రఘునాథ ప్రభువు తన మేనమామగారి ప్రణయపుత్రిక, మరకతవల్లీ తనయను శుకవాణినే ఆ దినమల్లా తలచుకొంటూ ఉన్నారు. తన పట్టమహిషిని అందానికై వరించి ఉద్వాహమాడినారు. తన రెండవ భార్య రామభద్రాంబను ఆమె వైదుష్యానికి మెచ్చుకొని ఆమెను కరగ్రహణం కావించుకొన్నారు. ఇప్పుడు విజయలక్ష్మిని తన బాలిక లక్ష్మీరూపంలో తుండీప్రభువు కృష్ణప్ప నాయనింవారు అర్పించినారు. ఈ అందరిలోనున్న అన్ని దివ్య శుభలక్షణాలూ శుకవాణిలో గోచరిస్తూ ఉన్నవి.
పురుషులు దక్షిణ నాయకులు. పురుషులలో ఏకపత్నీ వ్రతులు మేరుశృంగాల వంటివారు. స్త్రీలలో ప్రాతివ్రత్యము సాధారణ దివ్యభావము. పురుషులలో బహు స్త్రీ వాంఛ తప్పిదము కాదు. పరస్త్రీ వాంఛ ఒక్కటే దోషమట. స్త్రీ పురుష ప్రకృతి పరిశీలనా దక్షులైన మహర్షులు ధర్మసూత్రాలు కాలానుసారన్యాయేణ విధించి ఉన్నారు. జాత్యాభివృద్ధి మోక్ష దాయకము కానివాడు పున్నామ నరకము. ఒక్క మూలాధారాన్నుండి బహుశక్తులు ఉద్భవించినట్లు, పురుషులనకు బహు స్త్రీ సంగమవాంఛ ధర్మబద్ధమైనది. ఆధారము అగ్ని అయితే ఉష్ణము, కాంతి, బూదిసేయుటలు వివిధ శక్తులయినాయు.
యువకుడై ఇరువది నాలుగు వర్షాల ప్రాయంవాడైన రఘునాథ ప్రభువునకు ఏమీ తోచినిదికాదు. తన మహానగరు చేరగానే మరల స్నానం చేసి, పూజామందిరంలో శ్రీరంగనాధ రామభద్ర దేవులకు కుత గురువులగు శ్రీకృష్ణదేవరాయల గురువు తాతాచార్య వంశీకుడైన రామానుజాచార్యులు మంత్రం చెబుతూ ఉండగా షోడశోపచార యుక్తమైన పూజచేసి, ధ్యానించి, మహానై వేద్యమిచ్చి, వేయిమంది బ్రామ్మణ్యానికి, వెయ్యిమంది సన్యాసులకూ, స్వయంపాకాలూ షోడశదానాలూ ఇచ్చి, బంధుమిత్రాదులతో భోజనాదికాలు నిర్వహించినారు.
ఒక్కొక్కదినాన ఆ యువకప్రభువు ఒక్కొక్క దేవేరి ప్రాసాదానికి భోజనానికి వేంచేసేవారు. తమ దేవిడీలోనే భోంచేస్తే యువరాణులందరూ తాంబూలానికి రావలసి ఉండెను.
ఆ దినాన యువరాజు భోజనం సమాప్తమైనది. ఆయన తాంబూల గృహానికి వేంచేసే ముందరే యువరాణులు ముగ్గురూ మూడు ఆసనాలలో కూర్చుండి మాటలాడుకొంటున్నారు. యువరాజావారి పూజ పూర్తికాగానే భగవత్ ప్రసాదము ముగ్గురు యువరాణుల ప్రాసాదాలకు బ్రాహ్మణులు తీసుకువస్తారు. తరువాత వంట బ్రాహ్మణుడొకడు వచ్చి, ప్రభువులవారు భోజనం ప్రారంభించినారు అని మనవి చేస్తాడు. ఆ వెనుక వీరి ప్రాసాదంలో వారు బంగారు పళ్ళెరాల వడ్డించిన భోజనం ముందు కూర్చుంటారు. వారిలోబాటు ఆ దినానికి విందుకై పిలిచిన బందుగుల ఆడవాండ్రుడగాని, సేనాపతుల సామంతుల భార్యలు బిడ్డలు ఆయా యువరాణులతో విందులు ఆరగిస్తారు.
దినదినమూ మహారాణులు, యువరాణులు, రాజకుమారికలు ముత్తయిదువులకు బ్రాహ్మణ భోజన శాలలో విందులిస్తారు. మహలక్ష్మి పూజలు చేసుకొని స్వర్ణాభరణాదులు దానాలు వాయినాలు ఇస్తారు. యువరాణులు భోజనాలు కాగానే తమ తమ నగరులనుండి యువరాజు నగరిలోనికి వేం చేస్తారు.
కళావతి యువరాణి : ఏమమ్మా, లక్ష్మమ్మ చెల్లెలుగారూ ! తంజపురి ఎలా ఉందంటారు ?
మీ జింజినగరం అందంగా ఉందంటారా ? తంజపురా ?
రామభద్రాంబ : అక్కగారూ ! చెల్లెలుగారు తంజపురిని ప్రేమిస్తున్నట్లే వారి మోమున వికాసం తెలుపుటలేదా ?
లక్ష్మిదేవి : (చిరునవ్వుతో ) పెద్ద అక్కగారూ ! తంజావూరు అంతా నాకింకా తాము చూపించినారు కారు.
రామ : మా చెల్లలుగారు మన్నారు క్షేత్రంపోయి స్వామిని దర్శించి వచ్చినారు.
కళా : మన్నారుస్వామి ఎంత అందమైనవాడు !
రామ : మన్నారుస్వామి అల్లరివాడు, కొంటెవాడు.
అతడు క్రీగంట చూపుల హాస్యమాడు,
నర్మకేళిలోనె సఖుల నవ్వులాడు,
పూలచెండుల ఆటల మేలమడు,
అల్లరి చిన్నవాడుగద ఆ నల్లవాడు. |