చెవ్వప్ప నాయనింవారు రాగానే మంచి యవ్వనంలో బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లే గోవింద దీక్షితులకు నమస్కరించగా, ఆ మంత్రి , దీర్ఘాయుష్మాన్‌భవ మహారాజ యోగ సిద్ధిరస్తు. దివ్యలోక ప్రాప్తిరస్తు, సర్వ భూమండల విలసిత సత్కీర్తి సంప్రాప్తిరస్తు అని చేయెత్తిదీవించి, జయతు జయతు మహారాజన్ అని జయము పలికినారు. అచ్యుత నాయనింవారు తండ్రిగారి పాదాలకు వంగి నమస్కరించినారు.
చిన చెవ్వప్ప నాయనింవారు భీష్మునివలె తెల్లవిజుట్టుతో, అంత వృద్ధాప్యంలోనూ చెక్కుచెదరని చేవగల చెట్టువలే వచ్చినారు. కొమరుని ఆశీర్వదించి, చిరునవవ్వుతో సింహాసనము అధివసించి, అమాత్యునీ, పుత్రుని కూర్చుండమని సైగచేసి, అచ్చట జాతక చక్రంతో ఉన్న ఫలకము, చేత తీసుకొని పరిశీలిస్తూ, లగ్నాధిపతి ఏకాదశయందు ఉచ్ఛస్థుడై ఉండటము చక్రవర్తి లక్షణము. ఉచ్ఛస్తుడైన రవి దశమమందు విక్రమకారకుడు. దశమాధిపతి అయిన కుజునితో వ్యయాధిపతి బుధునితో కలిసి ఉండటము అఖండ యోగం లాభ చతుర్ధాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉచ్ఛస్థుడై ఉండటము, కేతువుతో కలిసి ఉండగా బృహస్పతి శుక్ర కేతువులను చూచుచుండుట వలన సంగీత, నాట్య, కావ్య, మహా పాండిత్యమూ, మహా భోగమూ తెలియజేస్తుంది. విక్రమస్థానంలో రాహువు ఫరంగీలను పారశీకులను జయించడం, తద్వారా మహాకీర్తి సముపార్జనమూ సువ్యక్తం అవుతున్నది. షష్టాధిపతియైన గురువు తన స్థానానికి వ్యయంలో ఉండడం, బలవంతులైన విరోధులను పూర్తిగా పరాభవించడం ప్రత్యక్షమౌతుంది.
ఇంక అష్టమాధిపతి సప్తమాన్నుంచి లగ్నాన్ని చూడడం చక్రకవర్తిత్వ యోగ భంగం. సప్తమాధిపతి శని సప్తమంలో ఉండబం బహుభార్యత్వమూ, దక్షిణ నాయకత్వమూ సూచిస్తున్నది. మేము సరిగా తెల్నినామా దీక్షితులవారూ ! అని తలయెత్తి గోవిందముఖిని నవ్వుతూ పృచ్ఛచేసినారు.
గోవింద : మహాప్రభువులు మహాప్రజతో రాజకుమారుల జాతకానికి భవిష్యత్తు తెలిపినారు. ఇంకొక చిన్న విషయం. పంచమలాభమందున్న గురుచంద్రులు పరస్పర దృష్టి మూలంగానూ, ఉచ్ఛస్థుడైన లగ్నాధిపతిని బృహస్పతి చూచుటవల్లనూ సర్వకళా ప్రావీణ్యతను, సద్భుద్ధిని, మంత్రసిద్ధిని సూచిస్తాయి.
అచ్యుత : మహాప్రభూ ! తాము సెలవు దయచేసినవన్నీ సత్యాలు కాని, శైశవగండాలు శని చూపువల్ల సూచితమవుతున్నవని నామనవి.
చిన చెవ్వప్ప : ప్రభూ ! అది అసవసర భయమని మా నమ్మకం. స్వస్థానంలో నుంచి చూచిన ఏ గ్రహూ అపకారం చేయలేదు.
అచ్యుత : చిత్తం ! చిత్తం !
గోవింద : మహాప్రభువులు సెలవిచ్చినది సంపూర్ణ సత్యం. శాస్త్రమూ అనుభవమూ రెండూ ఈ విషయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాయి.
ఇంత ఉత్తమ జాతకుడైన రఘునాథుని శైశవ క్రీడలు దినదినానంద దాయకాలై తాత, తండ్రి, తల్లి, నాయనమ్మల హృదయూలను ఉప్పొంగ జేయుదచున్నవి. మూడవ ఏట అక్షరాభ్యాసమైనది రఘునాథ ప్రభువునకు. మహావేగంతో సర్వ శాస్త్రాలు నేర్చుకుంటున్నారు చిన్నతనంలోనే కత్తిసాము, ముష్ఠియుద్ధము, మల్లయుద్ధము, ధనుర్యుద్ధము, బందూకుయుద్ధము, అగ్నిగుండ్ల యుద్ధము, గుఱ్ఱపుస్వారి, యేనుగును నడుపుట మోహరము దీర్చుట. ఎదిరివాని హృదయము గ్రహించుట. కోట ముట్టడించుట, జలయాన సమర నిర్వహణము, సైన్యాల తాకుట ! ఎదిరించుట సంరక్షించుట, మొదలగు సర్వసమర ప్రయోగాలూ నేర్చుకొన్నాడా రాజకుమారుడు.
రఘునాథ నాయకునికి ఆరవ ఏడు వచ్చినప్పుడు తాతాగారు చినచెవ్వప్ప నాయనింవారు శ్రీకృష్ణున్ని సన్నిధానం చేరినారు. ఎనబడి ఒకటవ సంవత్సరంలో వృద్ధ ప్రభువు స్వచ్ఛందమరణియై కొమరుని, మనుమని, కోడళ్ళను ఆశీర్వదించి, గోవింద దీక్షితులకూ, కులగురువులగు తాతాచార్యుల వారికీ నమస్కరించి, శ్రీ రంగేశా అనే పరమ నామమును ఉచ్ఛరిస్తూ ప్రాణం వదలినారు.
శ్రీ అచ్యుత నాయనింవారు పితృయజ్ఞము చేసి, మహావైభవముగా కర్మలు నిర్వహించారు. ఆరేళ్ళ చిన్నవాడైన రఘునాథ ప్రభువు కొన్ని వారాల వరకూ మతిపోయిన వానిలా ఉన్నారు. అక్కడ నుండి చదువులలో మునిగిపోయి ఇతర ప్రపంచము మరచిపోయారు. రఘునాథ ప్రభువులకు పదహారవ ఏడు వచ్చేసరికే సర్వవిద్యా పారంగుతులయారు. ఆయన మేధ, మేధా సంపన్నులలో బృహస్పతికి పాఠాలు చెప్పె గోవింద మంత్రి సత్తమునకె అపరిమితాశ్యర్యానందాలను జనింపచేసినది. |