33
 

త్రినామాద్యంత నామాన్‌
మ‌హిక్షి ద్దీక్షితా పుభౌ
శ‌స్త్రే, శాస్త్రే, చ‌కుశ‌లా
వాహ వేషుహ వేషుచ అని వ‌ర్ణించినాడు.

ఒక‌రు మ‌హిక్షితులు, వేరొక‌రు దీక్షితులు, ఒక‌రు శ‌స్త్రంలోనూ వేరొక‌రు శాస్త్రంలోనూ, ఒక‌రు ఆవ‌హంలోనూ, వేరొక‌రు హవంలోనూ కుశ‌లురు. అచ్యుత గోవింద నామాల‌లో అదినామ‌ము అంత్య‌నామ‌ము క‌లిగిన వీరు అచ్యుత గోవిందుల‌నే ప్ర‌తిభావంతులు.

గ‌రువును వ‌ద‌లి ర‌ఘునాథ నాయ‌క యువ‌రాజు ర‌థ‌మెక్కి, రాజ‌కోట‌లోనికి పోయి, యువ‌రాజు న‌గ‌రికి చేరినాడు. శ్రీ ర‌ఘునాథ‌నాయ‌క మ‌హాప్ర‌భువు తండ్రికి ఏకైక పుత్రుడు. అచ్యుత నాయ‌నింవారికి ఎంత‌కాల‌మో సంతాన‌ము క‌లుగ‌లేదు. ఆయ‌న గోవింద‌మంత్రిక‌డ సంతాన గోపాల మంత్రోపాస‌న పొంది, మంత్రాక్ష‌ర ల‌క్ష‌లు జ‌పించి, గోదాన‌, అగ్ర‌హార‌దాన‌, హిర‌ణ్య‌దాన‌, న‌వ‌రాత్న‌దాన‌, ధాన్య ధ‌నాది స‌ర్వ‌దానాలు ల‌క్ష‌గోసాయీల‌కూ, ల‌క్ష బ్రాహ్మ‌ణ్యానికీ భూరి సంభావ‌న‌ల‌తో భోజ‌నాలు పెట్టి, మ‌హోత్స‌వంతో, అగ్ని హోత్రాదుల‌తో జ‌పం ముగించినారు. నాగ‌ప్ర‌తిష్ఠ చేయించినారు. రామేశ్వ‌రాది స‌ర్వ‌తీర్ధ సం సేవ‌న‌మూ చేసినారు.

ఆ వెన‌క ఒక శుభ ముహూర్తంలో ప‌ట్ట‌పురాణి మూర్తిమాంబాదేవి గ‌ర్భం తాల్చిన‌దాయెను. స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌లు, పురాణ కాల‌క్షేపాదులు, బ్రాహ్మ‌ణార్చ‌న‌లు, పూజ‌లు, పున‌స్కారాలు మూర్తిమాంబాదేవి ప్ర‌స‌వ‌మ‌య్యేవ‌ర‌కూ జరుగుతూనే వుండిన‌వాయెను.

అప్పుడు శ్రీ శాలివాహ‌న శ‌తాబ్దాలు 1496న‌, చాంద్ర‌మాన శ్రీ‌ముఖ సంవ‌త్స‌ర‌, చైత్ర‌శుద్ధ పంచ‌మీ శ‌నివారం, ఉద‌యాది ప‌ద‌మూడు ఘ‌డియ‌ల ఇదువ‌ది రెండు విఘ‌డియ‌ల శుభ‌ముహూర్తంలో, రోహిణీయుక్త క‌ర్కాట‌క ల‌గ్న‌మందు, తృతీయ‌మందు రాహువూ, పంచ‌మ‌మందు గురువూ, స‌ప్త‌మ మందు శ‌నీ, భాగ్య‌మందు శుక్ర‌వ‌కేతువులూ, ద‌శ‌మ‌మందు ర‌వి, కుజ‌, బుధులూ ఏకాద‌శ‌మందు చంద్రుడూ ఉండ‌గా, శుక్ర‌ ర‌విచంద్రులు ఉచ్ఛ‌స్థులై యుండ‌గా, ల‌గ్నాన్ని గురు కుజ శ‌నులు చూస్తూ ఉండ‌గా, ధ‌వ‌ళ సౌవ‌ర్ణ‌. క‌మ‌ల‌రాగ మిశ్రిత దేహ‌వ‌ర్ణం క‌ల‌వాడును, తేనె ప‌న‌స తొన‌ల తొడ‌ల ముడుత‌లు క‌ల‌వాడుపూ, ఒత్త‌యిన న‌ల్ల‌టి జుట్టు క‌ల‌వాడును. ముద్దుల మూట పారిజాత పూవుల‌ప్రోవు, బంగారురాసి, ర‌త్న‌పేటిక, నెల వెలుగుమూర్తి బాల‌కుడు ర‌ఘునాథుడు ఉద్భ‌వించినాడు.

తంజ‌పురిలో, చోళ‌దేశం యావ‌త్తూ, విద్యాన‌గ‌ర సామ్రాజ్యం స‌ర్వ‌మూ, మ‌హాపురాల న‌గ‌రాల, ప‌ట్ట‌ణాల, దివ్య‌క్షేత్రాల, ప‌ల్లెల‌, అగ్ర‌హారాల‌, వాడ‌వాడ‌ల మ‌హోత్స‌వాలు జరిగిన‌వి. చోళ మ‌హారాజు చిన‌చెవ్వ‌ప్ప నాయ‌నింవారి, యువ‌రాజు అచ్యుత నాయ‌నింవారి ఆనందం వ‌ర్ణించ‌డానికి వాల్మీకి అవ‌తారం తాల్చ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. కాళిదాస భ‌వ‌భూతులు నూత్న‌కావ్యాలు ర‌చింప‌వ‌ల‌సిన‌దే !

దిన‌దిన ప్ర‌వ‌ర్ధ‌మానుడైన ర‌ఘునాథుని శిశుక్రీడ‌లూ, ముచ్చ‌ట్లూ, శ్రీ దాశ‌ర‌ధియైన శ్రీ రామ‌చంద్రుని చిన్న‌నాటి వ‌ర్ణాల‌కు పోల్చ‌ద‌గిన‌వి శ్రీ కృష్ణ ప‌ర‌మాత్మ శిశుక్రీడ‌ల‌కే దీటువ‌స్తున్న‌వి. తాత‌గారు ఆ చిన్నారి మ‌నుమ‌ని వ‌ద‌లి ఉండ‌లేరు. అచ్యుత నాయనింవారూ, గోవింద‌మ‌ఖీ ర‌ఘునాథ ప్ర‌భువు జాత‌కం పరిశీలించారు.

ప్ర‌భూ ! ఈ బాలుడు అవ‌తారం తాల్చిన దాశ‌ర‌ధి

శ‌ని స‌ప్త‌మందు ఉండి ల‌గ్నాన్ని వీక్ష‌ణ చేస్తున్నాడు.

స‌ప్త‌మ కేంద్రాధిప‌తి శ‌ని ప‌ర‌మ‌శుభుడు, ఆయ‌న లగ్నాన్ని చూడ‌టం ప‌ర‌మ‌యోగం, మ‌హాప్ర‌భూ !

అష్ట‌మాధిప‌తి అష్ట‌మానికి వ్య‌యంలో ప‌డినాడు క‌దా !

అందుక‌నే ప్ర‌భువుల‌న‌కు మ‌ధ్య మాయుర్దాయ‌ము. అంటే డెబ్బ‌దిలోపు అని మ‌న‌వి చేసుకుంటున్నాను. ఇంకా త‌గ్గిపోవ‌ల‌సిందేకాని అష్ట మాధిప‌తి శ‌నికావ‌ల‌డం వ‌ల్ల‌, స‌ప్త‌మాధిప‌తి స‌ప్త‌మ మందుండ‌టంవ‌ల్ల అర‌వై ఏళ్ళుపైన ఉంటుంద‌న్న విష‌యం నిశ్చ‌యం, మ‌హారాజా !

ఇంత‌లో చిన చెవ్వ‌ప్ప నాయ‌నిం వారు తాము జాత‌క విచార‌ణ‌కై వ‌స్తున్నామ‌ని వార్త పంపినారు. ఇంత‌లో వృద్ధ మ‌హారాజు అక్క‌డ‌కు వ‌చ్చినారు. గోవింద దీక్షితుల‌వారూ, అచ్యుత నాయ‌నింవారూ లేచి నిలుచుండినారు.