14
 


అర్జునుడు లెక్క‌వేసి అజ్ఞాత‌వాస సంవ‌త్స‌రం స‌రిగా దాటింద‌ని నిర్ధార‌ణ చేసాడు. నువ్వు వెళ్ళి వాళ్ళ‌తో, మ‌న బృహన్న‌ల‌కు ర‌థ‌సార‌థ్యం చేత‌న‌వును. ఖాండ‌వ వ‌న ద‌హ‌నం అప్పుడు అర్జునుడి ర‌థ‌సార‌థ్యం చేసిన‌ది బృహ‌న్న‌లే అర్జునుడి ర‌థాన్ని ఎప్పుడూ బృహ‌న్న‌లే తోల‌డం నేను ఎరుగుదును.  బృహ‌న్న‌ల సాయంతో కౌర‌వ సైన్యాన్ని ఓడించ‌డం నిస్సందేహం అని గ‌ట్టిగా చెప్పు. వాళ్ళు కాదు, కూడదు అంటే ఎలాగో అలాగ వాదించి న‌న్ను పిలిపించే విధానం చూడు అన్నాడు.

అలాగే అంటూ సైరంధ్రి ఉత్త‌ర వ‌ద్ద‌కు వెళ్ళెంది. రాకుమారుడు త‌గిన సార‌థి కొర‌కు వెద‌కుతున్నాడు. తెలిసిన విష‌యం చెప్పాలి క‌దా ! అర్జునుడంత వాని మెప్పుపొందిన గొప్ప ర‌థ‌సార‌థి మ‌న బృహ‌న్న‌ల‌. అర్జునుడికి ఖాండ‌వ ద‌హ‌నంలో విజ‌యానికి కార‌ణం బృహన్న‌ల చాక‌చ‌క్య‌మే అని అంద‌రికీ తెలుసుగ‌దా ! ఈ సంగ‌తి మీ అన్న‌య్య‌తో చెపుదాం ప‌ద అంటూ ఆమెను వెంట‌బెట్టుకొని ఉత్త‌రుడి వ‌ద్ద‌కు పోయి అత‌నితో అర్జునుడు చెప్ప‌మ‌న్న మాట‌లు చెప్పింది  సైరంధ్రి.

సైరంధ్రి మాట‌లు వినేస‌రికి ఉత్త‌రుడు ఫ‌క్కున న‌వ్వి.

అయ్యో ! సైరంధ్రి ! న‌న్నిలాగ ఎగ‌తాళి చేయ‌డం ఎందుకు ?  నేను పేడి ముఖాన్ని క‌న్నెత్తి చూడ‌లేను. వాడు ప‌ర‌మ రోత ! అలాంటి పేడివాణ్ణి ర‌థ‌సార‌థిగా చేసుకొని యుద్ధానికి ఎలా పోగ‌ల‌ను ?  పైగా ఇప్పుడు వ‌చ్చింది కౌర‌వ సైన్య‌మా ?  దానిపై బాహుబ‌లం చూప‌డానికి నేను వెడుతున్నాను ?  ఇటువంటి స‌మ‌యంలో నా ర‌థాన‌కి బృహ‌న్న‌ల సార‌థి అయితే ఊళ్ళో వాళ్ళంతా పొట్ట‌లు చెక్క‌ల‌యేట్లు నవ్వ‌రా ?  ర‌ధ‌చోదకుల‌కు ఇంత క‌రువు వ‌చ్చిందా ?  అన్నాడాత‌డు.

కౌర‌వ సైన్య‌మే కాదు, ముల్లోకాలు ఒక్క పెట్టున ఎత్తి వ‌చ్చినా స‌రే బృహ‌న్న‌ల ర‌థం న‌డుపుతే గెల్వ‌వ‌చ్చు. ఆ వీర‌త్వం ముందుముందు నీకే తెలుస్తుంది. కార‌ణాంత‌రాల వ‌ల్ల న‌పుంస‌కుడ‌యితే శౌర్యం అంత‌రిస్తుందా ?  అన్నాది సైరంధ్రి.

ఉత్త‌రుడికి యుద్ధం చేయాల‌ని ఉబ‌లాటం ఎక్కువ‌గా ఉన్న‌ది. అప్ప‌ట్లో త‌న‌కు ర‌థ‌సార‌థి కుద‌ర‌క బృహ‌న్న‌ల‌ను ర‌థ‌సార‌థిగా అంగీక‌రించినాడు.

నేను తీసుకొస్తాను అంటూ ఉత్త‌ర వడివ‌డిగా న‌ర్త‌న‌శాల‌వైపు న‌డిచింది. మేఘాన్ని చొచ్చుకుపోయే మెర‌పు తీగ‌లా న‌ర్త‌న‌శాల‌లోకి చొచ్చుకుపోయింది.

గురూత్త‌మా ! మా అన్న‌య్య ర‌థ‌సార‌థి ఒకానొక క‌య్యంతో చ‌చ్చిపోయాడు. త‌గిన‌వాడు దొర‌క‌క‌పోవ‌డంవ‌ల్ల ఆ పనికి ఇంత‌వ‌ర‌కూ అత‌డు ఎవ‌రినీ నియోగించ‌లేదు.

ఇప్పుడు కౌర‌వులు మ‌న ప‌శువుల్ని ప‌ట్టార‌ని వార్త వ‌చ్చింది. అన్న‌య్య వాటిని విడిపించుకు రావ‌టానికి వెళ్ళాల‌నుకుంటే తీరా ర‌థ‌సార‌థి కుద‌ర‌క విచారిస్తున్నాడు. నీ సంగ‌తి సైరంధ్రి చెప్పేస‌రికి సంతోషించి నిన్ను తీసుకుర‌మ్మ‌న‌మ‌ని పంపించాడు. నీ ద‌గ్గ‌ర నాకు ఉండే చ‌నువువ‌ల్ల నేను త‌ప్ప‌క తీసుకొస్తాను అని చెప్పి వ‌చ్చాను. నా మాట చోటు కానీయ‌క‌, మా అన్న‌య్య ర‌థం న‌డ‌ప‌డానికి ఒప్పుకొని ఈ ఆప‌ద దాటించాలి. నువ్వు ఒప్పుకోక‌పోతే నీకు నా మీద గ‌ల వాత్స‌ల్యం అంతా న‌ట‌న అనుకుంటాను అన్న‌దామె బృహ‌న్న‌ల‌తో.

బృహ‌న్న‌ల న‌వ్వి అమ్మాయి ! నాకు ర‌థ సార‌థ్యం ఏమి చేత‌నువును ?  అయినా నీ మాట కాదంటానా ?  ఏమ‌యితే అవుతుంది పోదాం ప‌ద‌. ఒక్క సార‌థ్యం అనే మాట ఏమిటీ, నీ చిన్నారి మ‌న‌స్సును సంతోష‌పెట్ట‌డానికి ఏమైనా చేస్తాన‌మ్మా అంటూ ఉత్త‌ర వెంట ఉత్త‌రుని వ‌ద్ద‌కు వ‌చ్చినాడు.

కౌర‌వుల‌తో క‌య్యం వ‌చ్చింది నాకు. నేడు ర‌థం నువ్వు తోలాలి. వేగంగా క‌వ‌చం తొడుక్కుని ర‌థం ఎక్కు. ఇంక అట్టే వేళ‌లేదు. నీ చాక‌చ‌క్యం, వీర‌త్వం అంతా సైరంధ్రి చెప్పింది. నీకు త‌ప్పదు అన్నాడు ఉత్త‌రుడు.

ఆట‌పాట‌ల‌కు అయితే న‌న్ను పిలిచినా పిల‌వ‌వ‌చ్చును గాని, నేను యుద్ధానికి వెడుతున్నాను. సార‌థ్యం చేయాలి అని పిలిస్తే నావ‌ల్ల అవుతుందా ?  బాగా వెతికితే దండ స‌త్తువ గ‌లవాడు ఎవ‌రైనా దొర‌క‌పోడు అన్నాడు  బృహ‌న్న‌ల‌.

ఖాండ‌వ ద‌హ‌నం నాడు ర‌ధ‌సార‌థ్యం చేసి అర్జునుడికి జ‌యం చేకూర్చిన‌నాటి బుద్ధి బ‌లం, బాహుబ‌లం హ‌రించి పోయాయా ?  నా మీద అభిమానంతో వేరుమాట చెప్ప‌క నా మాట విను అన్నాడు ఉత్త‌రుడు.

ఉత్త‌రుడికీ అడ్డు చెప్ప‌డానికి ఇష్టంలేక అంగీక‌రించిన‌ట్లుగా అంగీక‌రించాడు బృహ‌న్న‌ల‌. ఉత్త‌రుడు బృహ‌న్న‌ల ఒక క‌వ‌చం ఇప్పించాడు. అర్జునుడు దానిని తొడుగుకోడం చేత‌కాన‌ట్లుగా తిర‌గ‌బోర్లా తొడుగుకొని అక్క‌డ నున్న స్త్రీల‌ను న‌వ్వించాడు. ఉత్త‌రుడు క‌వ‌చం ధ‌రించి త్వ‌ర‌త్వ‌ర‌గా సిద్ధ‌మ‌య్యాడు.

నువ్వేం చెపుతే అది చేయాలి. నువ్వున్న, చోట ఉండాలి. నువ్వెళ్ళిన చోట‌కు వెళ్ళాలి. నా శ‌క్తిని తెలుసుకొని ప‌నులు వేయించుకొని గెలుపు సంపాదించు అంటూ హ‌యాన్ని ర‌థానికి జోడించి ధ్వ‌జ‌మెత్తాడు బృహ‌న్న‌ల‌.

ఓడిపోయిన ర‌ణ‌వీరుడు వ‌స్త్రాల‌తో విచిత్రాలైన రంగులు క‌ల‌చి మా బొమ్మ‌పొత్తిళ్ల‌కు కావాలి. వ‌చ్చేట‌ప్పుడు  తెచ్చిపెట్టండి అని ఉత్త‌ర‌, ఆమె చెలిక‌త్తెలు బృహ‌న్న‌ల‌ను కోరారు.

యువ‌రాజు జ‌య‌ల‌క్ష్మినే అస్తూ ఉంటే త‌ల‌పాగ గుడ్డ‌లు తేవ‌డం ఓ గొప్పా అలాగే త‌ప్ప‌కుండా తెస్తాను అంటూ బృహ‌న్న‌ల అస్త్ర‌శ‌స్త్రాల‌న్నీ ర‌థంలో ప‌దిలంగా సర్దాడు. ఇలా అర్జునుడు ఉత్త‌రుడు పాలెగాళ్లు చెప్పిన బొప్పున గోవుల‌ను ర‌క్షించేందుకు బ‌య‌లుదేరారు. పుర‌వృద్దాంగ‌న‌లు వారిని దీవించి సేస‌లు చ‌ల్లారు.

వారి ర‌థం శ్శ‌శాన‌వాటిక ప్రాంతం చేరింది. ఆల‌మంద‌ల వెనుక‌నే ద‌ద్ద‌రిలేట‌ట్లు నడుస్తూ ఉన్న ఆపార‌మైన కౌర‌వ సేన‌ను వారు చూసారు. ఉత్త‌రుడి శ‌రీరం గ‌గుర్పొడించింది. గ‌జ‌గ‌జ లాడింది. వెర్రి చూపుప‌డింది. దిగులు ప‌డ్డాడు.

అమ్మ‌య్యో ! ఆ భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోద‌నుడు ! ఆ మహాసైన్యం ! నేను యుద్ధం చేయ‌లేను ! శ‌క్తిలేదు. నాది అసంపూర్తి విద్య‌. పైగా ప‌సివాణ్ణి. ఆ శ‌కుని, సైంధ‌వుడు, విక‌ర్ణుడు, క‌ర్ణుడు ! వీళ్లను ఎదిరించ‌గ‌ల‌నా ?  ఇలాగ ఉంటుంద‌ని ఎరుగ‌క వ‌చ్చాను ! ఇపుడు మ‌న‌కు ఏది గ‌తి ! వీళ్లంతా మ‌హా యోధులు. వారిని ఎదుర్కోవ‌డం మ‌న వ‌శంగాదు.  నాకాళ్ళు ఇప్పుడే వ‌ణుకుతున్నాయి. శ‌రీరం గ‌డ‌గ‌డ లాడుతోంది ! ఊరికే తిరిగి పోవ‌డం బావుండ‌దు కాని ఇప్ప‌టి వ్య‌వ‌హారం చూస్తే నేను యుధ్ధం చేయ‌క‌పోవ‌డ‌మే క్షేమం. అతి త్వ‌ర‌గా ర‌థాన్ని మ‌ర‌ల్చు. బ‌తికి ఉంటే బ‌లుసాకు తిన‌వ‌చ్చు. ప్రాణ‌ల‌కంటే గోవులు ఎక్కువ‌కాదు. అని బెగ్గ‌డిల్లి పోయాడు ఉత్త‌రుడు.

బృహ‌న్న‌ల చిరున‌వ్వు న‌వ్వి.

ఆ ర‌ధాల గుంపు పైకి అమాంతంగా తోలుకుపోయేటంత వెర్రివాడినా ?  ముందు ఈ తుచ్చ సైన్యాన్ని చీల్చి పిమ్మ‌ట ఆవుల మంద‌ల‌ను మ‌ళ్లిద్దాము. అంతేగాని అలాగ ఆవులు పోతూంటే మ‌నం వెన‌క్కి వెళ్లిపోవ‌డం బావుండ‌దు. అంతఃపురంలోగ‌ల ఆడ‌వాళ్లంతా ఆనంద‌ప‌డేట్లాగ క్ష‌ణంలో ఆవుల్ని తీసుకొస్తాన‌ని చెప్పి ర‌థం ఎక్కి ఆర్భాటంగా ఇక్క‌డికి వ‌చ్చి ఏనుగుల్ని, గుర్రాల్ని, భ‌టున్నీ,చూసి భ‌య‌ప‌డ‌డం బాగాలేదు. అన్నాడు.

గోవుల గొడ‌వ ద‌య్యాల కెర‌క‌. ఆడ‌వాళ్ల ఆనందం నాకెందుకు ?  నేను యుద్ధం చేయ‌లేను. అన్నాడు ఉత్త‌రుడు గ‌ద్గ‌దిక‌తో.
త‌న భుజ‌బ‌లం శ‌త్రువు ద‌ర్భం తూచి చూసుకొని అటో ఇటో తేల్చుకోక‌పోతే శూరుడైన వాడెవ‌డైనా మెచ్చుకుంటాడా ?  ఇంత‌కూ ఈ సేన నీవైపు చూడ‌న‌న్నా లేదే ?  ముందుగానే నీకింద భ‌యం ఎందుకొచ్చిందీ ?  దిక్కులు బ్ర‌ద్ద‌ల‌యేట్లా ఉన్న‌వారి కోలాహ‌లానికి గ‌గ్గోలుప‌డ‌క ఆ సైన్యాలు పైకి లేపుతున్న‌ధూళి మేఘాలు చూసి జ‌డిసిపోక ఆ చ‌దురంగ బ‌లాన్ని చూసి బెగ్గ‌డిల్ల‌క వాళ్ల ఆస్త్ర‌వ‌స్త్రాలు  చూసి త‌ల్ల‌డిల్ల‌క ధైర్యంతో నిల‌బ‌డిపోరాడి గెలుస్తే కీర్తి వ‌స్తుందిగాని దూరాన్నించే ఇలా వెనుతిరిగి పోతే న‌లుగురూ న‌వ్విపోరా ?  అన్నాడ‌ర్జునుడు.

బృహ‌న్న‌లా ! ఒక్క మాట విను. నిన్న సుశ‌ర్మ ద‌క్షిణం వైపు మ‌న ప‌శువుల‌ను ప‌ట్టుకుంటే మీ నాన్న ఎన్ని సైన్యాలున్నాయో అన్నింటినీ త‌ర్లించుకు వెళ్లాడుతెలుసా ?   ఇవాళ మ‌న‌కో ?  ప‌ట్ట‌ణంలో ఒక్క‌డైనా తోడు వ‌చ్చేవాడు లేడు ! నేనొక్క‌ణ్ణే కురు సేన‌ను గెల్వ‌గ‌ల‌నా ?   ఎందుకొచ్చిన నీ వెర్రి మొర్రి మాట‌లు ?  వాళ్లెవ‌రూ చూడ‌క‌ముందే మ‌నం ర‌థం తోలుకొని వ‌డివ‌డిగా ఊరు చేర‌డం తెలివైన ప‌ని అన్నాడు ఉత్త‌రుడు.