు అక్షరాలు వ్రాయడం ప్రారంభించారు. ఏకసంథాగ్రాహి అవడంచేత ఏ పద్యము, ఏ పాటా, ఏ శ్లోకమూ, విన్నా వెంటనే అంత చిన్నతనంలోనే అప్పగించే వారు. మాటలు ముద్దుల మూటలు, తేనెవాకలు ప్రవహిస్తూ ఉండేవి.
తండ్రి అచ్యుతనాయక మహారాజు, మహారాణి మూర్తిమాంబాదేవి వద్దంటున్నా, చిన్న చెవ్వప్పనాయనిం వారి అనుమతితో, మూడవ యేటనే, తనచేత అక్షరాభ్యాసం చేయించారు. ఆనాటి నుంచీ మనోవేగాన్ని మించి, ఈ పురషోత్తమునకు విద్యలు దాసీజనం అయినవి. రఘునాథుడు అక్షరాభ్యాసంతో ప్రారంభించిన చదువు తొమ్మిదవ యేడున పంచకావ్యాలు ముగించి, వ్యాకరణము ప్రారంభించినాడు.
తాతగారు చెవ్వప్పనాయనింవారు రఘునాథుని చిన్నతనంలో ఎప్పుడూ వదిలి ఉండేవారుకారు. రఘునాథుని నాల్గవయేట చెవ్వప్పనాయనిం వారు నవరత్నాలు పొదిగిన దంతపుపిడి రత్నస్ధగతిమైన ఒర కలిగిన చిరుకరవాలం ఒకదానిని బహుమతి ఇచ్చారు. బంగారు తొనలు తిరిగియ ఈడుకు ఉండాల్సినదానికన్న ఎక్కువ పొడుగుగా ఉన్న ఆ బాలుడు ఆ కరవాలం మొలకు ధరించి, తాతగారితో కూడా శ్రీరామచంద్రబాలమూర్తిలానడిచి వెడుతూంటే, జంతుశాల నుండి వేట చిందువు ఒకటి బోనునుండి తప్పించుకొని అంతఃపుర నగరులలో దూరిందని రోజుకుంటూ చారులు పరుగెత్తుకొని వచ్చి చెప్పినారు. అంతఃపుర రక్షకులు కత్తులు భల్లాలు దూసి అంతఃపురస్త్రీ నగరుల వైపు పరుగెత్తినారు. వారివెంట ఆ చిట్టిబాలుడూ పరుగిడినాడు. నగరులన్నీ గగ్గోలైపొయినవి.
ఆ చిందువు భయపడి, భయంకలిగిన కోపంతో గుర్రపెట్టుతూ ఒక స్నానమందిరములో దూరినది. అక్కడి చాకలివాడు, ఓ అని కేకపెట్టి అక్కడ ఉన్న క్రిడాసరస్సులోకి దుమికినాడు. చిందువు గాండ్రుమని నీళ్ళోకి ఉరకడానికి సిద్ధంగా ఉండగా, రఘునాధుడు సేవకులకన్న ముందుగా పరుగున వచ్చి, ఆ స్నానమందిరములోకి ఉరికినాడు. రాజకుమారుడు గారూ, అంటూ గోలపెడుతూ ఆ మందిరమువైపుకు పరుగెత్తుతూ రక్షకులు రాసాగినారు. చెవ్వప్పనాయనింవారి మొలలో ఖడ్గము లేదు. చేతిలో చురకత్తె మాత్రమున్నది. అది లాగి చేతను ధరించి, స్నానమందిరములోనికి అడుగిడినారు. అక్కడ రఘునాథ ప్రభువు కత్తి దూసి, చిందుపులిని ఎదుర్కొన్నారు. ఆ చిందువు ప్రభువుని చూచి, మీదికురికింది. ఆ చిన్నారి వీరుడు దుష్యంతుని కొమరుడు భరతునిలా ఉన్నాడు. ఒక అర్ధ తృటిలో మహావేగముతో రాజకుమారుడు ప్రక్కకు తప్పుకొని, తన చిన్న కత్తి పుచ్చుకొని ఆ చిందువు అడుగు భాగములో కొట్టినాడు. కొట్టడం ఏమిటి, వెంటనే ఆ బాలుడు వెనక్కు తిరిగి చిందువు పైకురికినాడు.
ఆ చిందువు చిన్నతనాన్నుండి కోటలోని జంతుశాలలో పెరిగింది. ప్రభువులతో వేటకు వెళ్ళేది. చిందువులు మహారాజులకు వేటకుక్కలవంటివి. దెబ్బ తినిన ఈ చిందువు రాజకుమారునియందు తన ప్రభువులైన అచ్యుత నాయనిం వారిని దర్శించింది. అది తలవాల్చి రాజకుమారుని కాలిదగ్గరకు పాకుతూ వచ్చే సమయానికి తాతగారూ అడ్డం వచ్చినారు. అంతలో అచ్యుత నాయక మహారాజు తొందరగా సేవకులతో అక్కడకు వచ్చినారు. చెవ్వప్ప నాయనింవారు తన బాకుతీసి చిందువును పొడవబోతూ ఉంటే అచ్యుత నాయకులు తండ్రిని వారించినారు.
చిందువును దాని సేవకులు వచ్చి గొలుసులతో మంచానవేసి కట్టి తీసుకొని పోయినారు ఇదంతా గమనిస్తూ భయంతో నీళ్ళలో గజగజలాడిపోతున్న చాకలివాడు సంతోషంతో పైకివచ్చి జరిగినదంతా అందిరికీ విన్నవించాడు. ఆ దినాన కోటలో, తంజపురిలో దేశం అంతా అత్యంతా నందంగా ఉత్సవాలు జరిగినవి.
ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆలోచించుకుంటూ గోవింద దీక్షితులు చిరునవ్వుతో చెంచులక్ష్మిని చూచి, అమ్మాయి ! ఈ దినము నువ్వూ నగరాజకుమారీ ఇంటికి వెళ్ళండి. సాయంకాలము నీ నాట్యమూ. సంగీతమూ ప్రభువు పరీక్ష చేస్తారు, అని చెప్పినాడు. |