ఈమె కోసమే సీతారామయ్య వద్ద సంగీతం నేర్చుకొంటున్న కామేశ్వరావనే బ్రాహ్మణ యువకుడు ఆమెకు ప్రపంచంలోని విషయాలెన్నింటినో నేర్పి, ఆమెకు ప్రపంచంలోని విషయాలెన్నింటినో నేర్పి ఆమెకు దగ్గరవాడౌతాడు.
సంగీతం నేర్చుకోడం పూర్తయిన తరువాత మీనాక్షి మళ్ళీ తోలుబొమ్మలాటలో పాత్ర తీసుకోలేకపోతుంది. ఆమె గొంతువిప్పి పాడలేకపోతుంది. మళ్ళీ ఆ అనాగరక ప్రపంచంలోకి వచ్చిపడ్డందుకు ఆమెకు రోతకల్గుతుంది. కామేశ్వరరావు ఆమెకోసం వారిలోకి వచ్చి ఆమె చేత గాత్రకచేరీలు చేయిస్తాడు. ఆధునిక కళారీతులలో తోలుబొమ్మలాటని కళామయ ప్రపంచంగా తీర్చిదిద్దుతాడు అయినా ఆ ప్రపంచంలోకి దిగడానికి మీనాక్షి మనస్సందికరించదు.
ఆ గాడిదల వాసనా, చెమటతో, ఏళ్ళ తరబడి నాని ఎండిన మురికగుడ్డలకంపూ భరించడం శక్యంలేకుండా పోతుంది. నాగరికమైన బతుకున కలవాటు పడ్డ మీనాక్షి మళ్ళీ ఆనాగరికంలోనికి పోనిచ్చగించదు. వాళ్ళకులంలో వాణ్ణి ఆమె పెళ్ళి చేసుకోదేమోనన్న అనుమానం వాళ్ళకి కల్గింది.
కామేశ్వరరావు తన ప్రేమ నామెకడ వెల్లడిస్తాడు తాను కుటుంబాన్ని, కులాన్ని, సంఘాన్నీ అన్నీ ఆమె కోసం వదలి ఆమె దివ్య ప్రేమామృతంలో పునీతుడసౌతానంటాడు.
ఇరువురూ దంపతులౌతారు. ప్రేమకు ఎల్లలులేవు అని, ఎన్నో అవధులను అధిగమించి ఋజువు చేస్తారు మీనాక్షి కామేశ్వరరావులు. ఒక అట్టడుగు వర్ణానికి చెందిన పిల్లను తీసికొనివచ్చి విద్వాంసురాలినిచేసి వారధిని నిర్మిస్తాడు సీతారమయ్య.
ఈ కథలో సంగీతకళ చిత్రకళ మొదలైన ఎన్నో కళలకు సమాహారమైన తోలుబొమ్మలాట ను గూర్చి సవివరంగా రచయిత చర్చించారు.
వీణ కథలో వీణావాదన కళను వర్ణిస్తారు. రచయిత కధానాయకుడైన ఆనందమూర్తిని రచయిత సంభోదిస్తూ అతని సంగతి అతనికే చెపుతారు. ఇదొక చిత్రప్రక్రియ. ఆనందమూర్తీ ! నీ యశము దేశదేశాల వెలిగిపోయినది. మహారాజులు నిన్ను రప్పించుకొన్నారు. కళాద్రష్టులు నీ పాటలో తిస్రరేఫువులైపోయినారు, అంటారు. ఈ ఆనందమూర్తి వీణావాదనంలో మహా నైపుణ్యతకలవాడు. పండితులను సహితం తన విద్వత్తుతో రంజింప చేయగలడు. తీగలు సారించి, శృతిచేసి, భారతీదేవిని ప్రార్థించి, వీణ మీటడం మొదలుపెడితే సభయావత్తూ మంత్ర ముగ్థంగా అయిపోతుంది. దివ్యనాదము మహాస్వర ప్రసారము, స్వరగతులు, విచిత్ర తాళసృష్టి మూర్ఛనలు పోతూ ఉత్తుంగతరంగాలై ఆనందరసం పొంగులెత్తుతూంటే శ్రోతలు తలమునకలు కాగా తన్మయులై పోయేవారు.
ఇటువంటి మహోత్కృష్ట కళాకారునికి ఇల్లాలే దొరికింది. ఆమె కూడా సంగీత విద్వాంసురాలే. అతనికి సాయంగా వాయులీనం వాయించగలదు. కిన్నెర కంఠంతో పాటకూడా పాడగలదు. అంతటి విద్వాంసురాలికి తగిన భర్త ఆనందమూర్తేనని ఆమె తాతగారు ఆమెను అతని కిచ్చి వివాహం చేస్తాడు.
వివాహం అయినాక ఆమెకు మొదట భర్త, ఆ తరువాతే సంగీతం. అతనికి సంగీతమే మొదటిది, దాని తరువాతే ఎవరైనాను. క్రొత్తలో ఇద్దరూ ఆనందంలో తేలియాడారు. క్రమంగా ఇద్దరి స్వభావాలూ బహిర్గతమైనాయి. ఆమెకు అంతులేని దుఃఖం కలిగింది. తనకంటె అతడికి వీణె ఎక్కువని మాత్సర్యం కూడా కల్గింది. అంతవరకూ సంగీత సరస్వతి నారాధించిన ఆమె పెళ్ళికాగానే తటస్థురాలెందుకైనది ? భర్తను ప్రేమిస్తూనే సంగీత సాధనం చేయడం కుదరదా ? రచయిత దృష్టిలో, కుదరదనే స్పష్టమౌతోంది. సంగీత సాధనకు శారీరక మానసిక శ్రమ తప్పదు. ఇక సంసార నిర్వహణలో భర్తకేమి కావాలో మహా జాగ్రత్తగా చూస్తూంటే సంగీతానికి ఏకాగ్రమైన దీక్షను వహించలేకపోవచ్చు. సంగీతం యాంత్రికమైన పనికాదు. మానసికమైనది.
స్త్రీల కళలు వివాహమైనాక మరుగున పడటం సాధారణమైన విషయమే. అందుకే లోగడ పెళ్ళి సంగీతం అనేవారు. పెళ్ళి చూపులప్పుడు అమ్మాయి హార్మనీపెట్టి ముందుపెట్టుకొని శ్రీగణనాధ పాడితే చాలు, గొంతు ఎలా ఉందో తెల్సుకోడానికి అంత కన్న ఎక్కువ నేర్చుకున్నా, లాలిపాటలతో సంగీతం సమసిపోవాల్సిందే. ఇది సాధారణ విషయం. నూటికో కోటికో కడదాకా కళారాధన చేసేవారూ ఉంటారు. ఈ కథ ఈ రకమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాయబడినదేమో నన్పిస్తుంది.
ఆనందమూర్తి భార్యకు వీణపై ఆగ్రహం కలిగి ఒకనాటి రాత్రి వీణ తీగలను ముక్కులు ముక్కలుగా తెంచిపారేస్తుంది. మీటలు ఊడ బెరికింది. తంత్రీపీఠమూ, తుంబీ ఫలమూ విడివిడి పోయాయి. ఆ క్షణంలో ఆనందమూర్తికి మెలకువ వచ్చి, అడ్డుపడి, తన కత్యంత ప్రియమైన వీణ నా స్థితిలో చూచి మూర్ఛపోతాడు మెలకువ వచ్చాక, తన భార్యలోని సంఘర్షణ నర్థం చేసుకొంటాడు. ఆమెకు తాను చేసిన నిరాదరణ నర్థం చేసుకొంటాడు. అతని హృదయంలో ప్రేమ మహా ప్రవాహంగా పెల్లుబికివచ్చింది.
ఇరువురూ కలిసి మరలా వల్లకీబాలను సాలం కృతను చేశారు. ఇచట సంఘర్షణకు కారకురాలైనది వీణ. కళాకారులు భార్యా బిడ్డలను విస్మరించి, ఆమెనే ప్రధమ భార్యగా స్వీకరిస్తారనే సత్యాన్ని వీణ కధలో రచయిత చెప్తారు. సహజంగా కూడా ఇలాగే జరుగుతుంది. ప్రఖ్యాత రచయితల భార్యలు వారి భర్త వ్రాసిందేమిటో తెలుసుకోరు, ఎంతటి మహోతుకృష్ట గ్రంధమైనా చదవరు. ఉదాసీనంగా ఉంటారు. కొండొకచో వ్యతిరేకిస్తారుకూడా. భార్యను లాలిస్తూనే కళారాధన చేయాలన్నది ఇందులోని ముఖ్య విషయం కాదు గదా !
సంధ్యా నృత్యం కథ నాట్యకళకు అద్దం పట్టే రచన. అరవిందా దేవి హిమధవళ పాదాలు అరుణదశాంతర తలాలు తారకా కాంతులపైన ఆనంతపధాంచలాల మీద అంటీ అంటనట్లు నాట్యం చేస్తున్నాయి. ఆమె పాదాలు నేలమీద క్షణం సేపు కూడా ఆగడంలేదు. అంతటి వేగాన్ని ఆమె అభ్యాసం చేసుకొంది. ఆమె దేహం కదులతూంటే గాలికి శంపాలతలు కదలినట్లే ! ఈమె నాట్య శాస్త్రాన్ని పుడిసిటితో అవపోశన పట్టిన పృధుకల్పాచార్యుల శిష్య. పృధుకల్పాచార్యునితో సమాన ప్రతిభను సంతరించుకోడానికి అహర్నిశలూ శ్రమిస్తున్న కుమార వీరునికి సహాధ్యాయురాలు. అరవింద కుమారవీరుల నాట్య సమయాలు వేరువేరవడం చేత ఒకరి నాట్యాన్ని ఒకరు చూచుకొనలేదు. కానీ ఒకనాడు కుమారవీరుడు అరవిందాదేవి అపురూపంగా నాట్యమాడేవేళ వెళ్ళి చూచాడు. ఆమె ఎవరిని ప్రశ్నిస్తాడు. కాని గురువు ఆమె ఎవరో చెప్పడు.
ఆనాటినుండి అదే దృశ్యం. ఆమె లాస్యమే అతనిని వెంటాడుతుంది. ప్రణయ పయోధిలో అతనిని ముంచి వేసిందామె ఒక్క క్షణంలో. ఆమెకు చేరువయేందుకు కూడా నాట్యాన్ని మరింత ఉధృతంగా సాధనచేస్తాడు. క్రమంగా ఒకరి ఎదుట ఒకరు నాట్యంచేస్తూ ప్రతిభను మరింతగా పెంపొందించుకుంటారు. కుమార సంభవం యక్షగానంలో ఇరువురూ కలిసి నాట్యం చేయవలసి వస్తుంది. ఇరువురిలో మధురోహాలు రేకెత్తుతాయి.
కుమార వీరుడు ఆ దేశానికి రాజు. అరవిందాదేవి ఉదయగిరి ప్రభువైన చంద్రాపతిరెడ్డి కుమార్తె. చంద్రావతి తిరుగుబాటు చేయదలచినాడని కొందరు చెప్పిన అసత్యాలను నమ్మిన చక్రవర్తి అతనిని యుద్ధంలో ఓడించి తరిమివేశాడు. ఆనాటినుండి అరవిందాదేవి కుటుంబం ప్రచ్ఛన్నంగా జీవిస్తోంది. కుమార వీరుడు చక్రవర్తి కుమారుడని అరవిందకు తెలియదు. అరవింద చంద్రాపతిరెడ్డి కుమార్తె అని కుమార వీరుడికి తెలియదు.
సంక్రాంతి పండుగ వినోదాలలో నృత్య విద్యా ప్రదర్శనాన్ని చక్రవర్తి ఏర్పాటు చేశాడు. సభలో కుమారవీరుడు అత్యద్భుతంగా నాట్యం చేస్తాడు. అతని తరువాత అతనిని మించిన నాట్యాన్ని ఒక నూత్న కళాకారుడు ప్రదర్శింుడు ప్రదర్శించాడు. అరవిందాదేవి అతని చెంతకు వెళ్ళి జోహారులర్పించి, మూర్ఛపోతుంది.
|