3
 

 

సోమ‌సుత‌, సూర్య‌సుత‌, క‌ధ‌లు కూడా యోగ ప్ర‌తీకాత్మ‌క మైన‌వే. సోమ‌సుత లో ఈ ఛాయ‌లు ఛాయా మాత్రంగా గోచిరించినా, సూర్య‌సుత‌లో మాత్రం ప్ర‌స్ఫుటంగానే క‌న్పిస్తాయి. ఓ సోమ‌సుతా ! నువ్వు నా ప్రియురాలివి ! నీ కోసం దేశ‌దేశాల‌న్నీ వెదుకుతూ ఉన్నాను అంటారు. శ్రీ బాపిరాజు శ‌శిక‌ళారాధుకులు ఏడంత‌స్థుల మేడ మీద త‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు క‌న్పించార‌ట ! ఇద్ద‌రూ ఒక‌టేనంటారు. ఒక‌రు సూర్య‌సుత‌, ఒక‌రు సోమ‌సుత‌, ఈ రెండు క‌థ‌లూ ఉత్త‌మ పురుష‌లోనే చెప్ప‌బ‌డిన‌వి.

ఒకనాడు, క‌ధానాయకుడు ప్ర‌యాగ‌లో త్రివేణీ సంగమం క‌డ‌కు పోయి, నీటిలో ఉరికి, ఎంతోసేపు ఈదుకుంటూ, లో లోతుల‌కు పోతాడు. అక్క‌డ ఆలోతుల్లో ఏవో కాంతి రేఖ‌లు పుంజాలు పుంజాలుగా అత‌న్ని చుట్టుముట్టాయి. అవ‌ల‌యాల్లో భ‌యంతో ఊపిరాడ‌క బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాడు. స్నేహితులు అత‌ని కోసం కంగారుప‌డి, ఇక‌రాడ‌ని ఆశ‌లు వ‌దిలేసుకుంటారు. త‌రువాత స్నానంచేసి బ‌స‌కు తిరిగి వ‌స్తారు. కాని ఇత‌నిని మాత్రం పూర్వాను భ‌వం నిలువ‌నీయ‌దు. మ‌ళ్ళీ ఆ బంగారు వ‌ల‌యాల కోసం సంగ‌మ స్థానానికి వెడ‌తాడు. అంత‌ర్వాహినియైన స‌ర‌స్వ‌తీ న‌దిని వెద‌కి ప‌ట్టుకోవాల‌న్న‌దీత‌నికాంక్ష ! మ‌ళ్ళీ నీటిలో ఈద‌డం మొద‌లుపెడ‌తాడు. ఇంత‌లో అచ‌టికి ఒక బాలిక ఈదుకూంటూ వ‌చ్చింది.ఆమెవి బంగారు తీగ‌ల వంటి చేతులు. ఆమె ఇత‌నిని చేసైగ చేసి పిలిచిన‌ది. ఆమె బాల‌భాను బింబంలా మెరిసిపోతోంది. ఆ బాలిక త‌న‌కు భాష‌ల‌న్నీ వ‌చ్చునంటుంది. తాను సూర్య‌దేవుని కూతుర్ని అంటుంది. నీ కోరిక నాకు తెలుసు. నువ్వు స‌ర‌స్వ‌తిని చూడాల‌ని వ‌చ్చావు క‌దా అంటుంది. త‌న‌తో వ‌స్తే స‌ర‌స్వ‌తిని చూపిస్తానంటుంది. య‌మున మా అక్క అంటుంది. ఇత‌ని చేయిప‌ట్టుకొని నీటిలోతుల్లోకి దిగిపోయింది. ఆమె చుట్టూ వివిధ వ‌ర్ణాల వెలుగులు. ఆమె చేయితాక‌గానే అత‌నికి ఒడ‌లంతా విద్యుత్ర్ప‌వాహం తాకిన‌ట్లు, అత్యంత శీత‌ల‌మో, అత్యంత ఉష్ణ‌మో, చెప్ప‌రాని మ‌హాభావాన్ని అత‌డు పొందుతాడు. ఆమె అత‌ని ఫాల‌మును స్పృశిస్తుంది. ఆమె అత‌నికొక నీలిక‌లువ‌ను బ‌హుక‌రిస్తుంది. అది వాడ‌కుండా, అత‌నివ‌ద్ద మిగిలి పోయింది. ఈ నీలి క‌లువ‌నొక్క దానిని మిన‌హాయిస్తే, ఈ గాధంతా ర‌చ‌యిత స్వ‌యంగా అనుభ‌వించిన దానిని డైరీలో వ్రాసుకొన్న‌ట్లుగానో, లేక ఆత్మ క‌థ‌ను చెప్తున్న‌ట్లుగానో అన్పించ‌క మాన‌దు. ఉత్త‌మ పురుష‌లో క‌థ సాగ‌డంతో ఈ అనుమానం మ‌రింత బ‌లీయంగా క‌ల్గుతుంది.

ఈ సూర్య‌సుత ఆసోమ‌సుత ఇద్ద‌రూ ఇత‌నికి ప్రియ‌మైన‌వారే కానీ స‌ర‌స్వ‌తిని చూడాల‌న్న‌ది గాఢ కాంక్ష . ఆ కాంక్ష సూర్య‌సుత‌కు తెలుస్తుంది. ఆమె అత‌నికి స‌ర‌స్వ‌తీ ద‌ర్శ‌నం చేయించాల‌నుకొంటుంది.

ఈ క‌థ‌ను యోగ‌ప‌రంగా అన్వ‌యించ‌వ‌చ్చు. సూర్య‌సుత‌, చంద్ర‌సుత‌, స‌ర‌స్వ‌తి ఈ మూడున్నూ ఇడ‌, పెంగ‌ళి, సుషుమ్న అనే మూడు ముఖ్యానాడులు, వీనినే సూర్య‌నాడి, చంద్ర‌నాడి, సుషుమ్న‌నాడి, అని కూడా పిలుస్తారు. ఈ మూడున్నూ సూక్ష్మ దేహంలోని అనేక చ‌క్రాల‌లో క‌లిసి ప్రయాణం చేస్తాయి. అజ్ఞా చ‌క్రంలో వీటి కూడ‌లితో సాధ‌కున‌కు ఒక గొప్ప అనుభ‌వం క‌లుగుతుంది. శ‌రీర‌మునందు డెబ్బ‌ది రెండువేల‌నాడులు గ‌ల‌వు. మూలాధార‌చ‌క్ర‌ము నుండి స‌హ‌స్ర్రాచార చ‌క్ర‌ము వ‌ర‌కు ఈడులు వ్యాపించి యున్న‌వి ఇడా పింగ‌ళ‌నాడులు నేత్రాంచ‌ల‌ముల వ‌ర‌కు వ్యాపించి ఆచ‌ట చ‌క్రాంత మ‌ధ్య‌మున‌నున్న బ్ర‌హ్మ‌నాడి లేక స‌ర‌స్వ‌తినాడితో (ఇడా పింగ‌ళ సుషుమ్న‌లు) క‌లిసిన‌ప్పుడు త్రివేణీ సంగ‌మ ద‌ర్శ‌నం అంత‌ర్ధ్ర‌ష్టికే గోచ‌రం సూర్య‌త‌న‌య‌ను తాకిన‌పుడు శ‌రీరంలో విద్యుత్ ప్ర‌వ‌హించిన‌ద‌న‌డం, సాధ‌న‌లో యాదార్థ‌మై విష‌యం సూర్య‌నాడి ఉష్ణ‌వాహ‌కం. చంద్ర‌నాడి శీత‌ల‌వాహ‌కం. అందుక‌నే అత‌నికి మ‌హా ఉష్ణ‌మూ, మ‌హాశీత‌ల‌మూ అనుభూత‌మైన‌వి. ఆమె హిర‌ణ్మ‌య స్వ‌రూపిణి. స్వ‌ర్ణ‌కాంతుల‌తో ఒరిసిపోతూ, బంగారు చేప‌లా క‌ద‌లాడిందంటారు ! చేప త్వ‌రితంగా నీటిలో విస్త‌రించేజీవి. నాడీ చ‌ల‌నంకూడా అమిత వేగంగా జ‌రిగింద‌న‌డం ఇక్క‌డ ధ్వ‌నిస్తోంది. ఆమె వేణీధ‌రం చుట్టూ వివిధ వ‌ర్ణాలు వేణిన‌లుపు, సూర్య‌మండ‌ల మ‌ధ్య‌వ‌ర్తియ‌గు ప్రాణ‌శ‌క్తి, ప్ర‌వాహ రూప‌మున‌, చ‌క్రాల‌లో ప్ర‌వేశిస్తుంది. ఈ చ‌క్రాల‌లో వివిధ వ‌ర్ణాలేర్ప‌డ‌తాయి. ప్రాణ కిర‌ణ‌మందు అరుణ‌, నీల‌, హ‌రిత‌, పీత‌, పింగ‌ళ‌, లోహిత‌, పాట‌ల అనే యేడు వ‌ర్ణాలున్న‌వి. ఈ వ‌ర్ణాల‌నే అత‌డు చూచింది. అత‌డు మ‌ర‌ల మ‌ర‌ల చూడ‌ద‌ల‌చిన బంగ‌రు వ‌ల‌యాలు చ‌క్ర‌భ్ర‌మ‌ణ జ‌నిత‌ములైన దివ్య‌కాంతులే. భ్రుకుటి మ‌ధ్యాన‌, ఆజ్ఞాచ‌క్రంలో సూర్య‌చంద్ర‌నాడులు బ్ర‌హ్మ‌నాడితో క‌లిసే ప‌ర‌మ దివ్య సంఘ‌ట‌న‌ను సోమ‌సుత క‌థ‌లో అల‌వోక‌గా ర‌చ‌యిత వ‌ర్ణించారు. అదంతా క‌లా, అనుకుంటారు. నా ప్రాణాలు భౌతికంగా వ‌దిలానా ? అనుకుంటారు.

య‌మునాదేవి కూర్మ‌వాహిని అంటారు. నాలుక‌కు అడుగున‌, కంఠ‌కూపమున‌, ఉండే కూర్మనాడి యందు సంయ‌మ‌ము చేసిన సాధ‌కుడు ఆక‌లి ద‌ప్పుల‌ను జయించి, ధైర్య‌వంతుగున‌నేది, ప‌తంజ‌లి యోగ శాస్త్రంలో ఉంది. ఇచ‌ట య‌మునాన‌ది కూర్మ వాహినియై శ్రీ బాపిరాజుకు గోచ‌రించింది. ఈత‌ని క‌ళాత‌ప‌స్సుకే తాను సంత‌సించానంటుంది. మ‌న ఇద్ద‌రికీ సంయోగ మెలా సంభ‌వ‌మైంది ? దేహంలో నేనున్నాను. దేహానికావ‌ల‌సి నీవున్నావు అంటారు అర‌వింద‌యోగి. ఈ ష‌ట్చ‌క్రాదులు స్థూల దేహము లోన‌లేవు. స్థూల దేహ‌మును చుట్టి యొక విధ‌మైన పొగ‌వంటి బూడిద‌రంగు గ‌ల య‌వ‌ర‌ణ‌మున్న‌ది. ఈ యావ‌ర‌ణ‌లో చ‌క్ర‌ముల‌న్న‌వంటారు.

ర‌చ‌యిత కూడా సూర్య‌నాడిని దేహానికవ‌త‌లే చూచామ‌న‌డం విచిత్ర‌మ‌నిపిస్తుంది.

చిన్న‌త‌నంనుంచి వెన్నెల‌బాల‌ను ప్రేమించాను. ఇపుడీ సూర్య‌సుత ప్ర‌త్య‌క్ష‌మైన‌దేమిటి ! అని, ర‌చ‌యిత‌, ఆశ్చ‌ర్య‌పోతారు. ఆమె అగ్నిస్వ‌రూపిణి ! ఆనంద‌మూర్తి ! ఆమెకై అత‌ని త‌ప‌స్సు, ఆమెరాక‌కై అత‌ని సాధ‌న‌, అత‌ని వేద‌న‌, ఆమె త‌న స‌ర్వ‌స్వం లాగుకొందంటారు. ఫాల‌ముమీద ముద్దు పెట్టుకొంద‌ట‌. అంటే, ఆహం (తాను) న‌శించిన‌ట్లే. ఫాలం మీద ముగ్గురు నాడీదేవ‌త‌ల క‌ల‌యిక‌తో జ్ఞాన‌నేత్రం విచ్చుకొన్న‌ది. అప్పుడు మ‌హాజ్యోతి సాధ‌కుని అంత‌ర్ధ్ర‌ష్టికి గోచ‌ర‌మ‌యిన‌ది. కోటి వెలుగులు ద్యోత‌క‌మైనాయి. క‌ళా ప‌ర‌మావ‌ధికోసం త‌న నిరంత‌ర అన్వేష‌ణ అంటారు. ల‌లిత క‌ళ‌ల‌ద్వారా చిత్క‌ళ‌ను పొంద‌టం కోసం ఎన్ని సంవ‌త్స‌రాల‌నుండో, ఎక్క‌డెక్క‌డో వెదికారు. చివ‌రికా సూర్య సోమ‌సుత‌లు క‌రుణించారు.

మ‌ళ్ళీ మ‌ళ్ళీ అనుభ‌వం కోసం అఱ్ఱులు చాస్తూ ఎదురుచూస్తూంటారు. వేడి నిట్టూర్పులూ, విర‌హాలూ అయినాక మ‌ళ్లీ ఇంకోమారు ఆ క‌న్య‌, యెగ‌క‌న్య‌, ద‌ర్శ‌న‌మిచ్చింది. నీలో అనుమానం ప్ర‌వేశించింది. అందుకే మాయ‌మ‌య్యానంటుంది. నువ్వు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చావో చూసుకో, నీ పూర్వం ఏమిటో తెలుసుకో అంటుంది. భూత‌కాలాన్ని మార్గ‌ద‌ర్శకంగా చూసుకొంటూ భూత భ‌విష్యాల‌కు వ‌ర్త‌మానంతోఆన‌క‌ట్ట నిర్మించ‌మంటుంది. ఈ వెనుక ముందులు సంసార చ‌క్ర‌భ్ర‌మ‌ణానికి సంతేకాలు. వెనుక జ‌న్మ‌లో ఏం చేసావో దాంతోనే తృప్తి ప‌డ‌క‌ముందు జ‌న్మ‌కోసం మ‌రింత కృషిచేయ‌మ‌న్న ఉద్బోద ఇందులో గ‌ర్భిత‌మైన‌ది. నీకు ల‌భించిన దానితో తృప్తి ప‌డ‌క మ‌రింత సాధ‌న చేయ‌మంటుంది. సాధ‌కుడు ఆజ్ఞాచ‌క్రం వ‌ర‌కే వ‌చ్చాక‌, ఆ అనుభ‌వాన్నిమించిన అనుభ‌వం పొంద‌మంటుంది. నాకు ప్రేమ వ‌ప్ప మ‌రేం చేత‌కాదంటాడు. ఈ ప్రేమ అనే ఇచ్ఛాశ‌క్తి ప‌విత్రార్చ‌న‌లో యుగాలుండిపోతాను అంటాడు ముందుకు పోవ‌డ‌మో, వెనుక‌కు రావ‌డ‌మో, ఆమె కృప‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఫాల స్ప‌ర్శ‌తోనే నేనూ నీవూ ఏక‌మైనాము కాదా ! అంటాడు. చివ‌ర‌కు సుధాక‌ల‌శం ల‌భ్య‌మైంది స‌హ‌స్రార ప‌రిస్థంలోన్నూ అమృత‌ధార ల‌భించింది. స‌హ‌స్రారాంబుజారూఢా సుధాసారాభి వ‌ర్షిణి అన్న‌ట్లుగా ప‌ర‌మేశ్వ‌రి యొక్క కృప సంపూర్ణంగా ల‌భ్య‌మైన‌ద‌ని ధ్వ‌ని.